Ajay Ghosh: నాకు అన్నం పెట్టడం కోసం మా నాన్న పస్తులుండేవాడు: మరోసారి అజయ్‌ ఘోష్‌ భావోద్వేగం

నటుడు అజయ్‌ ఘోష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 04 Mar 2024 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు అజయ్ ఘోష్‌ (Ajay Ghosh). స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ విలన్‌ పాత్రలకు పెట్టింది పేరుగా మారారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బాల్యంలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన జీవితాన్ని ‘రంగస్థలం’ మలుపు తిప్పిందని.. ‘పుష్ప’ మరో స్థాయికి తీసుకెళ్లిందన్నారు.

‘ఒకప్పుడు నాకు వేసుకోవడానికి దుస్తులు కూడా లేవు. మా అన్నయ్య వాళ్ల స్నేహితులు వాడేసిన డ్రెసులు తెచ్చుకొని వేసుకునేవాడిని. ఎన్నో విషయాల్లో ఒత్తిడికి గురై నష్టాలను చూశాను. ఆతర్వాత.. ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుందని ఆలోచించడం మానేశాను. నాకు మొదటినుంచి కష్టాలెక్కువే. నేను బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నా పిల్లలు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. వాళ్లకు తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎన్నో రోజులు పచ్చడి మెతుకులు తినే బతికారు. అలా ఇబ్బందుల్లో పెరిగారు కాబట్టే వాళ్లు ఇప్పుడు ఎంతో క్రమశిక్షణగా ఉన్నారని నేను అనుకుంటాను’.

శివరాత్రి స్పెషల్‌.. ఈవారం అలరించే థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే

‘నేను ఎన్నో అవమానాలు, బాధలు పడ్డాను. నా వెనక నా గురించి దారుణంగా మాట్లాడేవాళ్లు. ఎందుకూ పనికిరాను అనేవారు. అవన్నీ నాకు వినిపించినా మౌనంగా వచ్చేసేవాడిని. అలాంటి మాటలే నాకు ఆశీర్వచనాలు అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను భోజనప్రియుడినే. అన్నం ఉంటే చాలు. మా నాన్న నా కడుపు నింపడం కోసం ఆయన తినకుండా భోజనం ఉంచేవాడు. నేను తిన్న తర్వాత మిగిలితే ఆయన తినేవాడు. లేదంటే తినకుండా ఉండేవాడు. కష్టాలు లేకపోతే మనిషి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేడు. నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని భగవంతుడు ఇచ్చాడు’ అంటూ అజయ్‌ ఘోష్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని