Avatar 2: ఆ రికార్డును బద్దలు కొట్టలేకపోయిన ‘అవతార్‌2’.. తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘అవతార్‌’కు బాక్సాఫీస్‌ వద్ద అరుదైన రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. అయితే, విజువల్‌ వండర్‌గా మాత్రం మెప్పుపొందుతోంది.

Published : 17 Dec 2022 16:21 IST

హైదరాబాద్‌: విజువల్‌ వండర్‌ ‘అవతార్‌’ (Avatar) కు సీక్వెల్‌గా పదమూడేళ్ల తర్వాత ‘అవతార్‌2’ (Avatar2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లు గానే, అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా జరిగిపోయాయి. అయితే, తొలి రోజు వసూళ్ల విషయంలో ‘అవతార్2’ ఓ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. సూపర్‌ హీరోస్‌ అందరూ కలిసి నటించిన చివరి చిత్రం ‘అవెంజర్స్‌: ది ఎండ్‌ గేమ్‌’ తొలిరోజు కలెక్షన్లను దాటలేకపోయింది.

శుక్రవారం భారత్‌లోనూ ఇంగ్లీష్‌తో పాటు, స్థానిక భాషల్లో ‘అవతార్‌: ది వే ఆఫ్ వాటర్‌’ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రేడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు సుమారు రూ.38 కోట్ల నుంచి రూ.40 కోట్ల మధ్య(గ్రాస్‌) వసూళ్లు రాబట్టింది. కానీ, 2019లో వచ్చిన ‘అవెంజర్స్‌: ది ఎండ్‌గేమ్‌’ (Avengers Endgame) మాత్రం భారత్‌లో ఇంగ్లీష్‌తో పాటు, ఇతర భాషల్లోనూ కలిపి ఏకంగా రూ.53కోట్లు రాబట్టింది. అంటే ‘అవతార్‌2’ దాదాపు రూ.13కోట్లు వెనకబడిపోయింది. దక్షిణాది భాషల్లో ‘అవతార్‌2’కు మంచి మార్కెట్‌ జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో మంచి హైప్‌ వచ్చింది. కానీ కలెక్షన్ల విషయానికొస్తే మొత్తం రూ.22కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కానీ ‘అవతార్-2’ ఇండియా డే-1 వసూళ్లు రూ.40 కోట్లకు అటు ఇటుగా ఉన్నట్లు ట్రేడ్ పండితుల అంచనా.

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో పోలిస్తే, ‘అవతార్‌2’కు తొలిరోజు వచ్చిన కలెక్షన్లు మంచి అంకె అని చెప్పవచ్చు. భారీ బడ్జెట్‌ చిత్రాలు సైతం, ఇందులో సగం కూడా రావడం లేదు. అయితే, మొదటి నుంచి సినిమాపై ఉన్న అంచనాలు, సానుకూల బాక్సాఫీస్‌ పరిస్థితుల్లో ‘అవతార్‌2’ వాటిని అందుకోవడంలో తడబడినట్లేనని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

తొలి భాగంలో పాండోర గ్రహంలోని విలువైన ఖనిజాన్ని దోచుకోవడానికి వచ్చిన మనుషులతో ‘అవతార్‌’గా మారిన హీరో జేక్‌ సలె ఎలా పోరాటం చేశాడన్నది చూపించారు. ఇప్పుడు సీక్వెల్‌లో మానవుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నావి తెగ నుంచి విడిపోయి, సముద్ర తీరంలో జీవించే మెట్కయిని తెగ ఆశ్రయం పొందుతాడు. అప్పటి వరకూ అడవిలో జీవించిన జేక్‌ కుటుంబం సముద్రం, మెట్కయిని తెగతో ఎలా అనుబంధం పెంచుకుంది? ఈ క్రమంలో జేక్‌ను వెతుక్కుంటూ వచ్చిన మనుషులు ఏం చేశారు? వారి నుంచి జేక్‌ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అద్భుతమైన విజువల్‌ వండర్‌ను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు 3డీ, 4డీ, ఐమ్యాక్స్‌ వెర్షన్స్‌పై ఆసక్తి చూపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని