Moderna: 12-17 ఏళ్ల వారిపై టీకా భేష్‌!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ.. చిన్నారులపై టీకా ప్రయోగాలు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 12-17 ఏళ్ల యుక్త వయసు వారిపై చేసిన ప్రయోగాల్లో మోడెర్నా......

Published : 25 May 2021 22:19 IST

వెల్లడించిన మోడెర్నా సీఈవో

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ.. చిన్నారులపై టీకా ప్రయోగాలు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 12-17 ఏళ్ల యుక్త వయసు వారిపై చేసిన ప్రయోగాల్లో మోడెర్నా టీకా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో అనుమతుల కోసం జూన్‌ నెలలో నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసుకుంటామని మోడెర్నా వెల్లడించింది. ఇక అమెరికాలో 12 నుంచి 15ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు ఇప్పటికే ఫైజర్‌ అనుమతి పొందింది.

చిన్నారుల్లో వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భాగంగా 12నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన 3,732 మందిపై మోడెర్నా అధ్యయనం చేపట్టింది. వీరిలో మూడో వంతు మందికి అసలైన వ్యాక్సిన్‌ ఇవ్వగా.. మిగతా వారికి ప్లెసిబో ఇచ్చి పరీక్షించారు. ఇలా అసలైన వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో వైరస్‌ నుంచి 100 రక్షణ కల్పించగా.. ప్లెసిబో గ్రూపులో మాత్రం నలుగురికి వైరస్‌ నిర్దారణ అయినట్లు మోడెర్నా పేర్కొంది. మొత్తానికి తొలిడోసు తీసుకున్న తర్వాత వ్యాక్సిన్‌ 93శాతం సమర్థత చూపించిందని వెల్లడించింది. యుక్తవయసు వారిలో కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో mRNA-1273 వ్యాక్సిన్‌ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని మోడెర్నా సీఈవో స్టీఫేన్‌ బాన్సెల్‌ పేర్కొన్నారు. దీంతో వ్యాక్సిన్‌ వినియోగానికి అమెరికా ఎఫ్‌డీఏకు వచ్చే నెలలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని వెల్లడించారు.

ఇదిలా ఉంటే, అమెరికాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దాదాపు 33కోట్ల జనాభా కలిగిన అగ్రరాజ్యంలో ఇప్పటికే 50శాతం మందికి వ్యాక్సిన్‌ అందించారు. ప్రస్తుతం అక్కడ మోడెర్నా, ఫైజర్‌తో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలను అందిస్తున్నారు. ఈమధ్యే 12 నుంచి 15ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఫైజర్‌ అనుమతి పొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని