Bhagavanth Kesari: ‘భగవంత్‌ కేసరి’తో మరో కొత్త ఓవర్‌ మొదలుపెట్టా!

హాస్య ప్రధానమైన సినిమాలకి కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు అనిల్‌ రావిపూడి. అగ్ర హీరోలతో సినిమాలు తీసినా ఆయన ఎక్కువగా నవ్వించడంపైనే దృష్టిపెట్టారు. కానీ ఈసారి

Updated : 15 Oct 2023 15:54 IST

హాస్య ప్రధానమైన సినిమాలకి కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు అనిల్‌ రావిపూడి. అగ్ర హీరోలతో సినిమాలు తీసినా ఆయన ఎక్కువగా నవ్వించడంపైనే దృష్టిపెట్టారు. కానీ ఈసారి ఆయన కొత్త దారిని ఎంచుకుని ‘భగవంత్‌ కేసరి’ని తెరకెక్కించారు. తన మార్క్‌ హాస్యం పంచుతూనే... భావోద్వేగాలకి ప్రాధాన్యమిస్తూ ఈ సినిమా చేశారు. బాలకృష్ణ కథానాయకుడిగా షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘హాస్యం పుట్టించడంలో ప్రేక్షకులే కీలకం. ప్రేక్షకుల్లోకి మనం ఏం పంపించాలి? వాళ్లలో ఉన్నవి మనం ఏం వాడాలి? అనేది ఆలోచిస్తూ  స్క్రిప్ట్‌ రాసుకుంటా. ఈ రెండింటిలో పక్కాగా ఏది జరిగినా వినోదం పండుతుంది. ఈ సినిమాతో ‘ష్‌.. సప్పుడు జేయక్‌, బ్రో.. ఐ డోంట్‌ కేర్‌’  తరహా సంభాషణల గురించి సినిమా విడుదల తర్వాత మరింత ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణంలో ఎక్కువ సవాళ్లు విసిరిన స్క్రిప్ట్‌ అంటే ఇదే. నేను ఆట మార్చి చేసిన సినిమా ఇది’’.

‘భగవంత్‌ కేసరి’ గురించి దర్శకుడిగా మీరేం చెబుతారు?

కొత్త సినిమా, మంచి సినిమా. పది నిమిషాల తర్వాత ఇది వేరే ప్రపంచం అని అర్థమవుతుంది ప్రేక్షకులకి. బాలకృష్ణ ఇప్పటివరకూ చేసిన సినిమాలకి పూర్తి భిన్నంగా, అత్యంత సహజంగా సాగుతుంది. భగవంత్‌ కేసరి పాత్రలో బాలకృష్ణని ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. మహిళలు, కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు కూడా ఇందులో ఎక్కువగానే ఉన్నాయి. 

ఈ సినిమాతో మీ శైలి కూడా మారిందని అర్థమవుతోంది. ఈ మార్పుకి కారణం?

ఆరు సినిమాలు పూర్తి చేశా. ఒక ఓవర్‌ పూర్తయ్యాక, ఇంకో ఓవర్‌ని ప్రారంభించినట్టుగా ఉంది. మరో కొత్త ఇన్నింగ్స్‌ అన్నమాట. ఇదివరకటి సినిమాల్లోనూ   భావోద్వేగాలు, డ్రామా సన్నివేశాలు ఉన్నప్పటికీ ఎక్కువగా హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చా. ఈసారి పూర్తిగా గాఢమైన డ్రామా, భావోద్వేగాలతో నిజాయతీగా ఓ సినిమా చేయాలనుకున్నా. బాలకృష్ణ రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. మంచి నటులు, నిర్మాణ విలువలు, కథ అన్నీ అద్భుతంగా కుదిరాయి. చాలా ఏళ్లు యాదుంటది అన్నట్టే ఈ సినిమా గురించి చాలా రోజులు మాట్లాడుకుంటాం.

ఐ డోంట్‌ కేర్‌... అని ఉపశీర్షిక పెట్టారు. బాలకృష్ణ వ్యక్తిత్వం ఆధారంగానే ఆయన పాత్రని తీర్చిదిద్దారా?

ఎట్లున్నా పాడతా అని ట్రైలర్‌లో కూడా ఆయన చెప్పారు కదా. చాలా సంభాషణలు, పాత్ర నడవడిక ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాయి. ఇందులో ఆయన చేతపట్టే ఆయుధాలు కూడా కొత్తగా ఉంటాయి. అక్కడికక్కడే ఆయుధం తయారు చేసుకుని రంగంలోకి దిగుతాడు. ఆ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. ఎప్పుడైనా నేను ముందు కథ రాసుకుంటా, అది ఎవరితో తీస్తానో తెలిశాక వాళ్లకి తగ్గట్టుగా పాత్రల్ని డిజైన్‌ చేస్తుంటా. కొత్త అంశాలున్న కథని స్వీకరించే కథానాయకుడు బాలకృష్ణ. ఒక మంచి కథ చెప్పాలి, కొత్తగా చేయాలనే ప్రయత్నంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ తదితర చిత్రాలే అందుకు ఉదాహరణ.

బాలకృష్ణ ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తారా?

ఒక పాత్రలోనే కనిపిస్తారు. కానీ రెండు మూడు కోణాలు ఉంటాయి. ముందు జైలు నుంచి మొదలవుతుంది కథ. ఆ తర్వాత ఒక అమ్మాయితో కలిసి ప్రయాణం చేస్తూ తన లక్ష్యం వైపు ఎలా వెళ్లాడనేది ఇందులో చూస్తారు. బాలకృష్ణని ఢీ కొట్టే ప్రతినాయకుడి పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ కనిపిస్తారు. ఆయన్ని ‘ఓం శాంతి ఓం’లో చూసినప్పట్నుంచే ఇష్టం. ఆయన తెరపై కనిపించే విధానం, ఆయన గళం చాలా బాగుంటుంది. ఆయనకి కథ చెప్పగానే ఎంతో ఉత్సాహంగా ఒప్పుకున్నారు. భాష కూడా నేర్చుకుని స్వయంగా డబ్బింగ్‌ చెబుతానని ముందే చెప్పారు. ముందే స్క్రిప్ట్‌ తీసుకుని ప్రతీ సంభాషణని నేర్చుకుని స్వయంగా డబ్బింగ్‌ చెప్పారు. పతాక సన్నివేశాల్లో ఆయన, బాలకృష్ణ నువ్వా నేనా అన్నట్టు కనిపిస్తారు. కాజల్‌ పాత్ర మరీ పెద్దది కాదు కానీ, ఉన్నంతలో కథతో కనెక్ట్‌ అయిన కీలక పాత్ర. శ్రీలీలకి ఇది ప్రత్యేకమైన చిత్రం అవుతుంది. నిర్మాతలు హరీష్‌, సాహులతో 2016 నుంచీ సినిమా చేయాలనుకుంటున్నా. ఐదేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ కుదిరింది. వాళ్లతో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేస్తా.

ఇకపైన ఇలాంటి కథలతోనే ప్రయాణం చేస్తారా?

ఒక దర్శకుడిగా నాకు అన్ని రకాల సినిమాలూ చేయాలని ఉంది. ‘స్వాతిముత్యం’ తరహా సినిమాలు కూడా చేయాలని ఉంటుంది.  తదుపరి మళ్లీ హాస్య ప్రధానమైన సినిమా చేయాలనీ, పూర్తిస్థాయిలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేయాలనీ ఇలా చాలా ఆలోచనలే ఉన్నాయి. ప్రేక్షకులు అందించే ప్రోత్సాహాన్నిబట్టి కుదిరినప్పుడల్లా ప్రయోగాలు చేస్తూ, విభిన్నమైన జానర్స్‌ని స్పృశిస్తూ ప్రయాణం చేయాలనేదే  నా ప్రయత్నం. ప్రస్తుతానికి నా దృష్టంతా ‘భగవంత్‌ కేసరి’పైనే ఉంది. విడుదల తర్వాత కానీ కొత్త సినిమా గురించి ఆలోచించలేను. ఒకవేళ వినోదాత్మక చిత్రం చేసినా అది మరో తరహాలోనే ఉంటుంది.


ఈ కథ ఎలా పుట్టింది? మొదట  ‘బ్రో... ఐ డోంట్‌ కేర్‌’ అనే పేరుని పరిశీలించారట కదా..

అమ్మాయి లేడి పిల్లలా కాదు... పులి పిల్లలా ఉండాలని చెప్పే ఓ అందమైన కథ ఇది. అమ్మాయిని సింహంలా పెంచాలని తపించిన నేలకొండ భగవంత్‌ కేసరి కథ. జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో విజ్జిపాప బలహీనురాలు అయిపోతుంది. ఆ సంఘటన నుంచి బయటికి తీసుకొచ్చి ఆమెని బలవంతురాలిని చేసే ప్రయత్నం ఎలా సాగింది? ఇంతకీ ఆమె జీవితంలో జరిగిన సంఘటన ఏమిటనే విషయాలు కీలకం. ఇదొక కల్పిత కథే. ఆర్మీ నేపథ్యాన్ని ఎంచుకుని ఈ కథ చెప్పాం. కథ రీత్యా ‘బ్రో... ఐ డోంట్‌ కేర్‌’ అనే పేరు పెట్టాలనుకున్నమాట నిజమే. కానీ టైటిల్‌లో పేరు ఉంటేనే ఎక్కువ రోజులు ప్రేక్షకులు ఆ సినిమాతో ప్రయాణం చేస్తారనిపించి ‘భగవంత్‌ కేసరి’ అని పెట్టాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని