‘మా’ ప్రచారం మొదలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నటుల కోసం విందులు, సన్మానాల్ని ఏర్పాటు చేస్తూ ప్రచారాన్ని మొదలు పెట్టాయి రెండు ప్రధాన ప్యానెళ్లు. వీటిలో ఒకటి ప్రకాశ్‌రాజ్‌

Updated : 13 Sep 2021 07:25 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నటుల కోసం విందులు, సన్మానాల్ని ఏర్పాటు చేస్తూ ప్రచారాన్ని మొదలు పెట్టాయి రెండు ప్రధాన ప్యానెళ్లు. వీటిలో ఒకటి ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ కాగా, మరొకటి మంచు విష్ణు ప్యానెల్‌. ప్రకాశ్‌రాజ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో 150 మంది కళాకారులతో ఓ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో నటులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఏం చేయాలో అడిగి తెలుసుకున్నారు. ‘మా’ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 19న వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే తమ ప్యానెల్‌ మేనిఫెస్టోని ప్రకటిస్తామని ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ‘‘మాకు ఓటేసేవాళ్లనే మేం సమావేశానికి పిలవలేదు. మా ప్యానెల్‌లో టెలివిజన్‌ నటులతోపాటు భిన్నమైన శ్రేణులకి చెందినవాళ్లు ఉన్నారు. అదే తరహాలో ఈ సమావేశానికి నటులు  హాజరయ్యారు. ముందు వాళ్లకే మైక్‌ ఇచ్చాం. ఇన్నేళ్లుగా సభ్యులుగా ఉంటున్నారు కదా, ఎలాంటి సహాయం అందింది? ఇంకా ఏమేం సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నాం’’ అన్నారు ప్రకాశ్‌రాజ్‌. బండ్ల గణేశ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకోవడం గురించి అడిగిన ప్రశ్నకి ప్రకాశ్‌రాజ్‌ బదులిస్తూ... ‘‘నేనైతే తనని బాధ పెట్టలేదు. ఒక ప్యానెల్‌ ప్రకటించడం అనేది నా ఒక్కడి నిర్ణయం కాదు. 900 సభ్యులున్న అసోసియేషన్‌లో అన్ని పదవులు ఉండవు కదా. ఆయనకి జీవిత నచ్చకపోవచ్చు. ఇక్కడ నాకు ‘మా’ అసోసియేషన్‌ ఉంది. ‘మా’ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేసేవాళ్లు కావాలని మేం కోరి తీసుకొచ్చాం’’ అన్నారు. ఈసారి ‘మా’లో సభ్యత్వం ఉన్న అగ్ర హీరోలంతా తప్పకుండా ఓటేయడానికి వస్తారని నమ్ముతున్నామని చెప్పారు ప్రకాశ్‌రాజ్‌. మరోపక్క మంచు విష్ణు ప్యానెల్‌ సమావేశాల్ని ఏర్పాటు చేసి, సీనియర్‌ నటులకి సన్మానం చేస్తోంది. నోటిఫికేషన్‌ తర్వాత మా ఎన్నికల ప్రచారం మరింతగా ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని