‘దేవుడు వరమిస్తే జీవించాలనే కోరుకుంటా’

జీవితమంటే తనకెంతో ఇష్టమని, ఒకవేళ భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా జీవించాలనే కోరుకుంటానని ఒకానొక సందర్భంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని.. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం....

Published : 26 Sep 2020 01:18 IST

బాలు కోసం షూటింగ్‌ వాయిదా వేసిన ఎంజీఆర్‌

హైదరాబాద్‌: జీవితమంటే తనకెంతో ఇష్టమని, ఒకవేళ భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా జీవించాలనే కోరుకుంటానని ఒకానొక సందర్భంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని.. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే జీవితంపై తనకున్న ఇష్టం గురించి బాలు ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు..

‘అనుకోకుండా నేను సినీ గాయకుడిగా మారాను. స్వరానికి సంబంధించి నేను ఎలాంటి జాగ్రత్తలు పాటించను. జీవితమంటే నాకెంతో ఇష్టం. జీవితాన్ని బాగా ప్రేమిస్తాను. భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా బతకాలనే కోరుకుంటా. మనిషిగా పుట్టడం ఓ గొప్ప వరం. మనం ఎంతో అందంగా జీవించాలి. అలాగే నాకు నా వృత్తి అంటే గౌరవం. నా వృత్తే నాకు దేవుడు. వృత్తి కోసం నా ఇష్టాలను వదులుకోవాలనుకోవడం లేదు. ఒక నిబద్ధతతో మనకిష్టమైన ప్రతీది అనుభవిస్తూ.. మన వృత్తిని కూడా ముందుకు తీసుకువెళ్లొచ్చు అనడానికి నేను ఓ ఉదాహరణ. చాలామంది గాయకులు ఇది తినకూడదు, చల్లదనం తాగకూడదు.. ఇలా ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ అవన్నీ నా వల్ల కాదు. ఐస్‌వాటర్‌, ఐస్‌క్రీమ్‌ లేకుండా నేను ఉండలేను.’

‘‘శాంతినిలయం’ చిత్రంలో ఎం.ఎస్‌ విశ్వనాథ్‌ మొదటిసారి నాకు తమిళ సినిమాలో పాడే అవకాశమిచ్చారు. ఎంజీఆర్‌ నటించిన ఓ తమిళ సినిమాలోని సౌందర్‌రాజన్‌ పాడిన పాటకు తెలుగులో నేను డబ్బింగ్‌ పాడాను. ఏవీఎం థియేటర్‌లో ఆ పాట రికార్డింగ్‌ జరుగుతున్న సమయంలో అక్కడికి ఎంజీఆర్‌ వచ్చారు. నా పాట విని, నా గురించి వేరే వాళ్లని అడిగి తెలుసుకున్నారు. తన సినిమాలో నాకు అవకాశమివ్వాలనుకుంటున్నట్లు ఎంజీఆర్‌ ఆ మరుసటి రోజు మహదేవన్‌తో చెప్పారు. అలా నాకు ఎంజీఆర్‌ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఆ పాట కోసం నాలుగురోజులు రిహార్సిల్స్‌ కూడా చేశాను. అయితే పాట రికార్డింగ్‌కు కొన్నిరోజుల ముందు.. నాకు టైఫాయిడ్‌ వచ్చింది. పాట రికార్డ్‌ చేయాల్సిన ముందురోజు ప్రొడెక్షన్‌ మేనేజర్‌ నా రూమ్‌కి ఇచ్చారు. జ్వరంతో ఉన్న నన్ను చూసి వెళ్లిపోయారు. దాంతో ఆ అవకాశం పోయిందనుకున్నాను. దాదాపు నెలన్నర తర్వాత అదే ప్రొడెక్షన్‌ మేనేజర్‌ నా దగ్గరకి వచ్చి.. ‘మీరు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా?అని ఎంజీఆర్‌ కనుక్కుని రమ్మన్నారు. ఆరోగ్యంగా ఉంటే రేపు రిహార్సిల్స్‌కి రమ్మన్నారు’ అని చెప్పాడు. ఆ మరుసటి రోజు రికార్డింగ్‌ థియేటర్‌కి వెళ్లగానే ఎంజీఆర్‌ నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, పాట రిహార్సిల్స్‌ చేయమన్నారు. ఒకప్పుడు అనారోగ్యం వల్ల ఏదైతే పాటను పాడలేకపోయానో.. అదే పాట ఇప్పుడు మళ్లీ రిహార్సిల్స్‌ చేయమంటున్నారు ఎందుకా? అని ఆశ్యర్యానికి గురయ్యాను. ఆయన్ని అడగడానికి ధైర్యం సరిపోలేదు. సదరు పాట రికార్డింగ్‌ పూర్తయ్యాక ధైర్యం చేసి ఎంజీఆర్‌తో మాట్లాడాను. ‘సర్‌.. ఈ పాట రికార్డింగ్‌ చేయాలనుకుని దాదాపు రెండు నెలలు అయిపోయింది. అలాగే ఈ పాట షూటింగ్‌ కోసం రాజస్థాన్‌లో అనుమతులు కూడా తీసుకున్నారు? మరి ఎందుకని ఇంత వరకూ ఆగారు?’ అని అడిగాను. దానికి ఆయన.. ‘బాలసుబ్రహ్మణ్యం.. నువ్వు ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్నానని చెప్పావు. మొదట ఈ పాట రిహార్సిల్స్‌ చేయగానే నీ స్నేహితులందరికీ వినిపించి ఉంటావు‌. పాట గురించి అందరికీ చెప్పి ఉంటావు. రిహార్సిల్స్‌లో భాగంగా అందరికీ నువ్వు పాడి వినిపించిన ఈ పాటను సినిమాలో మరొకరితో పాడిస్తే.. నువ్వు పాడింది నచ్చకే మరొకరికి అవకాశమిచ్చామనుకుంటారు. అది నీ భవిష్యత్తుకు మంచిది కాదు. అందుకే నేను షూటింగ్‌ వాయిదా వేసుకున్నాను’ అని చెప్పారు. ఆయనలో ఉన్న మానవీయత ఎంతో గొప్పది. ఇలాంటి చిన్న చిన్న అదృష్టాలే నన్ను ముందుకు తీసుకువెళ్లాయి.’ అని బాలు ఓ ఇంటర్యూలో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని