Parliament Session: మణిపుర్‌ ఘటనపై అట్టుడికిన రాజ్యసభ

Parliament: మణిపుర్‌ అంశంతో పార్లమెంట్‌ భగ్గుమంది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 20 Jul 2023 12:32 IST

దిల్లీ: మణిపుర్‌ (Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పార్లమెంట్‌ ఎగువసభను కుదిపేసింది. ఆ రాష్ట్రంలో అల్లర్లు, తాజా ఘటనపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ(Rajya Sabha)లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వాయిదా పడింది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు (Parliament Mansoon Session) గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఇటీవల మృతిచెందిన సిట్టింగ్‌ సభ్యులు, మాజీలకు సభలు సంతాపం ప్రకటించాయి.  అనంతరం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ (Rajya Sabha) తిరిగి మొదలవ్వగా.. మణిపుర్‌ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.

నగ్నంగా మహిళల ఊరేగింపు.. వీడియోలు తొలగించాలని కేంద్రం ఆదేశాలు..!

సభలో ఇతర కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసి మణిపుర్‌ అంశంపైనే చర్చ జరపాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చి ఘటనపై సమాధానం చెప్పాలన్నారు. సభ్యులు సంయమనం పాటించాలని ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ కోరారు. అయినప్పటికీ విపక్ష నేతలు నినాదాలు చేయడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టబోమని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని