Sandeep Reddy Vanga: ‘వాళ్లకు సినిమా గురించి ఏమీ తెలియదు’.. సినీ విమర్శకులపై సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం

‘యానిమల్‌’ (Animal) చిత్రంపై విమర్శలు చేసిన సినీ విశ్లేషకులను ఉద్దేశించి సందీప్‌ (Sandeep Reddy Vanga) కీలక వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 21 Dec 2023 02:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ విమర్శకులపై ‘యానిమల్‌’ (Animal) దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా గురించి సరైన అవగాహన లేకుండానే కొంతమంది రివ్యూలు రాస్తున్నారని ఆయన అన్నారు. తన చిత్రాన్ని విమర్శిస్తూ పలువురు డబ్బులు సంపాదిస్తున్నారంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు.

‘‘నా చిత్రాన్ని విమర్శిస్తూ మీరు డబ్బు, ఫేమ్‌, పేరు పొందుతున్నారు. ‘కబీర్‌సింగ్‌’ విడుదలైనప్పుడు ఆ సినిమాపై చాలామంది విమర్శలు చేశారు. ఆ చిత్రాన్ని విమర్శించి ఫేమ్‌ పొందాలని భావించారు. ఆ సినిమా క్రాఫ్ట్‌, ఎడిటింగ్‌, సౌండ్‌ గురించి ఒక్కరూ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్లకు సినిమా గురించి ఏమీ తెలియదు. ఒక చిత్రాన్ని ఎలా విమర్శించాలి? లేదా ఒక చిత్రాన్ని ఎలా రివ్యూ చేయాలి? అనేది కూడా వాళ్లకు తెలియదు. నైతికత ఒక్కటే చూపించాలనుకుంటే సినిమా చేయడం వీలుపడదు. ప్రతి ఒక్కరూ కేవలం నైతికతపై దృష్టి సారిస్తే, సినిమాలు తెరకెక్కించడం మానేయాలి’’ అని ఆయన అన్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి తాను ముంబయిలో ఉంటున్నానని.. కొంతమంది ఫిల్మ్‌ మేకర్స్‌ డబ్బులు ఇచ్చి మరీ తమ సినిమాలపై రివ్యూలు రాయించుకుంటారని విమర్శించారు.

SALAAR: ‘సలార్‌’కు ‘ఎ’ సర్టిఫికేట్‌.. నిరాశకు గురయ్యా: ప్రశాంత్‌ నీల్‌

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) - రష్మిక (Rashmika) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’. బాబీ దేవోల్‌, అనిల్‌ కపూర్‌, త్రిప్తి డిమ్రి కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. అయితే, ఈసినిమాలోని పలు సన్నివేశాలను కొంతమంది సినీ విమర్శకులు తప్పుబట్టారు. స్త్రీని తక్కువ చేసి చూపించేలా సీన్స్‌ ఉన్నాయని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని