UP Polls: హామీలను నెరవేర్చని భాజపాను శిక్షించాల్సిందే : టికాయిత్‌

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన రైతు సంఘాల నేతలు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను శిక్షించాల్సిందేనని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు.

Published : 16 Feb 2022 01:52 IST

యూపీ ఓటర్లకు రైతు సంఘాల నేతల విజ్ఞప్తి

లఖింపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ.. అధికార భాజపాపై రైతు నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా లఖింపుర్‌లో పర్యటించిన సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు.. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను శిక్షించాల్సిందేనని రైతు సంఘాల నేతలు అక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రైతులపై కారు దాడి ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ లభించడంపై స్పందించిన రైతు నేతలు.. ఐదుగురిని పొట్టనబెట్టుకున్న వ్యక్తికి మూడు నెలల్లోనే బెయిల్‌ రావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లఖింపుర్‌లో రైతు నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

పంటలకు కనీస మద్దతు ధరతో పాటు రైతులకు ఎన్నో హామీలను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వాటి అమలుకు చర్యలు చేపట్టలేదని ఎస్‌కేఎం నేత శివకుమార్‌ శర్మ విమర్శించారు. వీటితోపాటు రైతు ఉద్యమ సమయంలో నిరసనకారులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవడం, ఆందోళలన సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో ఇప్పటికీ ముందడుగు పడలేదన్నారు. ఆ సమస్యలపై కమిటీ వేస్తామంటూ స్వయంగా ప్రధానమంత్రే ప్రకటించినప్పటికీ.. నేటికీ అలా జరగలేదని గుర్తుచేశారు. అయితే, ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో మేం చెప్పడం లేదని.. కానీ, భాజపాను మాత్రం శిక్షించాల్సిందేనని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఇక లఖింపుర్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్‌ రావడం పట్ల రైతు సంఘం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కిసాన్‌ సంయుక్త మోర్చా తరపున సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మూడు నెలల్లోనే బెయిల్‌ రావడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కేంద్రంతోపాటు యూపీలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఆయన.. అభివృద్ధి నినాదంతో కాకుండా మతపరమైన అంశాలే అజెండాగా భాజపా ఎన్నికల్లో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఇదిలాఉంటే, చెరకు ప్రధాన పంటగా ఉన్న లఖింపుర్‌ ఖేరీ జిల్లాల్లో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఈ ఎనిమిది స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. అయితే, యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనుండగా.. లఖింపుర్‌ ఖేరీలో ఫిబ్రవరి 23న జరిగే నాలుగో దశలో పోలింగ్‌ జరుగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని