NCP: ఎన్‌సీపీ తిరుగుబాటులో ‘బాహుబలి’ పోస్టర్లు..!

ఎన్‌సీపీ(NCP పార్టీ ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో పవార్‌ వర్గాల ఎత్తులు కొనసాగుతున్నాయి. 

Updated : 06 Jul 2023 17:42 IST

ముంబయి: ఎన్‌సీపీ(NCP)పై పట్టు నిలబెట్టుకునేందుకు అటు శరద్‌ పవార్‌(Sharad Pawar), ఇటు అజిత్ పవార్(Ajit Pawar) వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అజిత్‌ పవార్‌ తిరుగుబాటును ఉద్దేశిస్తూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. వాటిలో జూనియర్ పవార్‌ను ద్రోహి అని అభివర్ణించారు. ఇలాంటి వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని విమర్శించారు.

దిల్లీలోని శరద్ పవార్ ఇంటి వెలుపల ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ‘మన మధ్యలోనే ఉన్న ద్రోహులను దేశం మొత్తం చూస్తోంది. వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరు’ అని సీనియర్ పవార్ వర్గం విమర్శలు గుప్పించింది. అలాగే పోస్టర్లపై తెలుగు బ్లాక్‌ బస్టర్ ‘బాహుబలి’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రచురించింది. బాహుబలిని కట్టప్ప వెనక నుంచి కత్తితో పొడిచే దృశ్యమది. అయితే కట్టప్ప స్థానంలో అజిత్ పవార్‌(Ajit Pawar), బాహుబలి స్థానంలో శరద్‌ పవార్‌(Sharad Pawar)ను ఉంచారు. అత్యంత ఆత్మీయంగా మెలిగిన వ్యక్తే వెన్నుపోటు పొడిచారనేది దీని సారాంశంగా కనిపిస్తోంది. ఎన్‌సీపీ విద్యార్థి విభాగం దీనికి ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ‘(ద్రోహి)’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వాటిపై ప్రస్తావించారు.  

బుధవారం రెండు వర్గాలు ముంబయిలోని వేర్వేరు వేదికల్లో ఒకే సమయంలో తమ బలాన్ని ప్రదర్శించుకున్న సంగతి తెలిసిందే. అజిత్ సమావేశానికి 32 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారని, అలాగే శరద్‌ పవార్‌ సమావేశానికి 18 మంది చట్టసభ సభ్యులు హాజరయ్యారని సమాచారం. పార్టీ పేరు, గుర్తు కోసం అజిత్ వర్గం ఇప్పటికే ఈసీని ఆశ్రయించింది. మరోపక్క శరద్ పవార్‌(Sharad Pawar) వర్గం ఈ రోజు దిల్లీలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననుంది. దీనికోసం శరద్‌ పవార్ దిల్లీ బయలుదేరి వెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని