PM Modi: కజిరంగ నేషనల్‌ పార్క్‌లో.. ఏనుగుపై మోదీ సఫారీ

PM Modi: ప్రధాని మోదీ తొలిసారిగా అస్సాంలోని కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అభయారణ్యంలో ఏనుగుపై సఫారీ చేశారు.

Updated : 09 Mar 2024 10:32 IST

కజిరంగ: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) శనివారం అస్సాం (Assam)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్‌ (Kaziranga National Park)ను ఆయన సందర్శించారు. అక్కడ ఏనుగు ఎక్కి (elephant safari) సఫారీ చేశారు. 1957 తర్వాత ఈ పార్క్‌ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం. 

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం మోదీ అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఛాపర్‌లో గోలాఘాట్‌ జిల్లాలోని కజిరంగకు వచ్చారు. నిన్న రాత్రి జాతీయ పార్క్‌లోనే సేదతీరిన ఆయన.. ఈ తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్‌ కొహోరా రేంజ్‌ను సందర్శించారు. తొలుత ఏనుగు ఎక్కి విహరించిన ప్రధాని.. ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. ఈ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించారు.

మోదీ వెంట పార్క్‌ డైరెక్టర్‌ సొనాలీ ఘోష్‌, అటవీశాఖ సీనియర్‌ అధికారులున్నారు. సఫారీ అనంతరం ఏనుగులకు చెరకు గడలను తినిపించారు. ఈ సందర్భంగా మహిళా ఫారెస్ట్‌ గార్డ్‌లతో ప్రధాని ముచ్చటించారు. ఈ చిత్రాలను మోదీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు.

‘భవిష్యత్తును ఊహించగలను’: జాతీయ పురస్కారాల ప్రదానంలో ప్రధాని మోదీ

పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం జోర్‌హట్‌లో కమాండర్‌ లచిత్‌ బర్ఫుకాన్‌ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. శౌర్యానికి ప్రతీకగా 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇక, రూ.18వేల కోట్ల విలువ కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు