Adipurush: మా సినిమాలోని డైలాగ్స్ నన్నెంతో బాధించాయి: ‘ఆదిపురుష్‌’ నటుడు

ప్రభాస్‌ (Prabhas), కృతిసనన్‌ (Kriti Sanon) జంటగా నటించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా చుట్టూ వివాదం నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను చాలామంది తప్పుబడుతున్నారు. ఈ విషయంపై తాజాగా చిత్రంలో పనిచేసిన ఓ నటుడు స్పందించారు.

Published : 28 Jun 2023 18:48 IST

ముంబయి: ‘ఆదిపురుష్‌’ (Adipurush)లోని డైలాగ్స్‌పై అంతటా వివాదం నెలకొన్న వేళ.. ఇందులోని కొన్ని మాటలు తనకూ నచ్చలేదని సినిమాలో పనిచేసిన ఓ నటుడు అన్నారు. తమ చిత్రానికి ఇంతటి వ్యతిరేకత వస్తుందని అస్సలు ఊహించలేదని ఆయన తెలిపారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ‘ఆదిపురుష్‌’లో ఆయన ఏ పాత్ర పోషించారంటే..?

ఓంరౌత్‌ (Om Raut) తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’లో రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడి పాత్రలో నటించారు పంజాబీ నటుడు లావీపజ్నీ (Lavi Pajni). సినిమాలో కనిపించేది కొద్ది సమయమే అయినా తన నటనతో లావీ ప్రేక్షకులను అలరించారు. ఇదిలా ఉండగా, తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తమ చిత్రానికి వస్తోన్న నెగెటివ్‌ రెస్పాన్స్‌పై మాట్లాడారు. ముఖ్యంగా డైలాగ్స్‌ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సినిమాని చిత్రీకరిస్తున్నప్పుడు ఇన్ని వివాదాలు తలెత్తుతాయని నటీనటులెవరూ ఊహించలేదు. సినిమాలోని వివాదాస్పద సంభాషణలు తొలగించినప్పటికీ.. ఒక హిందువుగా ఆ డైలాగ్స్‌ విషయంలో నేనూ ఆవేదనకు లోనయ్యా’’ అని చెప్పారు.

ఇక, ‘ఆదిపురుష్‌’ మాటల వివాదం కోర్టు వరకూ చేరిన విషయం తెలిసిందే. ‘‘హిందువులు చాలా క్షమాగుణం ఉన్నవారు. అలాగని ప్రతిసారీ వారి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారు? సభ్యత చూపుతూ సహనంతో ఉన్నారు కదా అని అణచివేతకు దిగడం సరైనదేనా?’’ అని అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం మంగళవారం చిత్రబృందాన్ని ప్రశ్నించింది. రామాయణ గాథ ఆధారంగా ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘ఆదిపురుష్‌’లో కీలక పాత్రలను చిత్రీకరించిన తీరుపై కోర్టు విస్మయం వ్యక్తపరిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని