oscar 2023: ఆస్కార్‌ వేడుకలో విల్‌స్మిత్‌ చెంపదెబ్బ.. ‘ఇప్పటికీ నన్ను బాధిస్తోంది: క్రిస్‌ రాక్‌

oscar 2023: గతేడాది జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా క్రిస్‌రాక్‌పై నటుడు విల్‌స్మిత్‌ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా క్రిస్‌రాక్‌ మాట్లాడాడు.

Updated : 12 Mar 2023 18:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో అత్యంత వివాదాస్పద ఘటన విల్‌స్మిత్‌ చెంపదెబ్బ. గతేడాది జరిగిన ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాత క్రిస్‌రాక్‌ వ్యవహారశైలికి మండిపడ్డ విల్‌స్మిత్‌ వేదికపైనే ఆయనపై చేయిచేసుకున్నారు. అవార్డుల వేడుకలో ఉన్నవారితో పాటు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కోట్లాది మంది ఒక్కసారిగా నివ్వెర పోయారు. ఆ ఘటన ఇప్పటికీ తనని బాధిస్తోందని తాజాగా క్రిస్‌ రాక్‌ చెప్పుకొచ్చాడు. ‘‘ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏడాది కిందట నేను చెంపదెబ్బ తిన్నాను. అందరి ముందు అతను నన్ను కొట్టాడు. ‘ఆ సంఘటన మిమ్మల్ని బాధించిందా’ అని కొంతమంది నన్ను అడిగారు. ‘ఇప్పటికీ నేను బాధపడుతున్నా. ఆ దెబ్బ నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అయితే నేను బాధితుడిని కాదు. అందుకు నేనేమీ కన్నీళ్లు పెట్టుకోను’’  అని క్రిస్‌ రాక్‌ చెప్పుకొచ్చాడు.

ఇంతకీ గతేడాది ఏం జరిగిందంటే?

94వ ఆస్కార్‌ ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ (Chris Rock) హాస్యాన్ని పండించే క్రమంలో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌ (Will Smith) భార్య జాడా పింకెంట్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. అలోపేసియా అనే అనారోగ్యం జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్‌ రాక్‌ ఆమెను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో ‘డెమి మూర్‌’ పోషించిన పాత్రతో పోల్చారు. దీంతో సహించలేకపోయిన విల్‌ స్మిత్‌ నేరుగా వేదికపై వెళ్లి క్రిస్‌ చెంప పగలగొట్టారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత విల్‌ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. అనంతరం, ఘటనపై స్పందించిన స్మిత్‌ అకాడమీ, సహచరులకు క్షమాపణలు తెలిపారు. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అకాడమీ నిర్వాహకులు విల్ స్మిత్‌ని ఆస్కార్ వేడుకలకు హాజరుకాకుండా పదేళ్లపాటు నిషేధం విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని