Amit Shah: అదే మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన ఘన విజయం

గత ఏడు సంవత్సరాల్లో  ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించిందని కేంద్రమంత్రి అమిత్‌ షా అన్నారు.

Published : 18 Dec 2021 01:09 IST

దిల్లీ: గత ఏడు సంవత్సరాల్లో  ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించిందని కేంద్రమంత్రి అమిత్‌ షా అన్నారు. తమ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు.. దాని ఉద్దేశం చెడ్డదని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం సాధించిన విజయాలను ప్రస్తావించారు. 60 కోట్ల మంది దేశ ప్రజల్ని అభివృద్ధి ప్రక్రియలో భాగం చేయడమే ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయమన్నారు. 

‘గత ఏడేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. అవినీతి రహిత పాలన అందించాం. ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి రెండు తప్పే కావొచ్చు. కానీ ప్రభుత్వ ఉద్దేశం చెడ్డదని విమర్శకులు కూడా ఎత్తి చూపలేరు. దేశంలో 60 కోట్ల మందికి బ్యాంక్‌ ఖాతా, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కనెక్షన్లు లేవు. సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వారికి అవన్నీ ఇచ్చింది. అది ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వారంతా అభివృద్ధికి దూరంగా ఉన్నారు’ అని అమిత్‌ షా వెల్లడించారు. 

అలాగే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఎటువంటి రక్తపాతం లేకుండా రద్దు చేస్తారని ఎవరూ అనుకోలేదన్నారు. అలాగే అయోధ్య రామ మందిర వివాదం గురించి అలాగే భావించారన్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుందన్నారు. గత 50 ఏళ్లలో నాలుగు నుంచి ఐదు చెప్పుకోదగ్గ నిర్ణయాలు తీసుకుంటే.. ఈ ప్రభుత్వం ఏడేళ్లలో 50 పెద్ద నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. మహమ్మారి తర్వాత బలమైన ఆర్థిక కార్యకలాపాలతో ముందుకు వచ్చిన దేశం భారతేనన్నారు. ఈ సందర్భంగా ఫిక్కీకి మంత్రి కొన్ని సూచనలు చేశారు.

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. విపక్షాలపై పదునైన విమర్శనాస్త్రాలతో దూకుడుని పెంచుతోంది. తాజాగా తమ కొత్త మిత్రపక్షం నిషద్‌ పార్టీ లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. గతంలో యూపీని పాలించిన బీఎస్పీ, ఎస్పీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ యూపీలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి సొంత కులాల కోసమే పనిచేశారని ఆరోపించారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని దేశంలోని వెనుకబడిన కులాలు, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హయాంలో నేరగాళ్లు, మాఫియా శక్తుల్ని నిర్మూలించారని ప్రశంసించారు. గత ప్రభుత్వాలది మాఫియా పాలన అని, వారి హయాంలో పేద ప్రజల అభ్యున్నతి జరగలేదంటూ అమిత్ షా విరుచుకుపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు