Aamir Khan: ‘రిటైర్‌మెంట్‌ ప్రకటించాలనుకున్నా’.. ఆమిర్‌ఖాన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

లాక్‌డౌన్‌ సమయంలో సినిమాలకు స్వప్తి చెప్పాలనుకున్నానని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిమానులకు షాక్‌ ఇచ్చారు.  ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 28 Mar 2022 01:26 IST

ముంబయి: లాక్‌డౌన్‌ సమయంలో సినిమాలకు స్వప్తి చెప్పాలనుకున్నానని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో వ్యక్తిగతంగా ఎన్నో మార్పులు చూశానని, కుటుంబ సభ్యుల మాటలతో రిటైర్‌మెంట్‌ నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు. 

‘‘రోజంతా నా కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతోనే సినిమాలకు దూరంగా ఉండాలనిపించింది. ‘ఇకపై నేను నటించను. నిర్మాతగానూ వ్యవహరించను. రిటైర్‌మెంట్‌ తీసుకుందామనుకుంటున్నా’ అని ఫ్యామిలీకి వివరించా. రీనా (మొదటి భార్య)- ఆమె తల్లిదండ్రులు, కిరణ్‌రావు (రెండో భార్య)- ఆమె పేరెంట్స్‌, నా పిల్లలు.. అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ‘నాన్నా.. నువ్వు అటు సినిమాలను, ఇటు కుటుంబాన్ని చక్కగా బ్యాలెన్స్‌ చేయగలవు. ఈ నిర్ణయం మానుకో’ అని నా పిల్లలు కోరారు. ‘నిన్ను చూస్తుంటే సినిమాలే కళ్లలో కదలాడుతుంటాయి. నీలోనే సినిమా కనిపిస్తుంది. అలాంటి నువ్వు ఇలా అంటుంటే నాకేం తోచడంలేదు’ అని కిరణ్‌ కంటతడిపెట్టుకుంది. దాంతో సినిమాకు దూరమవ్వాలనే నా ఆలోచన మార్చుకున్నా’’

‘‘కొవిడ్‌/లాక్‌డౌన్‌ సమయంలోనే ఈ విషయాన్ని అందరితో చెప్పానుకున్నా. కానీ, నా సినిమా ‘లాల్‌సింగ్‌ చద్ధా’ ప్రచారం కోసం ఇలా చేస్తున్నా అంటారని చెప్పలేదు. సినిమా విడుదలయ్యాక రిటైర్‌మెంట్‌ విషయాన్ని బయటపెట్టాలనుకున్నా. ఈలోపు నిర్ణయం మారింది’’ అని ఆమిర్‌ఖాన్‌ తెలిపారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ‘లాల్‌సింగ్‌ చద్ధా’ ఆగస్టు 11న విడుదలకానుంది. టాలీవుడ్‌ నటుడు నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో కరీనా కపూర్‌ కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని