సివిల్స్‌ ర్యాంకుల్లో గందరగోళం.. అసలు అభ్యర్థులను తేల్చిన UPSC

యూపీఎస్సీ సివిల్స్‌ (UPSC Civils) పరీక్షల్లో ఒకే రోల్‌ నంబరుతో ఇద్దరు అభ్యర్థులు తాము ర్యాంకులు సాధించినట్లు చెప్పడం గందరగోళానికి దారితీసింది. మధ్యప్రదేశ్‌, బిహార్‌లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో యూపీఎస్సీ చర్యలు చేపట్టింది.

Updated : 26 May 2023 21:32 IST

దిల్లీ: దేశంలో అత్యున్నత సర్వీసుల్లో నియామకాల కోసం జరిగే సివిల్‌ సర్వీస్‌ (UPSC Civils) పరీక్ష 2022 ఫలితాలు గత మంగళవారం వెలువడ్డాయి. అయితే ఇందులో ఒకే ర్యాంక్‌ను ఇద్దరు అభ్యర్థులు తమదంటే తమదని చెప్పడం గందరగోళానికి దారితీసింది. రెండు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో యూపీఎస్సీ (UPSC) దర్యాప్తు చేపట్టింది. అసలు అభ్యర్థులను గుర్తించిన కమిషన్‌.. మోసానికి పాల్పడిన మిగతా ఇద్దరిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది.

అసలేం జరిగిందంటే..

యూపీఎస్సీ (Civils Results) ఫలితాల్లో 184వ ర్యాంక్‌ తనదేనంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయేషా ఫాతిమా (23), ఆయేషా మక్రాని (26) మీడియా ముందుకొచ్చారు. వీరిద్దరి ఒకటే రోల్‌ నంబర్‌ను చెబుతూ.. యూపీఎస్సీకి తమ అడ్మిట్‌ కార్డులను సమర్పించారు. అయితే ఈ ఇద్దరి అడ్మిట్‌ కార్డులను నిశితంగా పరిశీలించగా కొన్ని వ్యత్యాసాలు కన్పించాయి. ఫాతిమా అడ్మిట్‌కార్డులో యూపీఎస్సీ (UPSC) వాటర్‌ మార్కుతోపాటు క్యూఆర్‌ కోడ్‌ ఉండగా.. మక్రానీ అడ్మిట్ కార్డుపై అవేమీ కన్పించలేదు. మరోవైపు పర్సనాలిటీ టెస్టు (ఇంటర్వ్యూ) నిర్వహించిన తేదీ ఫాతిమా కార్డులో సరిగ్గా ఉండగా.. మక్రానీ అడ్మిడ్‌ కార్డులో తప్పుగా ఉంది. దీంతో ఫాతిమానే అసలు అభ్యర్థి అని అధికారులు గుర్తించారు.

ఇక తుషార్‌ అనే పేరుతోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. తమకు 44వ ర్యాంక్‌ వచ్చిందని హరియాణాకు చెందిన తుషార్‌, బిహార్‌కు చెందిన తుషార్‌ కుమార్‌ చెప్పారు. దీంతో దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. బిహార్‌కు చెంది తుషార్‌ కుమార్‌ నిజమైన అభ్యర్థిగా గుర్తించింది.

యూపీఎస్సీ ఏం చెప్పిందంటే..

‘‘ఈ రెండు ఘటనల్లో ఆయేషా మక్రానీ, హరియాణాకు చెందిన తుషార్‌ మోసపూరితంగా తాము ర్యాంకులు సాధించినట్లు ప్రకటించారు. వీరిద్దరూ నకిలీ వ్యక్తులే. తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ పేరుతో యూపీఎస్సీకి ఎంపికైన అసలు అభ్యర్థుల రోల్‌ నంబర్లు, ఇతర పత్రాలను వీరు ఫోర్జరీ చేశారు. ఆయేషా మక్రానీ కూడా యూపీఎస్సీ పరీక్ష రాసింది. అయితే ప్రిలిమ్స్‌లో పేపర్‌-1లో ఆమెకు 22.22 మార్కులు, పేపర్‌-2లో 21.09 మార్కులే వచ్చాయి. ప్రిలిమ్స్‌లోనే ఆమె ఉత్తీర్ణత సాధించలేదు. అలాంటప్పుడు మిగతా దశలకు వెళ్లే అవకాశమే లేదు. ఇక, ఆయేషా ఫాతిమా అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించి 184వ ర్యాంక్‌ సాధించింది. ఆమే అసలు అభ్యర్థి’’

‘‘ఇక హరియాణాకు చెందిన తుషార్‌ కూడా ప్రిలిమ్స్‌ రాశాడు. అతడికి పేపర్‌-1లో మైనస్‌ 22.89, పేపర్‌-2లో 44.73 మార్కులు వచ్చాయి. అతడు కూడా ప్రిలిమ్స్‌లోనే ఫెయిల్‌ అయ్యాడు. మరోవైపు బిహార్‌కు చెందిన తుషార్‌ కుమార్‌ అన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలో పాసై 44వ ర్యాంక్‌ సాధించాడు. అతడే అసలైన అభ్యర్థి’’ అని యూపీఎస్సీ వెల్లడించింది. మోసపూరితంగా సివిల్స్‌కు ఎంపికైనట్లు చెప్పినందుకు గానూ.. ఆయేషా మక్రానీ, హరియాణాకు చెందిన తుషార్‌పై క్రిమినల్‌, క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. తమ వ్యవస్థ అత్యంత కఠినమైనది, పారదర్శకమైదని, ఎలాంటి పొరబాట్లు జరిగే ఆస్కారమే లేదని కమిషన్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని