90s webseries: నా కెరీర్‌లో మరపురానిది #90s: శివాజీ

ఇండియన్‌ ఓటీటీలో వచ్చిన అన్ని వెబ్‌సిరీస్‌ల్లో టాప్‌-5లో ఉండదగ్గ వెబ్‌సిరీస్‌ మా ‘‘#90's’’ అన్నారు నటుడు శివాజీ. ఆయన.. వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్‌ తెరకెక్కించిన సిరీసే ‘#90's- ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’. 

Updated : 20 Jan 2024 09:35 IST

‘‘ఇండియన్‌ ఓటీటీలో వచ్చిన అన్ని వెబ్‌సిరీస్‌ల్లో టాప్‌-5లో ఉండదగ్గ వెబ్‌సిరీస్‌ మా ‘‘#90's’’ అన్నారు నటుడు శివాజీ. ఆయన.. వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్‌ తెరకెక్కించిన సిరీసే ‘#90's- ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’. రాజశేఖర్‌ మేడారం నిర్మాత. మౌళి, వాసంతిక, రోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవీన్‌ మేడారం సమర్పించారు. ఇటీవలే ‘ఈటీవీ విన్‌’లో విడుదలైన ఈ సిరీస్‌.. ప్రేక్షకుల్ని మెప్పించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శుక్రవారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఇదొక మరపురాని సిరీస్‌. ఈ సిరీస్‌ ‘ఈటీవీ విన్‌’ ద్వారా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ ఒక్క సిరీస్‌తో 5లక్షల సబ్‌స్క్రైబర్స్‌ రావడం మామూలు విషయం కాదు. దర్శకుడు ఆదిత్య రచన వల్లే ఇదంతా సాధ్యమైంది. దీన్ని త్వరలో సినిమాలా విడుదల చేస్తారని అనుకుంటున్నా. అజిమ్‌ ఛాయాగ్రహణం ఈ సిరీస్‌కి అదనపు ఆకర్షణ. సురేశ్‌ బొబ్బిలి చాలా చక్కటి సంగీతమందించారు. ‘సాంప్రదాయని’ ట్యూన్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతోంది. ఈ సిరీస్‌ ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు పూర్తయ్యిందో కూడా తెలియలేదు. అంత సాఫీగా ఈ ప్రయాణం సాగిపోయింది. ఇందులో ఉన్న ప్రతి చిన్న పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుందంటే దానికి కారణం స్క్రిప్ట్‌. అది బాగున్నప్పుడు.. దానికి తగ్గ ఆర్టిస్ట్‌లు దొరికినప్పుడు కచ్చితంగా ఇలాంటి రికార్డ్సే బయటకొస్తాయి. మౌళి, రోహన్‌, వాసంతిక అందరూ చక్కగా చేశారు. అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. వాసుకి అద్భుతంగా నటించారు. ఈటీవీ విన్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘మా ‘‘#90's’ అందరికీ చేరవవుతోంది. ముఖ్యంగా 90ల తరం దీనికి బాగా కనెక్ట్‌ అయ్యింది. వాళ్ల నుంచి వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్నిచ్చింది. శివన్న, వాసుకి.. మిగతా నటీనటులు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు’’ అన్నారు దర్శకుడు ఆదిత్య హాసన్‌. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ.. ‘‘మన జీవితాన్ని అద్దంలో చూపించిన సిరీస్‌ ఇది. వాసుకి ఎంతో సహజంగా నటించారు. నా చిన్నప్పుడు మా అమ్మలా అనిపించారు. శివాజీ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. రోహన్‌ చాలా చక్కటి టైమింగ్‌తో నటించాడు. దర్శకుడు ఆదిత్య ఓ మాస్టర్‌ పీస్‌ను అందించారు. సంక్రాంతికి థియేటర్సే కాదు.. ఓటీటీలు కూడా హిట్స్‌ ఇస్తాయనడానికి ‘‘#90's’ ఓ నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ సిరీస్‌పై మేము పెట్టుకున్న నమ్మకం నిజమైంది. 200 మిలియన్‌ వ్యూస్‌ తెచ్చుకున్న తొలి తెలుగు వెబ్‌సిరీస్‌ ఇది. ఇంత తక్కువ సమయంలో అంతటి వ్యూయర్‌ షిప్‌ రావడం ఇదే తొలిసారి. ఇంత అద్భుతమైన ఆదరణ చూపించిన ప్రేక్షకులకు  ధన్యవాదాలు’’ అన్నారు సాయికృష్ణ. ఈ కార్యక్రమంలో వాసుకి, మౌళి, రోహన్‌, వాసంతిక తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని