Ajith-Shalini: లవ్‌డేస్‌: షాలినికి అజిత్‌ సీక్రెట్‌ కోడ్‌.. ‘సోనా ఏకే-47 కాలింగ్‌’

Ajith-Shalini: అజిత్‌-షాలిని ప్రేమించుకునే రోజుల్లో వీరిద్దరి మధ్య ఉన్న సీక్రెట్‌కోడ్‌ వర్డ్‌ను మరో నటుడు కుంచకో బోబన్‌ ఓ సందర్భంలో పంచుకున్నారు.

Updated : 25 Apr 2023 17:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ పరిశ్రమలో ముచ్చటైన జంటగా తమిళ కథానాయకుడు అజిత్‌, షాలిని (Ajith-Shalini) జోడీకి పేరుంది. ‘అమరకలమ్‌’ సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి, అది కాస్తా వీరిని పెళ్లి పీటలెక్కించింది. ఏప్రిల్‌ 25తో వీరి వివాహం జరిగి 23ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అజిత్‌తో దిగిన ఫొటోను షాలిని అభిమానులతో పంచుకున్నారు. ‘ప్రేమతో 23 సంవత్సరాలు’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. అజిత్‌-షాలిని ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరూ మాట్లాడకోవడానికి ఒక కోడ్‌వర్డ్‌ ఉండేదట. ఈ విషయాన్ని ‘నీరమ్‌’లో షాలినితో కలిసి నటించిన కుంచకో బోబన్‌ ఓ సందర్భంలో పంచుకున్నారు.

కోడ్‌ నేమ్‌ ‘సోనా ఏకే-47 కాలింగ్‌’

ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, వాట్సాప్‌ చాట్‌లు ఉన్నాయి కానీ, 1999-2000 సంవత్సరంలో ప్రేమికులే కాదు, ఎవరు మాట్లాడుకోవాలనుకున్నా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లే వినియోగించాల్సి వచ్చేది. నిత్యం షూటింగ్‌లలో ఎక్కడ ఏ స్పాట్‌లో ఉంటారో తెలియని సినీతారల పరిస్థితి మరీ కష్టం. అప్పుడప్పుడే భారతీయ మార్కెట్‌లోకి మొబైల్‌ ఫోన్ల రాక మొదలైనా, అది చాలా ఖరీదైన వ్యవహారం. ఆ సమయంలో షాలిని ‘నీరమ్‌’ సినిమాలో నటిస్తోంది. ఇందులో కుంచకో బోబన్‌ కథానాయకుడు. ఆయనకు సోనీ ఎరిక్సన్‌ మొబైల్‌ ఉండేది. షాలినితో అజిత్‌ మాట్లాడాలనుకున్నప్పుడల్లా కుంచకో బోబన్‌కు మొబైల్‌ ఫోన్‌ చేసేవారట. అందరిముందు ఫోన్‌ ఎవరు చేశారో తెలియకుండా ఉండేందుకు ‘సోనా.. ఏకే-47 కాలింగ్‌’ అని పిలివాలని అజిత్‌ సూచించడంతో ఫోన్‌ వచ్చినప్పుడల్లా సెట్‌లో ఎవరికీ అర్థంకాకుండా ఉండేందుకు షాలినిని కుంచకోబోబన్‌ అలాగే పిలిచేవారట. ఒకరోజు ‘ఏకే-47’ కోడ్‌వర్డ్‌పై ఆ సినిమా దర్శకుడు కమల్‌కు అనుమానం రావడంతో ఇదే విషయాన్ని కుంచకోను అడగడంతో అసలు విషయాన్ని ఆయన చెప్పడంతో అందరూ నవ్వుకున్నారట. ఆ మరుసటి రోజే దర్శకుడు షాలినిని పిలిచి ‘ఏకే-47 ఈ రోజు ఎందుకు ఫోన్‌ చేయలేదు’ అని అడగడంతో ఆమె చిరునవ్వులు చిందిస్తూ తెగ సిగ్గు పడిపోయిందట.

అజిత్‌-షాలిని (Ajith-Shalini) దంపతులకు ఇద్దరు పిల్లలకు అమ్మాయి అనౌష్క, అబ్బాయి ఆద్విక్‌. ‘అమరకలమ్‌’ చిత్రీకరణ సందర్భంగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరి దగ్గర చేసింది. షూటింగ్‌ సమయంలో షాలిని చేతిని అజిత్‌ పొరపాటున కట్‌ చేశారు. దీంతో చాలా ఇబ్బంది ఫీలయిన అజిత్‌ ఆ గాయం తగ్గే వరకూ రోజూ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారట. ఆ ప్రేమకే షాలిని కరిగిపోయి అజిత్‌ని వివాహం చేసుకున్నారు. ఇక అజిత్‌ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ఆయన నటించిన ‘తెగింపు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు