Bhumi Pednekar: మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తాను: భూమి పెడ్నేకర్‌

భక్షక్‌ చిత్రంతో విజయాన్ని అందుకున్న నటి భూమి పెడ్నేకర్‌ తనకు మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటించాలని ఉందన్నారు.

Published : 04 Mar 2024 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాస్తవ సంఘటనల ఆధారంగా పులకిత్‌ తెరకెక్కించిన ‘భక్షక్‌’(Bhakshak) సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నటి భూమి పెడ్నేకర్‌(Bhumi Pednekar). ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈనేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భూమి మాట్లాడారు. మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేయాలనుందన్నారు. ‘‘సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాను. వాటిని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఏదోఒక పాత్రలో నటించే కంటే ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించాలనుంది. చేసే పాత్ర కథను నడిపించేలా ఉండాలి. భక్షక్‌లో నా పాత్రకు ఆ ప్రాధాన్యం ఉంది. ఈ సినిమా కారణంగా మానసికి స్థితి మెరుగుపడింది. ఇదో విభిన్నమైన అనుభవం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా చాలా బాగుందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇది నిజంగా థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ప్రేక్షకుల ఆదరణ, అభిమానం పొందుతున్న భక్షక్‌ విజయాన్ని ఆనందిస్తున్నా. నటీనటులకు ఇది ఎంతో అవసరం. మీ అందరికీ కృతజ్ఞతలు’’ అని భూమి వెల్లడించారు.

మరోవైపు ఆమె ఓటీటీ, థియేట్రికల్‌ రిలీజ్‌ గురించి మాట్లాడారు. ‘‘కాలం చాలా మారిపోయింది. థియేట్రికల్‌ రిలీజ్‌ అంటే చిత్రబృందంపై కొంత ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు బాక్సీఫీస్‌ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయినా ప్రశంసలు అందుకుంటాయి.  సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ నంబర్‌ గేమ్‌ నుంచి బయటపడాలి. నా దృష్టిలో థియేట్రికల్‌, ఓటీటీ రెండూ ముఖ్యమే. సినిమాలు ఎక్కడ విడుదలైనా కథ నచ్చితే ప్రేక్షకులు ఆదరిస్తారు. నటనతో ప్రభావం చూపించాలి కానీ నంబర్స్‌తో కాదు’’అని భూమి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని