Afghanistan: రాజకీయాల్లోకి మహిళలా..? పగలబడి నవ్విన తాలిబన్లు

తాలిబన్లు మహిళలను ఎంత తక్కువ చేసి చూస్తారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మహిళల పట్ల వారికున్న అభిప్రాయం ఏంటో తెలిసిపోతుంది. అఫ్గానిస్థాన్‌​ మొత్తం మీ ఆధీనంలోకి వచ్చాక మహిళలను రాజకీయ నేతలుగా....

Published : 18 Aug 2021 23:04 IST

కాబుల్‌: తాలిబన్లు మహిళలను ఎంత తక్కువ చేసి చూస్తారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మహిళల పట్ల వారికున్న అభిప్రాయం ఏంటో తెలిసిపోతుంది. అఫ్గానిస్థాన్‌​ మొత్తం మీ ఆధీనంలోకి వచ్చాక మహిళలను రాజకీయ నేతలుగా ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఉంటుందా అని ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు వారు పగలబడి నవ్వారు. కెమెరా ఆఫ్ చేయమని చెప్పి మరీ వెటకారంగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో అనేక మంది దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తాలిబన్లు పాలన చేపట్టడంతో అక్కడి ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ముఖ్యంగా మహిళలైతే మళ్లీ పాత రోజులొస్తాయని బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళా జర్నలిస్టు కొందరు తాలిబన్లతో ఇంటర్వ్యూ నిర్వహించారు. తాలిబన్ల పాలనలో ఆడవాళ్లకు ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయా? అని ప్రశ్నించారు. అందుకు వారు అవునని సమాధానం ఇచ్చారు. అయితే రాజకీయాల్లో మహిళా నేతలకు ఓటు వేసి ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఉంటుందా? అని జర్నలిస్టు ప్రశ్నించడంతో వారు ఎలాంటి సమాధానం చెప్పకుండా పగలబడి నవ్వారు. నవ్వు ఆపుకోలేక కెమెరా ఆఫ్ చేయమని చెప్పారు. మహిళలంటే తాలిబన్లకు ఎంత చులకనో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది.

కాబుల్‌లో తాలిబన్లు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ఇస్లామిక్ చట్టం (షరియా) ప్రకారం మహిళల హక్కులను గౌరవిస్తామని పేర్కొన్నారు. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. మహిళకు స్వేచ్ఛనిస్తామని కానీ ఏదైనా ఇస్లామిక్‌ చట్టానికి లోబడే ఉంటుందని పేర్కొన్నారు. కానీ తాలిబన్ల మాటలను ప్రజలు విశ్వసించడంలేదు. ముఖ్యంగా మహిళలు.. తమ మానప్రాణాలకు రక్షణ ఉండదని వణికిపోతున్నారు. అఫ్గాన్‌ తొలి మహిళా మేయర్‌, మహిళల హక్కుల సాధికారతకు కృషి చేసిన జరిఫా గఫారీ ఆవేదనకు గురయ్యారు. నాలాంటి వారికి రక్షణ లేదని.. వారు ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని చంపేస్తారని భయాందోళన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని