Vijayalakshmi నిద్రలోనూ అవే శబ్దాలు వినిపించేవి..: ఎల్.విజయలక్ష్మి
అలనాటి హీరోయిన్ ఎల్.విజయలక్ష్మి(L.Vijayalakshmi) ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి అప్పటి ముచ్చట్లు పంచుకున్నారు.
దశాబ్దానికి పైగా దక్షిణాదిని అలరించిన మహానటి.. తెలుగు తెరకు దూరమై అర్ధశతాబ్దం దాటింది. కానీ, నేటికి ఆమెను అందరూ గుర్తుంచుకున్నారంటే కారణం ఎన్నో మరపురాని చిత్రాల్లో ఆమె పోషించిన అత్యద్భుతమైన పాత్రలే. నటనతోనే కాకుండా నాట్యంతోనూ చిత్ర చరిత్రలో చెరిగిపోని సంతకాన్ని చేసిన లెజండరీ నటి ఎల్.విజయలక్ష్మి(L.Vijayalakshmi). ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆలీతో సరదాగాలో(Alitho Saradaga) అలనాటి ముచ్చట్లను పంచుకున్నారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దాం.
కెమెరాను చూసి ఎన్ని రోజులైంది? అమెరికా వెళ్లి అక్కడ ఉండిపోడానికి కారణం ఏంటి?
ఎల్.విజయలక్ష్మి: కెమెరా ముందుకు వచ్చి దాదాపు 50 సంవత్సరాలు దాటి ఉంటుంది. అమెరికా నుంచి అప్పుడప్పుడు ఇండియాకు వస్తుంటా. కానీ, సినిమాల కోసం కాదు. మా అమ్మానాన్నలను చూసేసి వెళ్లిపోతా. అక్కడ నేను, మా వారు ఇద్దరం వర్క్ చేస్తుంటాం. అందుకే రావడానికి కుదరదు. ఇప్పుడు ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వచ్చా. ఈ అవార్డు తీసుకుంటున్నానంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కల నిజం అయినట్లు ఉంది.
మీ సొంత ఊరు ఏది?
ఎల్.విజయలక్ష్మి: నేను తమిళనాడులో పుట్టా. ఆ తర్వాత కొన్ని రోజులకు మేం మహారాష్ట్ర వెళ్లిపోయాం. మా నాన్న ఉద్యోగరీత్యా అలా మారేవాళ్లం. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్నాం. మాకు ఒక బాబు. వాడికి ఇద్దరు పిల్లలు. తెలుగు సినిమాల్లో చేయడం మొదలుపెట్టాకే ఈ భాష నేర్చుకున్నా. ఆ రోజుల్లో షూటింగ్ అంటే పిక్‌నిక్‌లా ఉండేది. అందరం కలిసి అన్నం తింటూ అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మా అమ్మ వీణ బాగా వాయిస్తారు. ఆవిడ వీణ వాయిస్తూ పాడుతుంటే నేను ఆ లిరిక్స్‌కు తగ్గట్లు డ్యాన్స్ వేసేదాన్ని. మా నాన్న నాలో ఏదో టాలెంట్ ఉందని గుర్తించి డ్యాన్స్ క్లాస్‌లో చేర్పించారు. ఆరేళ్ల వయసులోనే ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర గవర్నర్ ప్రశంసలు అందుకున్నా. ఆ తర్వాత నాకు డ్యాన్స్ నేర్పించాలని మా కుటుంబం మద్రాసు వచ్చేశారు. ఒకసారి స్టేజిపై 3 గంటలు ఆపకుండా నాట్యం చేశాను.
మీ మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?
ఎల్.విజయలక్ష్మి: 1959-1960 మధ్య కాలంలో చిత్ర పరిశ్రమకు వచ్చా. 1967లో పెళ్లి అయింది. వెంటనే అమెరికా వెళ్లిపోయాం. ఇక ఆ తర్వాత సినిమాలు చేయలేదు. ‘సిపాయి కూతురు’ సినిమా కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చా. నా నాట్య ప్రదర్శనకు సినిమా ప్రొడ్యూసర్, డైరక్టర్ వచ్చారు. నా డ్యాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని కోరారు. మా నాన్న అడిగితే నీ ఇష్టం అన్నారు. నాకు నచ్చితే సినిమాల్లో కొనసాగమని చెప్పారు.
డ్యాన్స్‌లో మీకు స్ఫూర్తి ఎవరు?
ఎల్.విజయలక్ష్మి: నాకు నా తల్లిదండ్రులే స్ఫూర్తి. మా అమ్మ పాటలు పాడుతుంటే నేను అలా పాడాలని అనుకుంటూ ఉండేదాన్ని. మా నాన్న నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మేము పుణెలో ఉన్నప్పుడు అక్కడకు కొంతమంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చేవాళ్లు. మా నాన్న అలాంటి కార్యక్రమాలకు నన్ను కచ్చితంగా తీసుకెళ్లేవారు. నేను ఇంటికి వచ్చాక వాళ్లలాగా చేయడానికి ప్రయత్నించేదాన్ని. డ్యాన్స్, పాట నాకు రెండు కళ్లలాంటివి. ఇప్పటికీ అమెరికాలో అందరితో కలిసి జుంబా డ్యాన్స్ వేస్తాను. (నవ్వులు)
హీరోయిన్‌గా ఉంటూ సడెన్‌గా అకౌంటెంట్ ఎందుకయ్యారు?
ఎల్.విజయలక్ష్మి: నా భర్త శాస్త్రవేత్త. ఇంట్లో ఎప్పుడు చదువుకు సంబంధించిన చర్చలే ఉండేవి. అప్పుడు నాకూ చదువుకోవాలని అనిపించింది. అలా మొదట బీకామ్ చేశా. తర్వాత అమెరికాలో సీపీఏ(భారత్‌లో సీఏ అంటారు)చేశా. తర్వాత బడ్జెట్ ఆఫీసర్‌గా వర్క్ చేయడం మొదలుపెట్టా. ఏదైనా పని చేయాలనే సంకల్పం, తపన ఉంటే జీవితంలో స్థిరపడచ్చు అనేది నా ఉద్దేశం.
ఈ మధ్య కాలంలో సినిమాలు చూశారా?
ఎల్.విజయలక్ష్మి: లేదు. నాకు సినిమాలు చూసేంత టైం ఉండదు. అప్పుడెప్పుడో బాలకృష్ణ సినిమా చూశా. తర్వాత చిరంజీవిది. తాజాగా అయితే పుష్ప చూశాను.(మధ్యలో ఆలీ మాట్లాడుతూ.. పుష్పలో హీరో అల్లురామలింగయ్య మనవడు అని చెప్పారు). ఈరోజుల్లో ఎవరినీ అడిగినా ఈ హీరో ఫలనా వాళ్ల చుట్టాలనే అంటున్నారు(నవ్వుతూ). ఈ తరం నటీనటులు చాలా కష్టపడుతున్నారు. హ్యాట్సాఫ్ చెప్పాలి.
అమెరికాలో మీరు ఉండే ప్రాంతంలో తెలుగువాళ్లు ఉంటారా?
ఎల్.విజయలక్ష్మి: ఉన్నారు. కానీ నాకు వాళ్లతో మాట్లాడేంత సమయం లేదు. మాట్లాడడం తగ్గిపోయింది కదా అందుకే నా తెలుగు కొంచెం కొత్తగా ఉంటుంది. అమెరికాలో ఉన్న ఐటీ వాళ్లలో చాలామంది తెలుగువాళ్లే. వాళ్లు ఎంతబాగా రాణిస్తున్నారో. వాళ్లని చూసినప్పుడు నాది కూడా భారతదేశమని గర్వంగా ఉంటుంది.
అప్పట్లో మీరు బాగా క్లోజ్‌గా ఉన్న హీరోయిన్స్ ఎవరు? రామారావు, నాగేశ్వరరావులతో ఎన్ని సినిమాలు చేశారు?
ఎల్.విజయలక్ష్మి: సరోజదేవి, కేఆర్ విజయ, కాంచన... ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. మా మధ్య బంధం చాలా బాగుండేది. రామారావు గారితో 15 సినిమాల్లో చేశా. నాగేశ్వరరావుతో 6 సినిమాలు చేసినట్లున్నా.
రామారావు, నాగేశ్వరరావు నుంచి ఏం నేర్చుకున్నారు?
ఎల్.విజయలక్ష్మి: రామారావు గారు ఒక నిఘంటువని చెప్పొచ్చు. ఆయన షూటింగ్‌లకు కచ్చితంగా సమయానికి వచ్చేవాళ్లు. ఉదయం 7 గంటలకు షూటింగ్ మొదలు అంటే ఆ టైంకి అక్కడ ఉంటారాయన. నేను క్రమశిక్షణ ఆయన నుంచే నేర్చుకున్నా. పనిపై ఆయనకు ఉన్న శ్రద్ధ. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఆ తర్వాత నాకు చదువుకోవడంలోనూ ఉపయోగపడ్డాయి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు కెమెరా ముందు ఒకలా ఉండేవారు. కెమెరా ఆపేశాక జోకులు వేస్తారు. చాలా సరదాగా ఉండేవారు.
ఎన్టీఆర్ మిమ్మల్ని ఏమని పిలిచే వారు?ఇప్పుడు ఉన్న హీరోయిన్స్‌లో ఎవరి డ్యాన్స్ ఇష్టం?
ఎల్.విజయలక్ష్మి: ఆయన నన్ను కోడలా.. అని పిలిచేవారు. నర్తనశాల సినిమాలో కోడలుగా చేశా. ఆ తర్వాత ఎప్పుడు చూసినా కోడలా.. కోడలా.. అని పిలిచేవారు. ఇప్పటి వాళ్లడ్యాన్స్ నేను చూడలేదు. ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్‌ల డ్యాన్స్ నాకు ఇష్టం. అలాగే సాయిపల్లవి డ్యాన్స్ బాగా వేస్తుందని చెప్పారు. నేను ఎప్పుడూ చూడలేదు.
గుండమ్మకథ రిలీజ్ టైమ్‌కు చివరి నిమిషంలో మీ సాంగ్ రికార్డు చేసి పెట్టారట?
ఎల్.విజయలక్ష్మి: అవును. గుండమ్మకథలో పద్మ అనే పాత్రలో నేను నటించాను. విడుదలయ్యే సమయానికి విజయలక్ష్మి సినిమాలో ఉండి.. ఆమె డ్యాన్స్ లేకుంటే ఎలా అన్నారు. అప్పటికప్పుడు కేవలం మ్యూజిక్ మాత్రమే పెట్టి నాతో డ్యాన్స్ చేయించారు.
మీకు పెళ్లి అయిన కొత్తల్లో నిద్రలో కూడా క్లాప్, యాక్షన్ అని వినపడుతుండేవట నిజమేనా?
ఎల్.విజయలక్ష్మి: నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక షూటింగ్ ఉంటూనే ఉండేది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్లాక ఒక్కసారిగా అవి ఆగిపోయాయి. నిద్ర పోతున్నప్పుడు కూడా సడెన్‌గా క్లాప్ సౌండ్ వినిపించేది. నిద్రలోనే రెడీ సర్ అనుకుంటూ లేచేదాన్ని.
మీ భర్తను ఎక్కడ కలిశారు?
ఎల్.విజయలక్ష్మి: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మా అన్నయ్య అమెరికాలో ఉండేవాడు. అక్కడే మా వారు పరిచయమయ్యారు. ఒకసారి మా అన్నయ్య దగ్గర మా ఫ్యామిలీ ఫొటో చూశారు. అందులో నన్ను చూసి.. పెళ్లి చేసుకుంటా అని మా నాన్నను అడిగారు. మా వాళ్లు వెంటనే ఓకే అన్నారు. మొదట నేను, మావారు హిందీలో మాట్లాడుకుందామనుకున్నాం. కానీ మావారు హిందీ మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చేది. అందుకే ఇక ఇద్దరం ఇంగ్లిషులో మాట్లాడుకుంటాం. మా అత్తగారి వాళ్లతో మాట్లాడి నాకు బెంగాలీ వచ్చేసింది. అలాగే స్పానిష్ కూడా నేర్చుకున్నా.
అమెరికాలో ఒకావిడ మిమ్మల్ని చూసి ఎల్. విజయలక్ష్మిలా ఉన్నారే.. అన్నారట నిజమేనా?
ఎల్.విజయలక్ష్మి: ఒకసారి అమెరికాలో నేను డ్యాన్స్ షో చూసి బయటకు వస్తుంటే ఇద్దరు ఆడవాళ్లు నన్ను చూసుకుంటూ వెళ్తున్నారు. నేను ఎందుకు అలా చూస్తున్నారని అడిగాను. ఒకావిడ నా దగ్గరకు వచ్చి ‘మిమ్మల్ని చూస్తుంటే ఎల్. విజయలక్ష్మిలా ఉన్నారు’ అని చెప్పింది. నేనే ఆ విజయలక్ష్మిని అని చెప్పినా నమ్మలేదు. ఆ తర్వాత మేము స్నేహితులమయ్యాం.
రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూశారా? ఒక లెజెండరీ హీరో మీతో డ్యాన్స్ చేయడం కోసం నెలరోజులు డాన్స్ నేర్చుకుని వచ్చాడట?ఎవరతను?
ఎల్.విజయలక్ష్మి: ఇంకా లేదు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాగుందని అందరూ చెబుతున్నారు. టైం ఉన్నప్పుడు ఆ సినిమా చూడాలి. తమిళ మూవీలో భాంగ్రా డ్యాన్స్ వేయాలి. ఆరోజుల్లో ఆ డ్యాన్స్ ఎవరికీ తెలీదు. ఎమ్‌జీ రామచంద్రన్ గారు నాతో డ్యాన్స్ చేయాలంటే నేర్చుకోవాలి అని నెల రోజులు నేర్చుకున్నారు.
ఇప్పుడు సినిమాల్లో ఆఫర్స్ వస్తే చేస్తారా?
ఎల్.విజయలక్ష్మి: కథ బాగుంటే చేస్తాను. సినిమాలో నా పాత్ర బాగుండాలి అలా అయితే చేస్తాను.
అప్పుడు ఉన్న సినిమాలకు ఇప్పటి వాటికి మధ్య మీరు గమనించిన మార్పు ఏంటి?
ఎల్.విజయలక్ష్మి: పాత సినిమాల్లో టెక్నాలజీ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు చాలా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి నటీనటులు కూడా చాలా టాలెంటెడ్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!