Pallavi prashanth: ‘బిగ్‌బాస్‌’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్‌’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!

bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్‌ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్‌ లైఫ్‌ జర్నీ సాగిందిలా..!

Published : 18 Dec 2023 02:11 IST

Bigg boss 7 telugu winner: పల్లవి ప్రశాంత్‌.. ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతో ప్రేక్షకుల మనసు గెలిచి ‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’ విజేతగా నిలిచాడు. ఒక యూట్యూబర్‌గా, ఫోక్‌ సాంగ్స్‌ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన ప్రశాంత్‌ ప్రయాణం ఏమీ సాఫీగా సాగలేదు. జీవితంలో ఎదురైన ఒడిదొడుకులకు ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ, భూమిని చీల్చుకుని పైకి వచ్చే విత్తులా ఎదుగుతూ.. రైతుగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టి, సోషల్‌మీడియాలో ‘రైతు బిడ్డ’గా ట్రెండ్‌ సృష్టించి, ఇప్పుడు బిగ్‌బాస్‌-7 విజేతగా (bigg boss 7 telugu winner) నిలిచాడు.   

ఫోక్‌ సాంగ్స్‌తో వెలుగులోకి..

పల్లవి ప్రశాంత్‌ది (pallavi prashanth) సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్గూరు. తండ్రి సత్తయ్య రైతు. డిగ్రీ వరకూ చదువుకున్న ప్రశాంత్‌కు చిన్నప్పటి నుంచే కల్చరల్‌ యాక్టివిటీస్‌ అంటే మక్కువ. స్నేహితులతో కలిసి యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి ఫోక్‌ సాంగ్స్‌తో నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌ ఛానల్‌ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తడంతో అప్పటి వరకూ సంపాదించిన డబ్బులతో పాటు, ఛానల్‌నూ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెబితే ‘బిడ్డా నువ్వు అలాంటి పని చేస్తే మేమూ బతకం. మళ్లీ నువ్వు చేయాలనుకున్నది చెయ్‌. నేను నీకు అండగా ఉంటా’ అని చెప్పడంతో ప్రశాంత్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేయడం మొదలు పెట్టాడు.

రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వీడియోలుగా తీసి, సోషల్‌మీడియాలో పంచుకోవడంతో నెమ్మదిగా ప్రశాంత్‌కు అభిమానులు పెరిగారు. ‘అన్నా.. రైతు బిడ్డను..’ ‘అన్నా మళ్లొచ్చినా.. ’ అంటూ పల్లవి ప్రశాంత్‌ తనదైన శైలిలో చెప్పే డైలాగ్‌లు, పలికించే హావభావాల వీడియోలు వైరల్‌ అవడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ‘బిగ్‌బాస్‌’ షోపై ఆసక్తి పెరగడంతో ‘ఎప్పటికైనా బిగ్‌బాస్‌ షోకు వెళ్తా’ అంటూ మరికొన్ని వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ‘బిగ్‌బాస్‌’ కొత్త సీజన్‌ మొదలు పెడుతున్నారని తెలియగానే అన్నపూర్ణ స్టూడియోస్‌ చుట్టూ తిరిగేవాడు. తండ్రి ఇచ్చిన డబ్బులు అయిపోతే, పస్తులుండి అవకాశాల కోసం తిరిగాడు. అలా గత రెండు సీజన్‌లకు ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. మరోవైపు ఊరికి వచ్చి, ఇదే విషయాన్ని స్నేహితులతో పంచుకుంటే ‘నువ్వు బిగ్‌బాస్‌ వెళ్లడమా.. అది అయ్యే పని కాదులే’ అంటూ ఎగతాళి చేసేవారట. అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా వీడియోలు చేసి, ‘ఇవి నాగార్జునగారి వద్దకు వెళ్లే వరకూ షేర్‌ చేయండి’ అంటూ నెటిజన్లను కోరడంతో అవి కాస్త ట్రెండింగ్‌ అయ్యాయి. అంతేకాకుండా, యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న పలువురి దగ్గరకు వెళ్లి తనని సపోర్ట్‌ చేయమని కోరిన రోజులూ ఉన్నాయి. ఎట్టకేలకు సీజన్‌-7 కోసం బిగ్‌బాస్‌ టీమ్‌ ప్రశాంత్‌ను (pallavi prashanth) సంప్రదించడంతో తాను అనుకున్న కల నెరవేరిందని తెగ సంబరపడిపోయాడు. తండ్రి వద్ద రూ.500 తీసుకుని హైదరాబాద్‌ వచ్చిన ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ షో కోసం ఆడిషన్స్‌ ఇచ్చి యూట్యూబర్‌గా ‘రైతు బిడ్డ’గా అడుగు పెట్టాడు.

‘పల్లవి’ పేరెలా వచ్చిందంటే..?

‘పల్లవి ప్రశాంత్‌’గా ఫేమస్‌ అయిన ప్రశాంత్‌ పేరులో ‘పల్లవి’ వెనుక ఒక చిన్న కథ ఉంది. తన తండ్రి సత్తయ్య మహాబలిపురంలోని పల్లవులు కట్టించిన గుడికి వెళ్లినప్పుడు తనకు కొడుకు పుడితే, ఆ పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నారట. అన్నట్లుగాను అబ్బాయి పుట్టడంతో మొదట పల్లవరాజు అని పేరు పెట్టారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌గా మార్చారు. 

మిర్చి మొక్క ఇచ్చిన నాగార్జున

‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’లోకి (bigg boss season 7 telugu) అడుగు పెట్టే ముందు వేదికపై తన పొలంలోని మట్టి, తాను పండించిన బియ్యాన్ని నాగార్జునకు గిఫ్ట్‌గా ఇచ్చాడు పల్లవి ప్రశాంత్‌. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక మిరప మొక్కను అతనికిచ్చి, ‘దీన్ని బాగా చూసుకో. కాయలు కాస్తే, అందుకు తగినట్లు నీకు స్పెషల్‌ గిఫ్ట్‌లు ఇస్తా’ అని చెప్పారు. అయితే, కొన్ని రోజులకు ఆ మొక్క ఎండిపోవడంతో నాగార్జున చివాట్లు పెట్టి, మరో మొక్కను పంపారు. దాన్ని సీజన్‌ చివరి వరకూ జాగ్రత్తగా పెంచాడు. ఈ హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఆ మొక్క ఉంచిన ప్రదేశమే తన బెస్ట్‌ ప్లేస్‌ అంటూ ప్రశాంత్‌ చెప్పడం గమనార్హం.

అప్పుడే చెప్పిన శివాజీ

బిగ్‌బాస్‌ సీజన్‌-7లో పల్లవి ప్రశాంత్‌కు అత్యంత దగ్గరైన వ్యక్తులు నటుడు శివాజీ (Shivaji), మోడల్‌ యావర్‌ (Prince Yawar). వీరి ముగ్గురికి SPY(స్పై) (శివాజీ, ప్రశాంత్‌, యావర్‌) అనే పేరు కూడా వచ్చింది. ఈ ముగ్గురూ ఫైనలిస్ట్‌లు కూడా అయ్యారు. పల్లవి ప్రశాంత్‌ హౌస్‌లోకి అడుగు పెట్టి వెంటనే ఇంటి సభ్యులను పరిచయం చేసుకునే క్రమంలో టేస్టీ తేజ ఎదురు వచ్చి, ‘ఇదేంటి నీకు మొక్క ఇచ్చారు’ అని అడగ్గా, అక్కడే ఉన్న శివాజీ ‘వెళ్లేటప్పపుడు కప్పుతో పాటు మొక్కనూ పట్టుకెళ్తాడులే’ అని అన్నాడు. అప్పుడు శివాజీ అన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయనే అనుకోవాలి.

నామినేషన్స్‌లో ఫైరు.. ఆటలో జోరు..

ఈ సీజన్‌లో ప్రతివారం జరిగే నామినేషన్స్‌లో పల్లవి ప్రశాంత్‌ను ఎవరైనా నామినేట్‌ చేస్తే, ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యేవాడు. అంతేకాదు, ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ ఫోజులో నిలబడి తనని నామినేట్‌ చేసిన వాళ్లకు కౌంటర్‌ ఇచ్చేవాడు. నామినేషన్స్‌లో ఎంత ఫైర్‌గా ఉండేవాడో, ఆటలోనూ జోరు చూపించేవాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన ప్రతి టాస్క్‌ను చకచకా పూర్తి చేసేవాడు. అలా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను గెలుచుకున్నాడు. ఇక హౌస్‌లోకి వెళ్లిన తొలినాళ్లలో రతికా రోజ్‌కు దగ్గరైనట్లు కనిపించిన ప్రశాంత్‌.. ఆటలో వెనుకబడ్డాడు. చిన్న వివాదం కారణంగా వారిద్దరి మధ్య గొడవ జరగడంతో అప్పటి నుంచి పూర్తిగా ఆటపైనే దృష్టి సారించి, ప్రతి టాస్క్‌లోనూ గెలిచేందుకు 100శాతం ప్రయత్నించాడు. తన ఆటతీరుతో ఈ సీజన్‌కు మొదటి కెప్టెన్‌గానూ నిలిచాడు. అంతేకాదు, తప్పు ఒప్పుకొని యావర్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వదులుకోగా, తన సామర్థ్యంతో ప్రశాంత్‌ (pallavi prashanth) దాన్ని ఒడిసిపట్టాడు. అలా కామన్‌ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్‌.. సీజన్‌-7 విజేతగా అవతరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని