Bedurulanka 2012 review: రివ్యూ: బెదురులంక 2012.. కార్తికేయ కొత్త మూవీ మెప్పించిందా?

కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన ‘బెదురులంక 2012’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 25 Aug 2023 16:23 IST

Bedurulanka 2012 review in telugu; చిత్రం: బెదురులంక 2012; నటీనటులు: కార్తికేయ, నేహాశెట్టి, అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్య, ఎల్బీ శ్రీరామ్‌, జబర్దస్త్‌ రామ్‌ ప్రసాద్‌; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ , సన్నీ కూరపాటి; ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషధం; నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పలనేని; రచన, దర్శకత్వం: క్లాక్స్‌; విడుదల తేదీ: 25-08-2023

‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన హీరో కార్తికేయ. కానీ, ఆ తర్వాత ఆయన నుంచి ఆ స్థాయి చిత్రమేదీ రాలేదు. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతోనే ప్రయాణిస్తూ వస్తున్నారు కార్తికేయ. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) అంటూ మరో విభిన్నమైన కథతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. విడుదలకు ముందే పాటలు మంచి ఆదరణ దక్కించుకోవడం.. టీజర్, ట్రైలర్లు కొత్తదనం నింపుకొని ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. (Bedurulanka 2012 review) మరి ఈ బెదురులంక కథేంటి? ఇది సినీప్రియుల్ని ఏమేర ఆకట్టుకుంది?

కథేంటంటే: డిసెంబరు-2012.. యుగాంతం జరగబోతుందంటూ ప్రచారం జోరు మీదున్న సమయమిది. ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల లంక గ్రామమైన బెదురులంక ప్రజల్లో ఈ యుగాంతపు భయాలు అప్పటికే మరింతగా నాటుకుపోయాయి. దీంతో ఆ భయాల్ని.. ఊరి ప్రజల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అందర్నీ దోచేయాలని ప్రణాళిక రచిస్తాడు ఆ గ్రామంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే భూషణం (అజయ్‌ ఘోష్‌). తన ప్రణాళిక అమలు చేయడం కోసం బ్రహ్మం (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) అనే ఓ దొంగ బాబాను, డేనియల్‌ (రామ్‌ప్రసాద్‌) అనే ఫేక్‌ పాస్టర్‌ను పావులుగా ఎంచుకుంటాడు. (Bedurulanka 2012 review) వారి సహాయంతో ఊరి ప్రజల బంగారం మొత్తం కొల్లగొట్టడానికి ఓ ఎత్తుగడ వేస్తాడు. సరిగ్గా అదే సమయానికి సిటీలో ఉద్యోగం మానేసి ఊరిలోకి అడుగుపెడతాడు శివ (కార్తికేయ). తన మనసుకు నచ్చినట్లు బతికే శివ.. బ్రహ్మం, డేనియల్‌ల మాటల్ని అసలు లెక్కచేయడు. ఆ వ్యక్తిత్వంతోనే ఊరిని దోచేయాలన్న భూషణం పన్నాగాలకు ఎదురు నిలుస్తాడు. ఈ క్రమంలోనే తనెంతగానో ప్రేమించిన ఆ ఊరి ప్రెసిడెంట్‌ (గోపరాజు రమణ) కూతురు చిత్ర (నేహా శెట్టి)కి, పుట్టిన ఊరికి, కన్నవాళ్లకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. మరి ఆ తర్వాత ఏమైంది? యుగాంతం పేరుతో ఊరి ప్రజల్ని దోచేయాలనుకున్న భూషణం కుట్రల్ని అతనెలా తిప్పి కొట్టాడు?(Bedurulanka 2012 review) భక్తి ముసుగులో మోసాలకు పాల్పడుతున్న బ్రహ్మం, డేనియల్‌ల నిజ స్వరూపాల్ని ఎలా బయట పెట్టాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది మిగతా కథ.

ఎలా సాగిందంటే: 2012 డిసెంబరు 21తో ప్రపంచమంతా అంతమైపోతుందంటూ దశాబ్ద కాలం క్రితం జరిగిన ప్రచారం యావత్‌ ప్రజానీకాన్ని ఎంతగా ఆందోళనకు గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యుగాంతపు కథాంశంతో వార్తా ఛానెళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు, ఎన్నో సినిమాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అదే సమయంలో ప్రజల్లో ఉన్న భయానికి.. మతం, భక్తి పేరుతో ఓ ముసుగు తొడిగి ఎంతో మంది మోసగాళ్లు దోచుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఇలా ప్రజల్లో ఉన్న భక్తిని.. భయాన్ని అడ్డం పెట్టుకొని మూఢనమ్మకాలతో పేరుతో అనేక అకృత్యాలకు పాల్పడుతున్న వ్యక్తుల్ని ఇప్పటికీ అనేక చోట్ల తరచూ చూస్తూనే ఉంటాం. ఇదే అంశాన్ని వినోదాత్మకంగా చర్చిస్తూ.. ఈ ‘బెదురులంక’తో ఓ మంచి సందేశమిచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్లాక్స్‌. (Bedurulanka 2012 review) ఓవైపు యుగాంతపు వార్తలు.. మరోవైపు బెదురులంక ప్రజల వ్యక్తిత్వాల్ని చూపిస్తూ సినిమాని ఆరంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. ఆ వెంటనే ఓ సింపుల్‌ సీన్‌తో హీరో పాత్రను.. అతని వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బెదురులంక ప్రజల్లో ఉన్న భయాల్ని అడ్డం పెట్టుకొని భూషణం ఓ పెద్ద కుట్రకు తెరలేపడం.. అదే సమయంలో హీరో ఊరిలోకి అడుగుపెట్టడంతో వెంటనే కథలోకి తీసుకెళ్లిపోయాడు. కానీ, విరామానికి ముందు గానీ అసలు కథ మొదలవ్వదు. ఈ మధ్యలో అంతా నాయకానాయికల ప్రేమకథతోనూ.. బెదరులంకలోని పాత్రల పరిచయాలతోనూ కాలక్షేపం చేశాడు దర్శకుడు. (Bedurulanka 2012 review)

భూషణం ఎప్పుడైతే బ్రహ్మం, డేనియల్‌లతో కలిసి ఊరి ప్రజల బంగారం కొట్టేయడానికి కుట్ర మొదలు పెడతాడో అప్పటి నుంచే కథలో వేగం పెరుగుతుంది. ఈ క్రమంలో శివ ఊరిని వదిలి వెళ్లిపోవాల్సి రావడంతో ద్వితీయార్ధం ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. దీనికి తగ్గట్లుగానే కథానాయిక పెళ్లి ఎపిసోడ్‌తో సెకండాఫ్‌ను ఆసక్తికరంగానే ఆరంభించాడు దర్శకుడు. ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లేందుకు శివ తిరిగి ఊరిలోకి అడుగుపెట్టడం.. ఆ గ్రామ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టడానికి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అదే సమయంలో సత్య, వెన్నెల కిషోర్‌ పాత్రలు కథలోకి ప్రవేశించడంతో సినిమా ఒక్కసారిగా వినోదాత్మకంగా మారుతుంది. బెదురులంకకు బయటి ప్రపంచంతో సంబంధాలు కట్‌ చేసి.. నిజంగానే అక్కడ యుగాంతం మొదలైనట్లుగా ప్రజల్ని భ్రమింపజేసే ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఇక చావు భయం నుంచి బయటపడి.. మనసుకు నచ్చినట్లుగా బతకాలని ఊరి వాళ్లు నిర్ణయించుకున్నాక వాళ్లలోని అసలు వ్యక్తిత్వాల్ని బయట పెట్టే తీరు సరదాగా ఉంటుంది. (Bedurulanka 2012 review in telugu) ముఖ్యంగా ఆ ఎపిసోడ్‌లో రాజ్‌కుమార్‌ కసిరెడ్డి చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. మనిషి తన సహజ స్వభావానికి తగ్గట్లుగా ఏ ముసుగు లేకుండా నిజాయితీగా బతకడంలోనే అసలైన ఆనందం ఉందంటూ ఓ చిన్న సందేశంతో సినిమాని ముగించిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే: శివ పాత్రలో కార్తికేయ ఎంతో సహజంగా కనిపించాడు. ఆద్యంతం చాలా సెటిల్డ్‌గా నటించాడు. దర్శకుడు కూడా హీరోయిజం పేరుతో అనవసరమైన హడావుడి చేయకుండా శివ పాత్రను ఎంతో వాస్తవికంగా తెరపైకి తీసుకొచ్చాడు. నేహా శెట్టి తెరపై చాలా అందంగా కనిపించింది. కార్తికేయతో ఆమె కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. అయితే వీళ్లిద్దరి ప్రేమకథలో అంతగా ఫీల్‌ కనిపించలేదు. భూషణంగా అజయ్‌ ఘోష్, బ్రహ్మంగా శ్రీకాంత్‌ అయ్యంగార్, డేనియల్‌గా రామ్‌ ప్రసాద్‌ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. సత్యలోని కామెడీ కోణాన్ని పెద్దగా ఉపయోగించుకోలేదు. వెన్నెల కిషోర్, రాజ్‌కుమార్‌ పాత్రలు ద్వితీయార్ధంలో చక్కటి వినోదాన్ని పంచిచ్చాయి. దర్శకుడు తాను ఎంచుకున్న కథను నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ప్రథమార్ధంలో పెద్దగా కథ లేకపోవడం.. పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం కేటాయించడం.. స్లో నేరేషన్‌ కాస్త ఇబ్బంది పెట్టాయి. కథకు తగ్గట్లుగా మణిశర్మ భిన్నమైన రీతిలో సంగీతమందించే ప్రయత్నం చేశారు. అది సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. సాయిప్రకాష్, సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం బాగుంది. లంక గ్రామంలోని అందాలను తమ కెమెరాతో చక్కగా పట్టుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం..
  • + కార్తికేయ నటన
  • + యుగాంతం నేపథ్యంలో పండే వినోదం
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే కథనం
  • - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • చివరిగా: ఆరంభంలో కాస్త బెదరగొట్టినా.. ద్వితీయార్ధం కడుపుబ్బా నవ్విస్తుంది! (Bedurulanka 2012 review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని