Tamil Nadu : తమిళనాడులో అవయవదాత మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

తమిళనాడులో (Tamil Nadu) ఓ అవయవదాత (Organ donor) మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అవయవదాతలైన జీవన్మృతులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఈ నెల 23న సీఎం స్టాలిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Published : 26 Sep 2023 22:33 IST

Image : Subramanian_ma

చెన్నై : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం థేని జిల్లాలో ఓ అవయవ దాత (Organ donor) అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. వడివేలు (43) థేని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్నారు. శనివారం ఆయన విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన ద్విచక్రవాహనం ఆవును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఆయన బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని ఆదివారం వైద్యులు ప్రకటించారు. దాంతో మృతుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అంగీకార పత్రాలు సమర్పించి నేత్రాలు, కిడ్నీలు, కాలేయం, చర్మాన్ని దానం చేశారు. 

గత 30 రోజుల్లో.. 85 మంది ప్రపంచ నేతలను కలిశా: మోదీ

అవయవదాతలైన జీవన్మృతులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఈ నెల 23న సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. అవయవ దానంతో వందల మంది రోగులకు కొత్త జీవితాన్ని ఇచ్చే గురుతర సేవలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. బాధాకర పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చే వారి నిస్వార్థ త్యాగంతోనే ఇది సాధ్యపడిందని తెలిపారు. అటువంటి వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని