Raj kundra Case: సాక్ష్యాలను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం

నేర విచారణలో నిందితులు సహకరించకుండా, సాక్ష్యాలను నాశనం చేయడానికి యత్నిస్తుంటే చట్టాన్ని అమలు చేసే సంస్థలు మౌన ప్రేక్షకులుగా ఉండలేవని ముంబయి పోలీసులు

Published : 03 Aug 2021 15:44 IST

అందుకే రాజ్‌ కుంద్రాను అరెస్టు చేశాం

ముంబయి హైకోర్టులో పోలీసుల వాదన

 

 

ముంబయి: నేర విచారణలో నిందితులు సహకరించకుండా, సాక్ష్యాలను నాశనం చేయడానికి యత్నిస్తుంటే చట్టాన్ని అమలు చేసే సంస్థలు మౌన ప్రేక్షకులుగా ఉండలేవని ముంబయి పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ముందుస్తు నోటీసులిచ్చి విచారణకు పిలవకుండా నేరుగా అరెస్టు చేయడం అక్రమమని కుంద్రా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన సాక్ష్యాలను నాశనం చేస్తున్నందునే అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. కుంద్రా తన ఐఫోన్‌లోని ఐక్లౌడ్‌ ఖాతాను తొలగించారని పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించినప్పుడు ల్యాప్‌టాప్‌లో 61 అశ్లీల వీడియోలు, ఓ పోర్న్‌ సినిమా స్క్రిప్టుతోపాటు డిజిటల్‌ స్టోరేజ్‌లో మరో 51 వీడియోలు లభ్యమైనట్లు వెల్లడించారు. పోర్న్‌ వీడియోల ప్రసారానికి హాట్‌షాట్స్‌ యాప్‌ను రూపొందించారని, దాని ఆదాయ వివరాలను వాట్సప్‌ గ్రూప్‌ చాటింగ్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో గుర్తించినట్లు చెప్పారు. డిలీట్‌ చేసిన ఈ-మెయిళ్లు, ఫేస్‌టైమ్, బ్రౌజింగ్‌ హిస్టరీలను రికవరీ చేశామని, వాటిలో కుంద్రా దందాకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. దీనిపై కుంద్రా తరఫు న్యాయవాది అబద్‌ పొండా స్పందిస్తూ.. కుంద్రాను అరెస్టు చేసినప్పుడే ఆయన్నుంచి ల్యాప్‌టాప్, రెండు హార్డ్‌ డిస్కులు, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని, వారి దగ్గర ఉన్న వాటిలోని సమాచారాన్ని కుంద్రా ఎలా తొలగించగలరని ప్రశ్నించారు. కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నప్పుడే కుంద్రా తన వాట్సప్‌ సందేశాలను తొలగించడం మొదలుపెట్టారని, అది సాక్ష్యాలను ధ్వంసం చేయడమేనని పోలీసులు పేర్కొన్నారు.  వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు