Web Series 2023: మెప్పించిన వెబ్‌సిరీస్‌లు.. మీరేమైనా మిస్‌ అయ్యారా..?

ఈ ఏడాది విడుదలై, ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌లపై ప్రత్యేక కథనం. ఏ ఓటీటీలో ఏ సిరీస్‌ అలరించిందో చూసేయండి..

Updated : 26 Dec 2023 20:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: థియేటర్లలో సినిమాలు విడుదలైనట్లే.. ఓటీటీల్లో (ott) ప్రతివారం ఎన్నో వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలుగుతాయి. అలా ఈ ఏడాదిలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న పలు వెబ్‌సిరీస్‌లను (best web series in 2023), నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమాలను గుర్తుచేసుకుందాం. మీరేమైనా మిస్‌ అయ్యారేమో చూడండి..

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

దూత: హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది (Dhootha). ‘మనం’, ‘24’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జర్నలిజం ఇతివృత్తంగా హారర్ మిస్టరీ థ్రిల్లర్‌లో నేపథ్యంలో రూపొందింది. ప్రముఖ జర్నలిస్ట్‌ సాగర్‌ వర్మ అవధూరిని కొన్ని న్యూస్‌పేపర్‌ ఆర్టికల్స్‌ వెంటాడడం, ఆ జర్నలిస్ట్‌ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ముందే ఆ ఆర్టికల్స్‌లో కనిపించడం తదితర అంశాలు  ప్రేక్షకులకు థ్రిల్‌ పంచాయి.

ఫర్జి: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor)కు ఇది ఫస్ట్ సిరీస్ (Farzi). రాజ్- డీకే దర్శకత్వం వహించారు. షాహిద్ తోపాటు విజయ్ సేతుపతి, రాశీఖన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తాత నెలకొల్పిన పత్రికా కార్యాలయం మూతపడిపోవడంతో ఎలాగైనా దాన్ని ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్న ఓ యువకుడి కథ ఇది. బ్యాంకు అధికారులు, అధునాతన సాంకేతికత సైతం గుర్తుపట్టలేనంతగా దొంగనోట్లు ఎలా ముద్రించాడు? అనే కాన్సెప్ట్‌తో రూపొందింది.

వ్యూహం: తెలిసో, తెలియకో ఇతరులకు హాని చేస్తే ఎప్పటికైనా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సిందేనన్న అంశంతో రూపొందిందీ సిరీస్‌ (Vyooham). రోడ్డు ప్రమాదంతో దాన్ని వివరించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. పలు పాత్రలను లింక్‌ చేస్తూ.. ఆ ఘటనకు కారణం అవేనని చివరిలో రివీల్‌ చేయడం ఆసక్తికరం. సాయి సుశాంత్‌ రెడ్డి, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్‌, పావని గంగిరెడ్డి తదితరులు నటించారు. శశికాంత్‌ శ్రీవైష్ణవ్‌ పీసపాటి దర్శకుడు.

దహాద్‌: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి ఇంటి నుంచి పారిపోయిన యువతి కేసు విచారణలో భాగంగా ఎస్‌ఐ అంజలి భాటి ఎదుర్కొన్న సవాళ్లే ఈ సిరీస్‌ కథాంశం (Dahaad). ఆ ఎస్‌ఐ మరెవరో కాదు హీరోయిన్‌ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha). ఆమెకిది తొలి సిరీస్‌. అంతర్లీనంగా కుల వ్యవస్థ, ధనిక-పేద వర్గాల మధ్య తారతమ్యం వంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. దర్శకత్వం: కీమా కగ్టి, రుచికా ఒబెరాయ్‌.

పిప్పా: ఇషాన్‌ ఖట్టర్‌ (Ishaan Khattar), మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో రాజా కృష్ణమేనన్‌ తెరకెక్కించిన ఈ సినిమా (Pippa) నేరుగా ఓటీటీలో విడుదలై దేశభక్తి రగిలించింది. 1971లో జరిగిన ఇండో- పాకిస్థాన్‌ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి భారతదేశం కోసం పోరాడిన కెప్టెన్‌ బలరామ్‌ సింగ్‌ మెహతా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.


నెట్‌ఫ్లిక్స్‌..

రానా నాయుడు: విమర్శలు ఎదుర్కొన్నా ఈ సిరీస్‌ (Rana Naidu) రికార్డు సృష్టించడం విశేషం. ‘నెట్‌ఫ్లిక్స్‌’ విడుదల చేసిన.. ఈ వెబ్‌సిరీస్‌ ‘ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్‌ సొంతం చేసుకున్న సిరీస్‌ల జాబితా (400)’లో 336వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి ఈ సిరీస్‌కు మాత్రమే ఆ లిస్ట్‌లో చోటు దక్కింది. జైలు నుంచి వచ్చిన తండ్రి (వెంకటేశ్‌) వల్ల రానా నాయుడు (రానా) జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అసలు తండ్రీకొడుకుల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? అన్నది సిరీస్‌లో కీలకం. వెంకటేశ్‌ (Daggubati Venkatesh), రానా (Rana Daggubati) కలిసి నటించిన ఈ తొలి వెబ్‌సిరీస్‌కు సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

ది రైల్వేమెన్‌: 1984లో చోటుచేసుకున్న భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించే సిరీస్‌ ఇది (The Railway Men). శివ్‌ రావైల్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మాధవన్‌, కేకే మేనన్‌, దివ్యేందు శర్మ, మందిరా బేడీ తదితరలు నటించారు.

కాలాపాని: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని నీరు కలుషితమవడానికి కారణమేంటి? అది ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అనే అంశంతో సమీర్‌ సక్సేనా, అమిత్‌ సంయుక్తంగా రూపొందించిన ఈ సిరీస్‌ (Kaala Paani) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మోనా సింగ్‌, అశుతోష్‌ గోవారికర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

స్కూప్‌: పాత్రికేయురాలు జాగృతి పాఠక్‌ జీవితాధారంగా హన్సల్‌ మెహతా దర్శకత్వంలో రూపొందిన సిరీస్‌ ఇది. ఈ క్రైమ్‌ డ్రామాలో కరిష్మా తన్నా, ప్రొసెన్‌జిత్‌ ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. స్కూప్‌ (Scoop).. ప్రతిష్ఠాత్మక బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (బీఐఎఫ్‌ఎఫ్‌)లో ఉత్తమ ఆసియా టీవీ సిరీస్‌గా ఎంపికవడం విశేషం.


డిస్నీ+హాట్‌స్టార్‌..

ది ఫ్రీలాన్సర్‌: నటీనటులు: మోహిత్‌ రైనా, అనుపమ్‌ఖేర్‌, కష్మీరా పరదేశి, అయేషా రజా మిశ్రా, మంజరి ఫడ్నిస్‌, శత్‌ జేన్‌ డైసీ, సుశాంత్‌ సింగ్‌ తదితరులు; దర్శకత్వం: భవ్‌ ధులియా. సిరియా సరిహద్దుల్లో ఉన్న ఐసిస్‌కు చెరలో చిక్కుకున్న అలియా అనే మహిళను రక్షించేందుకు రంగంలోకి దిగిన అవినాష్‌ దామోదరన్‌ ఎలాంటి సాహసం చేశాడనేది ఈ సిరీస్‌ (The Freelancer) కథాంశం.

సేవ్‌ ది టైగర్స్‌: నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు; దర్శకత్వం: తేజ కాకుమాను. మంచి వినోదాన్ని పంచే ముగ్గురు భార్యా బాధితుల కథ (Save The Tigers) ఇది.

అతిథి: హీరో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) నటించిన తొలి వెబ్‌సిరీస్‌ (Athidhi) ఇది. అవంతిక మిశ్రా, అదితి గౌతమ్‌ (సియా గౌతమ్‌) కీలక పాత్రధారులు. దర్శకత్వం: భరత్‌ వై.జి. అరిషడ్వర్గాల (కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం) వల్ల మనిషి పతనమవుతాడనే విషయాన్ని ఈ సిరీస్‌తో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దెయ్యాలు ఉన్నాయా, లేవా? అనే ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చి థ్రిల్‌ పంచారు.


జీ 5..

అయలీ: ఊరి కట్టుబాట్లు దాటి ఓ అమ్మాయి ఎలా చదువుకుంది? ఈ క్రమంలో ఆమె పేరెంట్స్‌ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? తదితర అంశాలతో రూపొందిందీ (Ayali) సిరీస్‌. నటీనటులు: అభి నక్షత్ర, అనుమోల్‌, మదన్‌, సింగంపులి, టీఎస్‌ ధర్మరాజు, లింగా తదితరులు; దర్శకత్వం: ముత్తు కుమార్‌.


సోనీలివ్‌..

స్కామ్‌ 2003- ది తెల్గీ స్టోరీ: 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ (Abdul Karim Telgi) జీవితం ఆధారంగా చేసుకుని రూపొందిన సిరీస్‌ ఇది (Scam 2003). తారాగణం: గగన్‌ దేవ్‌ రియార్‌, సనా అమిన్‌ షేక్‌, ముకేశ్‌ తివారీ, భరత్‌ జాదవ్‌ తదితరులు; దర్శకత్వం: తుషార్‌ హీరానందని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని