Bimbisara: ‘బింబిసార’ ఇంకాస్త ఆలస్యం.. ఓటీటీలో వచ్చేస్తున్న శ్రీసింహా మూవీ

కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రలో నటించిన ‘బింబిసార’ ఓటీటీలో ఆలస్యంగా రానుండగా, ‘దొంగలున్నారు జాగ్రత్త’ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది!

Published : 06 Oct 2022 01:52 IST

హైదరాబాద్‌: కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన టైమ్‌ ట్రావెల్‌ మూవీ ‘బింబిసార’ ఆగస్టులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. క్రూరమైన బింబిసార రాజు పాత్రలో కల్యాణ్‌రామ్‌ ఒదిగిపోయారు. రాజసం ఉట్టిపడేలా ఆయన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూసిన అభిమానులకు ఇంకొన్ని రోజులు వేచి చూడకతప్పదు. దసరా కానుకగా అక్టోబరు 7న ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని అందరూ భావించారు. తాజాగా ‘బింబిసార’ను దీపావళి కానుకగా అక్టోబరు 21న జీ5 అందుబాటులోకి తీసుకురానుంది. దసరా సెలవుల్లో సినిమాను ఓటీటీలో చూసి ఆస్వాదిద్దామనుకున్న నెటిజన్లు నిరాశపడ్డారు.

ఓటీటీలో దొంగలున్నారు జాగ్రత్త

తెలుగు తెరకి ఓ కొత్త జోనర్‌ని పరిచయం చేసిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. శ్రీసింహా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 23న థియేటర్‌లలో విడుదలైంది. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబరు 7వ తేదీ నుంచి తెలుగుతో పాటు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి కానుంది.

కథేంటంటే: రాజు (శ్రీసింహా కోడూరి) ఓ దొంగ.  కార్లలో ఉండే విలువైన వస్తువుల్ని  దొంగతనం చేస్తుంటాడు. అలా ఒకరోజు దొంగతనం కోసం ఓ కారుని ఎంచుకుంటాడు. తీరా అందులోకి ఎక్కాక లాక్‌ అయిపోతుంది. బయటికి రాకుండా  అందులోనే ఇరుక్కుపోతాడు. అంతలో ఓ వాయిస్‌ అతనికి వినిపిస్తుంది. రాజు అలా కార్‌లో లాక్‌ అయిపోవడం వెనక ఓ వైద్యుడు ఉన్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా  వైద్యుడు? రాజునే ఎందుకు టార్గెట్‌ చేశాడు? కారులోనుంచి అతను బయటపడ్డాడా లేదా? అనేది మిగతాకథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని