Suriya: ‘కర్ణ’లో సూర్య అంటూ వార్తలు.. బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ మెహ్రా ఏమన్నారంటే?

‘కర్ణ’ అనే సినిమాలో కోలీవుడ్‌ హీరో సూర్య నటిస్తున్నారనే ప్రచారంపై బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

Published : 03 Aug 2023 23:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రంగ్‌ దే బసంతి’ (Rang De Basanti), ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ (Bhaag Milkha Bhaag) వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా (Rakeysh Omprakash Mehra). ఆయన తదుపరి చిత్రం ‘కర్ణ’ (Karna) అని, అందులో సూర్య (Suriya) హీరోగా నటించనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. సూర్య తన కొత్త సినిమా ‘కంగువ’ (Kanguva) టైటిల్‌ గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేయగా రాకేశ్‌ మెహ్రా రిప్లై ఇచ్చారు. అదిరిపోయిందనే అర్థం వచ్చేలా ఎమోజీలు జోడించారు. దాంతో, ఆ ఊహాగానాలకు బలం చేకూరినట్టైంది. ఈ విషయమై దర్శకుడు తాజాగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పారు. ‘‘మీడియా అంటే నాకు ఇష్టం. నేను ఏదైనా పనిచేయడానికన్నా ముందే వారికి తెలిసిపోతుంది (నవ్వుతూ). ప్రస్తుతం నేను మూడు కథలను సిద్ధం చేస్తున్నా. వాటిల్లో ‘కర్ణ’ ఒకటి. వీటిల్లో ఏది ముందు ప్రారంభమవుతుందో చూద్దాం’’ అని అన్నారు. స్వామి వివేకానంద, మదర్‌ థెరెసా జీవితాలను తెరపైకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు మెహ్రా కొన్నాళ్ల క్రితం చెప్పారు. వాటిపై ప్రశ్న ఎదురవగా.. ‘‘ఈ రెండు బయోపిక్స్‌ తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎప్పుడు ధైర్యం వస్తుందో అప్పుడు వాటిని తెరకెక్కిస్తా. వివేకానంద, మదర్‌ థెరెసా ఇద్దరూ ఇతరుల కోసమే జీవించారు’’ అని గుర్తుచేశారు.

‘సైమా అవార్డ్స్‌’.. ఉత్తమ దర్శకుడు నామినేషన్లు ఇవే

మరోవైపు, విక్రమ్‌ (Vikram) హీరోగా దాదాపు మూడేళ్ల క్రితమే దర్శకుడు ఆర్‌. ఎస్‌. విమల్‌ ‘మహావీర్‌ కర్ణ’ (Mahavir Karna) సినిమాని ప్రకటించారు. కర్ణుడి గురించి ఈతరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో అధునాతన టెక్నాలజీని వినియోగించి, సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. కొంత భాగం షూటింగ్‌ కూడా చేశారు. ఏమైందో ఏమోగానీ ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. సూర్య ‘కంగువ’ విషయానికొస్తే.. శివ దర్శకత్వంలో త్రీడీలో పదికిపైగా భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. యాక్షన్‌తో కూడిన ఈ పీరియాడిక్‌ డ్రామా చిత్రంలో సూర్య ఓ యోధుడిగా నటిస్తున్నారు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమా తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని