Indra: చిరుతో ‘ఇంద్ర’ చేయలేనన్న బి.గోపాల్‌.. ఆ ఒక్క మాటతో గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు!

Indra: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఇంద్ర’ (Indra).

Updated : 15 Aug 2022 15:34 IST

Indra: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఇంద్ర’ (Indra). సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్‌ కథానాయికలు. జులై 24, 2002న విడుదలైన ఈ చిత్రం ఆదివారంతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చిరు నటన, బి.గోపాల్‌ టేకింగ్‌, మణిశర్మ సంగీతం, పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు, చిన్ని కృష్ణ కథ సినిమాను విజయపథంలో నడిపాయి. నిర్మాత అశ్వనీదత్‌ ఎక్కడా రాజీపడకుండా సినిమాను అత్యున్నతంగా నిర్మించారు. మరి 20 వసంతాలు పూర్తి చేసుకున్న ‘ఇంద్ర’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

అలా మొదలైంది..!

‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా రోజులైంది. ఆయన నుంచి మంచి మాస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫ్యామిలీ స్టోరీ చేయాలనుకున్నారు. అదే సమయంలో నిర్మాత అశ్వనీదత్‌, బి.గోపాల్‌కు చిన్నికృష్ణ ఓ కథను వినిపించారు. కథ బాగున్నా, అప్పటికే బి.గోపాల్‌ ఫ్యాక్షన్‌ సినిమాలు చేయడంతో చిరంజీవి కూడా అలాంటి సినిమానే చేస్తే, ప్రేక్షకులు చూస్తారా? అన్న అనుమానం కలిగింది. పైగా ‘మెకానిక్‌ అల్లుడు’తో చిరంజీవికి హిట్‌ ఇవ్వలేకపోయాన్న బాధతో ఈ సినిమా చేసేందుకు బి.గోపాల్‌ వెనకడుగు వేశారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, ‘నన్ను బలవంత పెట్టకండి. చేయలేను’ అన్నారట. ‘సక్సెస్‌ఫుల్‌ ఎలిమెంట్‌ ఈజ్‌ ఆల్వేస్‌ సక్సెస్‌ ఆన్‌ అదర్‌ ఫేస్‌’ అన్న పరుచూరి గోపాలకృష్ణ మాటతో బి.గోపాల్‌ ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత కథను మరింత డెవలప్‌ చేయమని చిన్ని కృష్ణకు సూచించారు.  తొలుత ఈ సినిమా నేపథ్యాన్ని కృష్ణా-గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని తీసుకున్నారు రచయిత చిన్నికృష్ణ. పరుచూరి గోపాలకృష్ణతో చర్చల సందర్భంగా దాన్ని కాశీ, గంగానది బ్యాక్‌డ్రాప్‌కు మార్చారు.

ఆ డైలాగ్‌లు అలా వచ్చాయి

‘ఇంద్ర’లో చిరు నటనతో పాటు పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు ఎంతగానో అలరించాయి. అయితే, తొలుత ఈ సినిమాకు తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడని భారీ డైలాగ్‌లు రాయొద్దని పరుచూరి బ్రదర్స్‌కు సూచించారట చిరు.  అయితే, ఆడియో ఫంక్షన్‌లో ‘గురూ డైలాగ్‌.. గురూ డైలాగ్‌’ అని అభిమానులు అరవడంతో చిరంజీవి మనసు మార్చుకుని పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ రాయాల్సిందిగా కోరారు. అప్పటికి 80శాతం షూటింగ్‌ అయిపోయింది.‘మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా’ వంటి డైలాగ్‌లు ఆ తర్వాత వచ్చినవే. అలాగే అలహాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుండగా, ‘మేనల్లుడి కోసం నేను దెబ్బలు తింటున్నాను సరే. అభిమానులు ఆ సీన్‌ను ఒప్పుకొంటారా’ అని పరుచూరి బ్రదర్స్‌ను అడగ్గా, ‘తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని వెళ్తున్నా. లేకపోతే తలలు తీసుకెళ్లేవాడిని’ అని డైలాగ్‌ పెట్టారట పరుచూరి బ్రదర్స్‌.  అలాగే చిరంజీవి రాయలసీమకు తిరిగి వచ్చిన తర్వాత కూడా పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ కావాలని అడిగారట. అప్పటికప్పుడే సెట్స్‌లో ‘రాననుకున్నారా రాలేననుకున్నారా’ డైలాగ్‌ రాస్తే, చిరు ముచ్చటపడిపోయి, పరుచూరి గోపాలకష్ణకు సోనీ ఎరికసన్‌ ఫోన్‌ కానుకగా ఇచ్చారు.  ఇక క్లైమాక్స్‌  ఫైట్స్‌ సీన్స్‌కు పరుచూరి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఆ సమయంలో విలన్‌ ముఖేష్‌ రుషిని కొట్టిన తర్వాత చిరంజీవి మూడు పేజీల డైలాగ్‌లు చెప్పాల్సి ఉంది. విలన్‌ను కొట్టేసిన తర్వాత డైలాగ్స్‌ చెబితే బాగుండదని చిరు చెప్పడంతో ‘నరుక్కుంటూ వెళ్తే, అడవి అన్నది మిగలదు. చంపుకొంటూ వెళ్తే మనిషి అన్నవాడు మిగలడు’ అన్న ఒక్కడైలాగ్‌తో ముగించారు.

తనికెళ్ల భరణి క్యారెక్టర్‌ వదులుకున్న గోపాలకృష్ణ

ఈ సినిమాలో వాల్మీకి పాత్రలో తనికెళ్ల భరణి కనిపిస్తారు. తొలుత ఈ పాత్రను రచయిత పరుచూరి గోపాలకృష్ణ వేయాల్సి ఉంది. అయితే, ఆయన తాను డైలాగ్‌లు చెబితే చూద్దామని ప్రేక్షకులు అనుకుంటారని, మూగవాడిగా ఉండిపోతే ఆ పాత్ర రక్తికట్టదని గోపాలకృష్ణ భావించి, దాన్ని వదులుకున్నారు.

బ్రహ్మానందం యాక్టింగ్‌కు చిరు ఫిదా!

కాశీలో బ్రహ్మానందం అండ్‌ కో చేసే కామెడీ సీన్లు బాగా అలరించాయి. ఈ సన్నివేశాలు తీస్తున్నప్పుడు షూటింగ్‌ లేకపోయినా చిరంజీవి కూడా సెట్‌కు వచ్చారు. ఆయనతోపాటు, దర్శకులు కె.విశ్వనాథ్‌, రాఘవేంద్రరావులను కూడా తీసుకొచ్చారు. బ్రహ్మానందం-ఏవీఎస్‌ల మధ్య  ఆ సీన్స్‌ చేస్తుంటే, ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వారట.  బి.గోపాల్‌ అలా నవ్వుతూ కట్‌ కూడా చెప్పలేదట.

* ముందుగా ఈ సినిమాకి సిమ్రన్ ని హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నారు. మరో హీరోయిన్ గా సోనాలి బింద్రేని ఫైనల్ చేశారు.

* అలాగే శివాజీ పాత్రకు ముందుగా వెంకట్ , రాజా తదితరులను వారిని అనుకున్నారు కానీ ఆ పాత్ర శివాజీకి దక్కింది.

* చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమాకి అయిన బడ్జెట్ రూ.7కోట్లు.  చిరంజీవి, వైజయంతి బ్యానర్ లో మూడో సినిమా.. అంతకుముందు జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు వచ్చాయి. ఇక ఇంద్రతో హ్యాట్రిక్ కొట్టి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని నిరూపించారు.

* మొత్తం 120 రోజుల్లో సినిమాని ఫినిష్ చేశారు. మొత్తం పదకొండు పాటలకి చేయగా అందులో అయిదు పాటలని ఓకే చేశారు. ఇందులో ‘అయ్యో అయ్యో’ సాంగ్‌కి మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పీ పట్నాయక్ తో మ్యూజిక్ చేయించుకున్నారు.

* జులై 24, 2002న మొత్తం 268 స్క్రీన్‌లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. ఇందులో 151 కేంద్రాల్లో 50 రోజులు,98 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.

* ఈ సినిమాకి మూడు విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు - చిరంజీవి ఉత్తమ కొరియోగ్రాఫర్ - రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ - పి రవి శంకర్

* ఫస్ట్ వీక్ రూ.40 కోట్ల వసూళ్లూ సాధించిన తొలి తెలుగు సినిమా ఇంద్ర కావడం విశేషం.. ఆ తర్వాత పోకిరి సినిమా దీనిని బ్రేక్ చేసింది.

* విజయవాడలో 175 రోజుల ఫంక్షన్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి చీఫ్ గెస్ట్. ఈ చిత్రాన్ని హిందీలోకి "ఇంద్ర: ది టైగర్" గా, బెంగాలీలో సుల్తాన్ గా రీమేక్ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని