Allu Arjun: వేదికలపై ఓడినా.. వెండితెరపై గెలిచాడు.. అల్లు అర్జున్‌ ‘తగ్గేదే లే’!

ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా..

Updated : 08 Apr 2023 16:30 IST

స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసే ఆర్య అతడు. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసే సరైనోడు. ‘విలువలే ఆస్తి’ అని నమ్ముతాడు. ఆయన డీజే పెట్టి యాక్షన్‌ చేసినా.. కేబుల్‌ రాజుగా మారి వేదం చెప్పినా.. దేశముదురుగా కనిపించినా.. జులాయిగా తిరిగినా.. అభిమానులు హ్యాపీ. ‘ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ అంటూ అటు క్లాస్‌ ఆడియన్స్‌ను, ఇటు మాస్‌ ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీసు వద్ద దూసుకెళ్లే ఆ రేసుగుర్రం మరెవరో కాదు అల్లు అర్జున్‌ (Allu Arjun). నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం (Happy Birthday Allu Arjun)..

ఏడాదిలోనే వైవిధ్యం..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌- నిర్మల దంపతులకు 1982 ఏప్రిల్‌ 8న చెన్నైలో పుట్టిన అల్లు అర్జున్‌ 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. తాత స్టార్‌ కమెడియన్‌ (రామలింగయ్య), మామయ్య స్టార్‌ హీరో (చిరంజీవి), నాన్న ప్రొడ్యూసర్‌.. ఈ నేపథ్యం బన్నీ తెరంగేట్రం చేసేందుకు ఉపయోగపడిందేమోగానీ స్టార్‌.. స్టైలిష్‌స్టార్‌ని చేసేందుకు మాత్రం కాదు. తన సినిమాలో డైలాగ్‌ చెప్పినట్టుగానే అర్జున్‌ ‘బ్రాండ్‌ అంటే ఇదీ’ అనేంతగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. 2003లో వచ్చిన తన తొలి చిత్రం ‘గంగోత్రి’ని, మరుసటి ఏడాది విడుదలైన ‘ఆర్య’ను గమనిస్తే ‘తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ ఆర్య’ అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ నిర్మాణంలో రూపొందడం, ఇంతకు ముందు చర్చించినట్టు ‘మెగా కాంపౌండ్‌’ నుంచి వస్తున్నాడనే టాక్‌ ఉండడం, అర్జున్‌ ‘విజేత’, ‘స్వాతిముత్యం’లో బాల నటుడిగా కనిపించడం, చిరంజీవి సినిమా ‘డాడీ’లో డ్యాన్స్‌ చేసి మెప్పించడం.. ఈ అంశాలన్నీ ‘గంగోత్రి’ (Gangotri)ని చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగాయి. అలా వారంతా వచ్చి సీట్లో కూర్చొంటే సరిపోదు కదా.. ఆ సీట్లో నుంచి వారిని లేవనీయకుండా హీరో ఆకట్టుకోగలగాలి. అలా తొలి ప్రయత్నంలో బన్నీ మంచి మార్కులే కొట్టేశాడు. కొంత విమర్శకూ గురయ్యాడు. లుక్‌ పరంగా ఎదుర్కొన్న ట్రోల్స్‌కు ‘ఆర్య’ (Arya)తో గట్టి సమాధానమిచ్చాడు. ఉత్సాహంతో కూడిన టైటిల్‌ పాత్ర పోషించి ఎంతోమంది లేడీ ఫ్యాన్స్‌తో ‘ఫీల్‌ మై లవ్‌’ అనిపించాడు.

ప్రతి పాత్రా ప్రత్యేకం..

రెండో సినిమాతోనే వైవిధ్యం ప్రదర్శించిన బన్నీ తర్వాతి ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటే ‘దేవుడా..!’ అనాల్సిందే. ఆయన ఫిల్మోగ్రఫీ అలాంటిది మరి. ‘బన్ని’ (Bunny)లో కాలేజీ విద్యార్థిగా, ‘హ్యాపీ’ (Happy)లో పిజ్జా డెలివరీ బాయ్‌గా, ‘దేశముదురు’ (Desamuduru)లో టెలివిజన్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా, ‘జులాయి’ (Julayi)లో బెట్టింగ్‌లు వేసే రవీంద్ర నారాయణ్‌గా, ‘రేసుగుర్రం’ (Race Gurram)లో అల్లరోడు లక్కీగా, ‘దువ్వాడ జగన్నాథం’ (DJ: Duvvada Jagannadham)పద్ధతిగా, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ (S/O Satyamurthy)లో హూందాగా.. ఇలా సినిమాసినిమాకీ కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. ట్రెండ్‌కు తగ్గట్టు క్యారెక్టర్లు ఎంపిక చేసుకుని ఫ్యాన్స్‌ను మెప్పించడంతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొంది ఎన్నో అవార్డులు పొందాడు. అర్జున్‌ కమర్షియల్‌ చిత్రాలకే పరిమితంకాడనే దాన్ని ‘వేదం’ (Vedam), ‘రుద్రమదేవి’ (Rudhramadevi) నిరూపించాయి. ‘ఫలానా సినిమాలో క్లైమాక్స్‌లో మీ పాత్ర చనిపోతుంది నటిస్తారా?’ అని ఏ స్టార్‌ హీరోనైనా అడిగితే వెనకడుగేస్తుంటారు. కానీ, ఆ విషయంలో ‘వేదం’ కోసం బన్నీ ముందడుగేశాడు. ‘రుద్రమదేవి’ సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్‌ దానికి తనలాంటి స్టార్‌ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించి, తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఈయన నటించిన కొన్ని సినిమాలు హిందీ, మలయాళంలో డబ్‌కావడంతో అక్కడా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మలయాళంలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఆ అభిమానమే ఆయన్ను అక్కడ ‘మల్లు అర్జున్‌’గా నిలిపింది. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo)తో కొత్త రికార్డులు నమోదు చేసి, ‘పుష్ప: ది రైజ్‌తో’ (Pushpa: The Rise) ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బన్నీ ప్రస్తుతం ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) సినిమాలో నటిస్తున్నాడు.

ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా..

అర్జున్‌ నటుడిగా ఎంతగా అలరిస్తాడో డ్యాన్సర్‌గా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాడు. ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ది బెస్ట్‌ డ్యాన్సర్‌ ఎవరు?’ అని ప్రశ్నిస్తే బన్నీ పేరు తప్పక వినిపిస్తుంది. నృత్యంపై తనకున్న ఆసక్తితో కుటుంబంలో జరిగే వేడుకల్లో ప్రతిభ చూపేవాడు బన్నీ. ‘‘విద్యార్థిగా ఉన్నప్పుడు పలు డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొన్నా.. నేను ఏ ఒక్కదాంట్లోనూ గెలవలేదు. డ్యాన్స్‌ విషయంలో సినీ రంగంలో నేను ఎవరితోనూ పోటీ పడను. కానీ, ప్రొఫెషనల్‌ డ్యాన్సర్లతో పోటీపడి నర్తించడానికి సిద్ధంగా ఉంటా. మంచి నటుడితోపాటు ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ అని అనిపించుకోవడం నాకిష్టం’’ అంటుంటాడాయన. స్కూల్‌/కాలేజ్‌ డేస్‌లో డ్యాన్సర్‌గా ఓడినప్పుడు నిరుత్సాహపడకుండా మరింత ఫోకస్‌తో పనిచేసి వెండితెరపై గొప్ప డ్యాన్సర్‌గా గుర్తింపు పొందిన బన్నీ జర్నీ ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఫ్యామిలీ.. ఫ్యాన్స్‌ ఆర్మీ

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితాన్నీ ఆస్వాదిస్తుంటాడు బన్నీ. ‘ఫ్యామిలీ ఫస్ట్‌’ అని అనుకునే ఆయన వీలు కల్పించుకొని మరీ భార్యాపిల్లలతో గడిపేందుకు సమయం కేటాయిస్తుంటాడు. మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు అని అనిపించుకున్నాడు. తన తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఓ కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యాడు. చదువులో చురుకుగా ఉండేవాణ్నికాదని, ఆ విషయంలో తన తల్లి ప్రోత్సాహంతోనే రాణించగలిగానని, క్రమశిక్షణ- సమయపాలన ఆవిడ నుంచే అలవడ్డాయని ఓ సందర్భంలో వివరించాడు. ‘కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే. ఎవరికైనా ఫ్యాన్స్‌ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే’ అని ఆనందంతో ఉప్పొంగిపోతాడు.

ట్రెండ్‌ సెటర్‌గా..

ఇప్పుడంటే హీరోలు సిక్స్‌ప్యాక్‌ బాడీతో కనిపించడం తెలుగు ప్రేక్షకులకు అలవాటైంది. ఆ ట్రెండ్‌ సెట్‌ చేసింది బన్నీనే. తెరపై ఆరు పలకల దేహంతో కనిపించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడాయన. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకుపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న తొలి దక్షిణాది స్టార్‌గాను అర్జున్‌ సత్తా చాటాడు.

మరికొన్ని సంగతులు

బాధపడిన క్షణాలు: బన్నీకి నటి ఐశ్వర్యరాయ్‌ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట. కొన్నాళ్ల కిత్రం కొందరు అభిమానులు తన పేరును పచ్చబొట్టు పొడిపించుకుని కలవగా.. వాళ్లు చేసిన పనికి ఫీలయ్యాడు బన్నీ.

ఎన్నిసార్లైనా చూసే సినిమాలు: టైటానిక్‌, ఇంద్ర

కలిసి పనిచేయాలనుకునే దర్శకులు: శంకర్‌, మురుగదాస్‌, రాజమౌళి తదితరులు

ప్రశంస: ‘ఓ ఈవెంట్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘అందరికీ అర్జున్‌ మంచి డ్యాన్సర్, నటుడనే తెలుసు. ఆయనలో ఇంకెన్నో అద్భుతమైన లక్షణాలున్నాయి. మా అబ్బాయి అతనిలా అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారని, దానికి మించి ప్రశంస లేదని బన్నీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని