YouTube: చంద్రయాన్‌-3 ‘రికార్డు’ అద్భుతం.. యూట్యూబ్‌ సీఈఓ

చంద్రయాన్‌-3(Chandrayaan-3) ప్రయోగంపై యూట్యూబ్‌లో ఇస్రోలైవ్‌ స్ట్రీమింగ్‌ రికార్డు సృష్టించింది. దీనిపై యూట్యూబ్ చీఫ్ స్పందించారు. 

Published : 14 Sep 2023 18:03 IST

దిల్లీ: భారత్‌ జాబిల్లిపైకి పంపిన చంద్రయాన్-3(Chandrayaan-3) విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ ప్రయోగంతో సోషల్ మీడియాలో నమోదైన ఓ రికార్డు గురించి యూట్యూబ్ సీఈఓ నీల్‌ మోహన్(YouTube chief Neal Mohan) స్పందించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కు అభినందనలు తెలియజేశారు. 

ఆగస్టు 23న చంద్రయాన్‌-3 ప్రయోగం జరిగింది. దీనిని ఏకకాలంలో 80 లక్షల మంది వీక్షించారని రెండు రోజుల క్రితం యూట్యూబ్ ఇండియా వీడియోను పోస్టు చేసింది. ‘కొన్ని విషయాలు మమ్మల్ని మైమరపించాయి. భారత్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఆ రోజు యూట్యూబ్‌లో ఇస్రో లైవ్‌స్ట్రీమింగ్‌ను ఏకకాలంలో 8 మిలియన్ల(80 లక్షలు) మంది వీక్షించారు. మా ఆనందానికి పట్టపగ్గాలు లేవు’ అని రాసుకొచ్చింది. 

ఆ ఫోన్‌ ఇక మోగదు.. ఆ పసికందు కోసం తండ్రెప్పటికీ రారు..!

తాజాగా ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. యూట్యూబ్‌ సీఈఓ నీల్‌ మోహన్(YouTube chief Neal Mohan) ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘ఏకకాలంలో 80 లక్షల మంది వీక్షకులా.. నమ్మశక్యంగా లేదు. అద్భుతం’అని హర్షం వ్యక్తం చేశారు. అలాగే యూట్యూబ్‌( YouTube) షేర్ చేసిన 16 సెకండ్ల క్లిప్‌లో.. ల్యాండింగ్ సమయంలో ఇస్రో కంట్రోల్‌ రూమ్‌లో చోటుచేసుకున్న ఉద్విగ్న పరిస్థితులను బంధించారు. 

చంద్రయాన్‌-3(Chandrayaan-3) ప్రయోగంలో భాగంగా గతనెల జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద  ల్యాండర్‌ సురక్షితంగా దిగింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ అధ్యయనం చేసింది. అక్కడ పగటికాలం ముగియడంతో ప్రస్తుతం అవి నిద్రాణంలోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఈ నెల 22న అక్కడ సూర్యోదయమవుతుందని ఇస్రో తెలిపింది. ఆ రోజున అవి మళ్లీ తిరిగి మేలుకుంటాయని ఆశిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని