Karnataka: ఉచిత విద్యుత్‌ అన్నారు కదా.. మేం బిల్లులు చెల్లించం!

అధికారంలోకి వస్తే.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ (Congress) చెప్పినందున కరెంటు బిల్లులు (Current bill) చెల్లించబోమని కర్ణాటకలోని కొన్ని జిల్లాల ప్రజలు కరాఖండిగా చెబుతున్నారు.

Published : 18 May 2023 20:11 IST

బెంగళూరు: తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఇంకా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయలేదు. సీఎం పీఠం ఎవరిదా? అన్నదానిపై ఇవాళే ఓ స్పష్టత వచ్చింది. కానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో కొప్పల్‌, కలబురిగి, చిత్రదుర్గ జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. కరెంట్‌ ఛార్జీలు చెల్లించాలంటూ వెళ్లిన అధికారులను ప్రశ్నిస్తున్నారు.

అధికారంలోకి వస్తే ఉచితవిద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది కదా.. ఇప్పుడు మళ్లీ బిల్లు ఎందుకు కట్టమంటున్నారంటూ నిలదీస్తున్నారు. మీటరు రీడింగులు తీసేందుకు వెళ్తున్న విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికీ దాదాపు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. ‘‘ మా బిల్లులను సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లే కడతారు.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాళ్లే చెప్పారు. అందుకే మీరు మళ్లీ మా ఇళ్లకు రావొద్దు. ఒకవేళ వచ్చినా.. మేం బిల్లులు చెల్లించం. ఈవీఎంలో ఒకసారి మేము బటన్‌ ప్రెస్‌ చేసి గెలిపించామంటే..వాళ్లు హామీలను తప్పకుండా నెరవేర్చాల్సిందే. ఏం జరిగినా మా కరెంటు బిల్లులు మాత్రం కట్టే ప్రసక్తే లేదు’’ అంటూ వివిధ గ్రామాల ప్రజలు కరాఖండిగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని