Shah Rukh Khan: ముంబయి ఎయిర్‌పోర్టులో షారుక్‌ను అడ్డుకున్న అధికారులు..!

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి తిరిగొచ్చిన షారుక్‌ ఖాన్‌ వద్ద ఖరీదైన వాచీలను కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో ఎయిర్‌పోర్టులో నటుడిని అడ్డుకుని విచారించారు.

Published : 12 Nov 2022 17:40 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ ముంబయి విమానాశ్రయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. షార్జా నుంచి తిరిగొచ్చిన ఆయనను ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. విదేశాల నుంచి ఖరీదైన చేతి గడియారాలు తీసుకురావడంతో అధికారులు అతడిని అడ్డగించినట్లు తెలుస్తోంది.  షారుక్‌ రూ.6.83లక్షల కస్టమ్స్‌ సుంకం చెల్లించినట్లు అధికారిక వర్గాల సమాచారం.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జాలో జరిగిన అంతర్జాతీయ బుక్‌ ఫెయిర్‌ 2022లో షారుక్‌ ఖాన్‌ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని షారుక్‌, అతడి మేనేజర్‌ పూజా డడ్లానీ, బాడీగార్డులు, ఇతర సిబ్బంది ప్రైవేటు విమానంలో శుక్రవారం రాత్రి ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే విమానాశ్రయంలో తనిఖీ చేస్తుండగా.. వీరి లగేజీల్లో రూ.18లక్షలు విలువ చేసే ఖరీదైన వాచీలను అధికారులు గుర్తించారు. షారుక్‌ బ్యాగులో అంతర్జాతీయ బ్రాండ్ల వాచీలతో పాటు, రోలెక్స్‌ చేతి గడియారాల ఖాళీ బాక్సులు ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో షారుక్‌, అతని సిబ్బందిని కస్టమ్స్‌ అధికారులు అడ్డుకుని విచారించారు. ఈ వాచీల గురించి దాదాపు గంటపాటు విచారించిన తర్వాత షారుక్‌, అతడి మేనేజర్‌ను ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయేందుకు అధికారులు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఇక, నటుడి బాడీగార్డు, ఇతర సిబ్బందిని రాత్రంతా ప్రశ్నించి శనివారం తెల్లవారుజామున వదిలిపెట్టినట్లు సమాచారం. వాచీల ధరలను లెక్కించిన తర్వాత షారుక్‌ బాడీగార్డు.. నటుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ.6.83లక్షల కస్టమ్స్‌ సుంకం చెల్లించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని