Kiren Rijiju: సీజేఐ తీర్పుపై కిరణ్‌ రిజిజు ప్రశంసలు

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌ ఇచ్చిన ఓ తీర్పుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగ వ్యక్తికి సకాలంలో న్యాయం అందించడం ఎంతో తృప్తినిచ్చిందని ప్రశంసించారు.

Published : 01 May 2023 15:03 IST

దిల్లీ: ‘కొలీజియం’ అంశంలో సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య ఇటీవల అభిప్రాయభేదాలు నెలకొన్న వేళ.. తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ (D Y Chandrachud) ధర్మాసనం ఇచ్చిన ఓ తీర్పుపై న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) ప్రశంసలు కురిపించారు. సీజేఐ నిర్ణయం హృదయాన్ని తాకిందని కొనియాడారు. అసలేం జరిగిందంటే..

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)కు చెందిన ధనంజయ్‌ కుమార్‌ సివిల్ జడ్జీల నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దివ్యాంగుడైన అతడు చేతితో పరీక్ష రాయలేరు. దీంతో ప్రిలిమినరీ పరీక్షకు స్క్రైబ్‌ను వెంట తెచ్చుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఉత్తరాఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UKPSC)ను అభ్యర్థించారు. ఇందుకు యూకేపీఎస్సీ నిరాకరించడంతో ధనంజయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను రైటర్స్‌ క్రాంప్‌ (writer's cramp) అనే సమస్యతో బాధపడుతున్నానని, తనకు స్క్రైబ్‌ (scribe)ను అనుమతించాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. దీంతో పాటు తన వైకల్యంపై ఎయిమ్స్‌ ఇచ్చిన సర్టిఫికేట్‌ను కూడా సమర్పించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ (D Y Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం యూకేపీఎస్సీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. అతడికి స్క్రైబ్‌ను ఎందుకు నిరాకరించారో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. మరోవైపు, త్వరలో జరగబోయే సివిల్‌ జడ్జీల పరీక్షకు హాజరయ్యేందుకు ధనంజయ్‌కు స్క్రైబ్‌ను అనుమతించాలంటూ ఉత్తరాఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తీర్పుపై న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ సీజేఐపై ప్రశంసలు కురిపించారు. ‘‘ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ తీసుకున్న నిర్ణయం హృదయాన్ని కదిలించింది. జ్యుడీషియల్ సర్వీస్‌ పరీక్ష రాయాలనుకున్న దివ్యాంగుడికి ఈ తీర్పు గొప్ప ఉపశమనం కల్పించింది. ఆ వ్యక్తికి సకాలంలో న్యాయం అందించడం ఎంతో తృప్తినిచ్చింది’’ అని రిజిజు (Kiren Rijiju) ట్విటర్‌లో రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని