అంబానీ నివాసంలో పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు

Ganesh Chaturthi Celebrations: గణేశ్‌ చతుర్థి వేడుకలు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసంలో వైభవంగా జరిగాయి.

Updated : 20 Sep 2023 21:25 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) నివాసంలో వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకలు వైభవంగా జరిగాయి. ముంబయి (Mumbai)లోని తన నివాస భవనం ఆంటిలియా(Antilia)లో వినాయక మండపాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. పర్యావరణహితంగా.. భారతీయత ఉట్టిపడేలా అలంకరించిన ఈ మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. పీపుల్‌, ప్లానెట్‌, పర్పస్‌ అనే అంశాలను మూడు స్తంభాలుగా చేసుకొని ఈ అలంకరణ చేపట్టారు. పండగ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అంబానీ నివాసానికి రావడంతో సందడి నెలకొంది.

మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో..

‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తిని చాటడమే లక్ష్యంగా గణేశ్‌ మండపాన్ని తీర్చిదిద్దారు. గణేశ్‌ మండపం అలంకరణలో మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటారు. ఈ మండపం మధ్యలో పైథాని కళాఖండాన్ని ఏర్పాటు చేశారు. పైథాని అనేది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని పైథాన్ నగరం నుంచి ఉద్భవించిన ఓ కళారూపం.  ఇది తరతరాలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. లఖ్‌నవూలోని జిర్దోజీ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ నుంచి ఒడిశాలో చేతితో తయారు చేసే పేపర్‌ మాచే వరకు మొత్తం భారతీయ హస్తకళలతో మండపం కనువిందు చేస్తోంది.

సాధికారత, జీవనోపాధి కల్పన..

కళాకారులకు జీవనోపాధితో పాటు సాధికారత కల్పించడమే లక్ష్యంగా విఘ్నేశ్వరుడి ఊరేగింపు కోసం దాదాపు 700 మందికి పైగా మహిళలు తమ స్వహస్తాలతో రూపొందించిన వివిధ రకాలైన బొమ్మలను ఉంచారు. వీటి తయారీలో వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలను ఎంపిక చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించారు. ఏటా వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక కళాకారుల జీవితాల్లోనూ ఆనందం కలిగిస్తుందని రిలయన్స్‌ పేర్కొంది. 400 మందికి పైగా కళాకారులు పురాతన పుష్పాలను అతికించే పద్ధతులను ఉపయోగించి గణేశుడి విగ్రహం వెనుక పూల గోడను ఎంతో అద్భుతంగా అలంకరించారు. గజానన కారిడార్ 32 వినాయకుడి రూపాలతో అలంకరించడంతో పాటు ప్రతి ఒక్కదాన్నీ పైథాని కళాఖండంతో అద్భుతంగా చెక్కారు. 900 మందికి పైగా ఎంబ్రాయిడరీ కళాకారులు 5వేల గంటలకు పైగా శ్రమించి గణేశుడి పురాణాలు, ప్రాముఖ్యత, దైవిక అద్భుతాలను తెలిపేలా వస్త్రాలను రూపొందించారు. ఐదు లక్షలకు పైగా మువ్వలతో వస్త్రాన్ని రూపొందించి అలంకరించారు.

భూ గ్రహాన్ని కాపాడుకొనేలా.. 

రిలయన్స్ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వినాయక చవితి వేడుకల డేకరేషన్‌లో వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రాధాన్యమిచ్చింది. వినాయక మండపంలో వాడే వస్త్రం, పువ్వులు, ఆకులు.. ఇలా ప్రతీది ఆలోచనాత్మకంగా ఎంపిక చేసుకుంది. బొమ్మలు, లాకెట్లు తయారు చేసేందుకు పాత దుస్తులు వినియోగించారు. పూలు, వస్త్రాలతో అలంకరించిన పీవీసీ పైపులపై మూషక్‌, మోదక్‌ బొమ్మలు వేశారు. గణపతి ఉత్సవాన్ని నిర్వహించడానికి ఉపయోగించే అన్ని సహజ పువ్వులు రీసైకిల్ చేస్తారు. వీటితో మొక్కలకు ఎరువులు, ఆలయాలకు అగరు బత్తీలు తయారు చేయనున్నారు. ఈ మండపంలో సంప్రదాయంగా లభ్యమయ్యే సహజ పట్టు, పత్తి, వస్త్రాలను ఉపయోగించి పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు