CM Jagan: సినీ పరిశ్రమ కోసం మంచి పాలసీ తెస్తాం: సినీ ప్రముఖులతో సీఎం జగన్‌

సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

Updated : 10 Feb 2022 17:25 IST

అమరావతి: సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఆ పాలసీ ద్వారా పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత కొద్దికాలంగా కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే అందరి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ తరచూ సమావేశమై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తనతో పంచుకున్నట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం జగన్‌ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు.. ప్రభుత్వ ఆలోచనలను సీఎం వారికి వివరించారు. 

భారీ బడ్జెట్‌ సినిమాలకు వారంపాటు ప్రత్యేక ధరలు..

‘‘సినీ పరిశ్రమలో ఉన్న కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడేందుకు ఓ మంచి వ్యవస్థను క్రియేట్‌ చేసే ఉద్దేశంతో అడుగులు వేశాం. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేకుంటే ఎక్కువ, తక్కువ వసూళ్లు జరుగుతాయి. నేను, చిరంజీవి గారు కలిసి కూర్చొని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో, హీరోయిన్‌, దర్శకుడు పారితోషికం వంటి అంశాలలను పరిగణనలోకి తీసుకోకుండానే నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలి. అలా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటి సినిమాలకు వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్‌ చేయాలని చెప్పాం. రాష్ట్రంలో షూటింగులు ప్రమోట్‌ చేసేందుకు కొంత పర్సంటేజ్‌ కేటాయించాం. కనీసం ఎంతశాతం షూటింగు ఏపీలో చేయాలన్నదానిపై మంత్రి పేర్ని నాని ఇప్పటికే దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారు. వారందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కనీసం 20 శాతం పెడతామని నాతో చెప్పారు.  

ఓటీటీలతో పోటీ పడాల్సిన పరిస్థితి.. సమతుల్యత అవసరం

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం ప్రభుత్వానికి, నిర్మాతలకు మంచిదనే కోణంలో చూశాం. ఓటీటీలతో పోటీపడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించాం. ఏడాదికి రూ.వెయ్యితో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ వస్తోంది. అది నెలకు సగటున రూ.80 పడుతోంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. చిరంజీవిగారితో కూడా ఇదే విషయంపై చర్చించాం. కనీస ఆదాయం కూడా రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అన్న ఆలోచనతోనే రీజనబుల్‌ రేట్లు దిశగా వెళ్లాం. సినిమా చూసే ప్రేక్షకులకు భారం కాకుండా.. ఆ రేట్లు సినీ పరిశ్రమను పెంపొందించేలా ఉండేందుకు రేట్లు సవరించాం. ఐదో షో కూడా తీసుకురావాలని అడిగారు.. ఆ పాయింట్‌ను అర్థం చేసుకున్నాం. అయితే అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకూ అవే రేట్లు వర్తిస్తాయి. వారికి కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లను కూడా మంచి ధరలతో ట్రీట్‌ చేస్తాం.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రా కంట్రిబ్యూషన్‌ ఎక్కువ..

తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ఎక్కువగా ఆదాయం కంట్రిబ్యూట్‌ చేస్తోంది. తెలంగాణ 35-40 శాతం అయితే. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఏపీలో జనాభా, ప్రేక్షకులు, థియేటర్లు ఎక్కువ. ఆదాయపరంగానూ ఏపీ నుంచి ఎక్కువగా వస్తుంది. వాతావరణం కూడా బాగుంటుంది.

సినీ పరిశ్రమ విశాఖ రావాలి..

సినీ పరిశ్రమ నెమ్మదిగా విశాఖపట్నం రావాలి. అలా వచ్చేందుకు దృష్టి పెట్టండి.. అందరికీ అక్కడ స్థలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే వాళ్లకు విశాఖలో స్థలాలు ఇస్తాం. అక్కడ జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దాం. విశాఖ బిగ్గెస్ట్‌ సిటీ.. కాస్త పుష్‌ చేయగలిగే అవకాశాలున్న నగరం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌తో విశాఖ పోటీపడగలదు. మనం ఓన్‌ చేసుకోవాలి. మనందరం అక్కడికి వెళ్లాలి. ఇవాళ కాకపోయినా పదేళ్లకో.. పదిహేనేళ్లకో మహానగరాలతో పోటీ పడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే సినీ పరిశ్రమ ముందుకు రావాలి. అందరూ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఇళ్ల స్థలాలతో పాటు స్టూడియోలకు కూడా స్థలాలు ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని జగన్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు