
Caste Census: కులగణనను భాజపా ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సుశీల్ మోదీ
పట్నా: జనగణనను కులాలవారీగా చేపట్టాలనే డిమాండును తామెప్పుడూ వ్యతిరేకించలేదని భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. కులగణనపై సోమవారం ప్రధాని మోదీతో చర్చిండానికి వెళుతున్న బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌తో కూడిన బృందంలో భాజపా ప్రతినిధి కూడా ఉంటారని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘బ్రిటీష్ పాలనలో చివరిసారి 1931లో జనగణన జరిగింది. అప్పుడు బిహార్, ఝార్ఖండ్, ఒడిశా కలిసి ఉండేవి. అప్పట్లో కోటి మంది జనాభా ఉన్న బిహార్‌లోని 22 కులాల్లో మాత్రమే జనగణన చేశారు. 90 ఏళ్లు గడిచింది. ఆర్థిక, సామాజిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కులగణన చేపట్టడానికి అనేక సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ.. సైద్ధాంతికంగా భాజపా ఎప్పుడూ సమర్థిస్తుంది. 2011లో గోపీనాథ్ ముండే దీనిపై పార్టీ అభిప్రాయాన్ని పార్లమెంటు ముందుంచారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర గ్రామీణ, పట్టణ మంత్రిత్వ శాఖలు సామాజిక, ఆర్థిక, కులాలవారీ సర్వే నిర్వహించాయి. అప్పటికీ కులాల సంఖ్య లక్షలకు చేరింది. తీవ్ర గందరగోళం మధ్య ఆ నివేదికను బహిర్గతం చేయలేదు’’ అని ట్విటర్‌లో సుశీల్ మోదీ తెలిపారు.
జనగణనను ఈసారి కులాలవారీగా చేపట్టాలనే డిమాండు ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు మోదీతో చర్చించడానికి నీతీశ్ కుమార్‌తో పాటు తేజస్వీ యాదవ్ సిద్ధమయ్యారు. అయితే, కులగణన వల్ల అసమానతలు పెరిగిపోతాయని వాదిస్తున్న భాజపా ప్రభుత్వం.. ఈ సారి జనగణన కులాలవారీగా ఉండబోదని పార్లమెంటు వేదికగా ప్రకటించింది. కులాల విభజన భారతీయ సమాజాన్ని బలహీనపరుస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకన్నా దేశ సమైక్యత, సమగ్రతలు ముఖ్యమని భాజపా వాదిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుశీల్ మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.