Bhagavanth Kesari: శ్రీలీల నుంచి డ్యాన్సులు.. వాళ్ల మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చు: అనిల్‌ రావిపూడి

బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) గురువారం విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది.

Updated : 20 Oct 2023 18:31 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ (Balakrishna) - శ్రీలీల (Sreeleela) కీలకపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం విడుదలై సూపర్‌ సక్సెస్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పింది.

‘‘భగవంత్ కేసరి’.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటాది’ అని ప్రమోషన్స్‌ మొదలుపెట్టినప్పటి నుంచి చెబుతున్నాం. దాన్ని మీ అందరూ నిజం చేశారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ ఆరు సినిమాలు చేశా. ఫిల్మ్‌ మేకర్‌గా ఇది నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం భావోద్వేగాలు. తండ్రీకుమార్తెల ఎమోషన్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ సర్‌కు థ్యాంక్యూ చెప్పాలి. ఆయన అవకాశం ఇవ్వకపోయి ఉంటే నన్ను నేను ఇలా నిరూపించుకునేవాడిని కాదు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి వర్క్‌ చేశారు. ముఖ్యంగా, శ్రీలీల.. విజ్జిపాపగా అద్భుతంగా యాక్ట్ చేసింది. క్లైమాక్స్‌లో చూపించిన యాక్షన్‌ సీన్స్‌ కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత గొప్ప విజయాన్ని అందుకుంటుంది. త్వరలోనే సక్సెస్‌మీట్‌ కూడా ఏర్పాటు చేస్తాం’’ అని అనిల్‌ రావిపూడి అన్నారు.

అనంతరం శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను చూసే విధానం మారింది. ఇలాంటి అందమైన పాత్ర ఇచ్చిన అనిల్‌ రావిపూడికి థ్యాంక్యూ. బాలకృష్ణ సర్‌ నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఈ సినిమాలో ఉన్న సందేశానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని శ్రీలీల తెలిపారు.  

సినిమా పరంగా మీకు ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?

అనిల్‌ రావిపూడి: అన్నిచోట్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. బాలకృష్ణను తెరపై కొత్తగా చూపించిన విధానం అభిమానులకు ఎంతో నచ్చింది. బాలయ్య ఫ్యాన్స్‌ చాలామంది నాకు ఫోన్‌ చేశారు. సాధారణ ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని చక్కగా ఆదరిస్తున్నారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ సీన్‌ అంతటా వైరల్‌గా మారింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమా వచ్చినప్పుడు.. కుటుంబంతో కలిసి వెళ్లి చూడటం ఉత్తమం. ఆడపిల్లల కోసం ఇందులో ఒక అందమైన సందేశం కూడా ఉంది. ఫ్యామిలీ మొత్తం సినిమాకు వెళ్తే ఎన్నో జ్ఞాపకాలతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు.

శ్రీలీల గ్లామర్‌ ఈ సినిమాలో మిస్‌ అయ్యిందని కొంతమంది రివ్యూ రాశారు. వాటిపై మీ స్పందన ఏమిటి?

అనిల్‌ రావిపూడి: నేను రివ్యూలను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ అన్నింటి కంటే పెద్దది. జనాల నుంచి వచ్చే మాటే ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సినిమాలోని సున్నితమైన అంశాలను అర్థం చేసుకుని చాలా మంది పాజిటివ్‌గానే రివ్యూలు రాశారు. మీరు అన్నట్టు శ్రీలీల గ్లామర్‌, డ్యాన్సులు ఈ సినిమాలో మిస్‌ అయ్యాయని రివ్యూలు రాసిన వాళ్లు ఆమెకు అభిమానులు అయ్యి ఉంటారు. వాళ్లు ఆమె నుంచి డ్యాన్సులు చూడాలని కోరుకున్నారేమో. ఒక ఫోబియాతో బాధపడే అమ్మాయిని సివంగిలా మార్చాలనుకునే తండ్రి కథలోనూ డ్యాన్సులు చూడాలనుకున్నాడంటే వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌.. ఇలాంటి సున్నితమైన అంశాన్ని బాలకృష్ణతో చెప్పించాలని మీకు ఎలా అనిపించింది?

అనిల్‌ రావిపూడి: స్క్రిప్ట్‌ అనుకున్నప్పుడే.. ఇందులోని అద్భుతమైన సందేశాన్ని వీలైనంత వరకూ చెప్పాలనుకున్నాం. ఈ సీన్‌ రాసిన తర్వాత ఎవరితోనూ చర్చించలేదు. షూట్‌ చేసే వరకూ ఇలాంటి ఒక సీన్‌ ఉందని ఎవరికీ తెలియదు. బాలకృష్ణ సర్‌.. కెరీర్‌లోనే అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ చేశారు. ఇలాంటి ఒక గొప్ప సందేశాన్ని.. అలాంటి గొప్ప స్టార్‌ చెప్పడం వల్ల ఎక్కువమందికి రీచ్‌ అయ్యింది. ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి చిత్రాలను పిల్లలకు చూపిస్తే వాళ్లకు ఏదో ఒకరకంగా హెల్ప్‌ అవుతుంది.

భవిష్యత్తులో మీ నుంచి ఇలాంటి సినిమాలు ఆశించవచ్చా?

శ్రీలీల: అనిల్‌ రావిపూడి రాసిన స్క్రిప్ట్‌లా ఉంటే తప్పకుండా ఓకే చేస్తా. నేను నటన నేర్చుకుంది నాట్యం వల్ల. డ్యాన్స్‌ నాలో భాగం. ఒక నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఇలాంటి పాత్రల కోసమే నేను ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులోనూ ఇలాంటి రోల్స్‌లో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్‌ చేస్తా.

డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఇబ్బందిపడలేదా?

శ్రీలీల: హైదరాబాద్‌లో ఉండటం వల్ల తెలంగాణ యాసలో మాట్లాడటం అంత కష్టంగా అనిపించలేదు.

మీ సినిమాల్లో ఎక్కువగా తెలంగాణ యాసను ప్రోత్సహిస్తుంటారు? దానికి కారణం?

అనిల్‌ రావిపూడి: భాష అంటే నాకు ఎంతో ఇష్టం. ‘కందిరీగ’ చిత్రానికి రచయితగా పని చేసినప్పుడు అక్షర పాత్రకు సంభాషణలన్నీ తెలంగాణ యాసలోనే రాశా. అందుకోసం భాష మీద పట్టు ఉన్న వాళ్లతో కలిసి వర్క్‌ చేశా. అది ఇప్పుడు నాకు ఎంతో హెల్ప్‌ అయ్యింది.

ఈ చిత్రానికి సంబంధించిన మరో పాటను త్వరలోనే యాడ్‌ చేస్తారని విన్నాం?

అనిల్‌ రావిపూడి: ఇప్పుడు జనాలందరూ మా చిత్రాన్ని అత్యద్భుతంగా ఆదరిస్తున్నారు. కంటెంట్‌కు అడ్డుపడుతుందనే ఆ పాటను కట్‌ చేశాం. ఎక్కడ యాడ్‌ చేయాలో మాకే అర్థం కావడం లేదు. పాట కావాలని ఇప్పుడు ఎవరూ అడగలేదు. ఎందుకంటే, సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులు కూడా కలిసి ప్రయాణిస్తున్నారు. మేము కూడా చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక పాట యాడింగ్‌ గురించి అనౌన్స్‌ చేస్తాం.

శరత్‌ కుమార్‌ పాత్రను జైలర్‌గా చూపించారు. కానీ బ్రేకింగ్‌ న్యూస్‌లో మాత్రం సీఐ అన్నట్లు వేశారు?

అనిల్‌ రావిపూడి: మా టీమ్‌ తప్పిదం వల్లే అలా జరిగింది. అందుకు క్షమాపణలు చెబుతున్నా.

ఈ పాత్ర మీ కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుంది?

శ్రీలీల: ప్రేక్షకులు ఇప్పటికే డిసైడ్‌ చేసేశారు. ఇలాంటి పాత్ర చేసే అవకాశం మళ్లీ రాదు. ‘పెళ్లి సందD’ తర్వాత నేను విన్న కథ ఇది. కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర పోషించినందుకు ఆనందిస్తున్నా.

సూపర్‌హీరోయిన్‌ రోల్‌లో నటించే అవకాశం వస్తే ఓకే చేస్తారా?

శ్రీలీల: సరైన స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తా.

బ్యాడ్‌ టచ్‌ గురించి అమ్మకే చెప్పండి అన్నారు. అంటే నాన్నను వేరు చేయడం అనేది ఇబ్బందిగా అనిపించలేదా? 

అనిల్‌ రావిపూడి: ఆడపిల్ల తన తండ్రితో అన్నీ షేర్‌ చేసుకోలేదు కదా. కొన్ని విషయాలు షేర్‌ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అందుకే అమ్మకే చెప్పాలి అని డైలాగ్‌ పెట్టాం.

సిలిండర్స్‌ పేల్చడం అనే ఐడియా ఎలా వచ్చింది?

అనిల్‌ రావిపూడి: ‘కేజీయఫ్‌’లో చూపించిన విధంగా గన్స్‌ పేల్చడం ఈ మధ్య సినిమాల్లో కామన్‌ అయ్యింది. బాలయ్య బాబు కూడా పేలిస్తే చూడాలని అనుకున్నా. నేను తీసే టైమ్‌కి అందరూ కాల్చేశారు. అందరూ కాల్చేశాక ఆయనతో రిపీట్‌ చేయించడం బాగోదని అనిపించింది. చివరకు ఈ ఆలోచన వచ్చింది. ఇది ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని