MAA Election: మీకు మీరే.. ‘మా’కు మేమే!

తెలుగు నటీనటుల సంఘం ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో నలుగురు నటీనటులు పోటీ చేస్తుండగా... తాజాగా సీనియర్ నటులు సీవీఎల్ కూడా అధ్యక్ష పోటీకి సిద్ధమయ్యారు.

Published : 28 Jun 2021 17:06 IST

తెలుగు నటీనటుల సంఘం ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో నలుగురు నటీనటులు పోటీ చేస్తుండగా... తాజాగా సీనియర్ నటులు సీవీఎల్ కూడా అధ్యక్ష పోటీకి సిద్ధమయ్యారు. ఈ పోటీలో నిలబడటంపై అసోసియేషన్ సభ్యులకు మంచు విష్ణు బహిరంగ లేఖ రాశారు. సినీ పరిశ్రమ కష్టాలు తెలిసినవాడిగా సేవ చేసేందుకు కర్తవ్యంగా భావిస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. ప్యానల్స్‌ను రద్దు చేసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని పలువురు మాజీసభ్యులు సినీ పెద్దలను కోరుతున్నారు.

మరోసారి సాధారణ ఎన్నికలను తలపించేలా తెలుగు నటీనటుల సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌లో జరిగే మా ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అభ్యర్థుల హడావుడి మొదలైంది. ఈ రేసులో ఇప్పటికే నలుగురు పోటీ చేస్తుండగా మరో సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో మా ఎన్నికల బరిలో అధ్యక్ష పోటీకి దిగిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఎన్నికల సమయానికి మరికొంత మంది నటీనటులు కూడా స్వతంత్రులుగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు... మా సభ్యులకు బహిరంగ లేఖ రాశారు. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పోటీకి నామినేషన్ వేయనున్నట్లు  ప్రకటించారు. మా ఇంటిని మనమే చక్కదిద్దుకుందామంటూ పిలుపునిచ్చారు. గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసిన తండ్రి మోహన్ బాబు మార్గదర్శకాలను పాటిస్తూ ఈ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు విష్ణు స్పష్టం చేశారు. తమ కుటుంబం సినీ పరిశ్రమకు ఎంతో రుణపడి ఉందని పేర్కొన్న విష్ణు... ఆ రుణాన్ని తీర్చుకోడానికి సేవ చేయడమే కర్తవ్యంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు సినిమాతో పెరిగిన తాను... పరిశ్రమలోని కష్టాలు, సుఖాలు తెలుసని, అలాగే అసోసియేషన్ కుటుంబసభ్యుల భావాలు, బాధలు తెలుసని విష్ణు తన లేఖలో వివరించారు. మా అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సమయంలోనే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే వ్యయంలో 25 శాతం అందిస్తానని గతంలోనే హామీ ఇచ్చానని పేర్కొన్న విష్ణు... పలు కారణాల వల్ల ఆ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. పెద్దల అనుభవాలు, యువ కథానాయకుల ఆలోచనలతో నడవాలనేదే తన ప్రయత్నంగా భావిస్తున్నట్లు విష్ణు తన లేఖలో స్పష్టం చేశారు.

పారదర్శకత లేని ఎన్నికల వల్ల తెలుగు నటీనటులకు అన్యాయం జరుగుతోందని సీనియర్ నటుడు సీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదంతో ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అసోసియేషన్ సభ్యులు ఎన్నుకునే కార్యవర్గంలో సగం మంది తెలంగాణ కళాకారులకు చోటు కల్పించాలని సీవీఎల్ నర్సింహారావు డిమాండ్ చేస్తున్నారు.

‘‘రాబోయే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నేనూ పోటీ చేస్తున్నా. నా ప్యానెల్‌ తెలంగాణ వాదం.. తెలంగాణ కళాకారుల ఇబ్బందులు.. చిన్న, పేద, మధ్య తరగతి కళాకారులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉన్నారు. వాళ్లకు జరుగుతున్న అన్యాయంపై కూడా పోరాడతాం. గతంలో పరభాషా నటుల గురించి ఒక నియమం తీసుకొచ్చారు. హీరోయిన్‌ కాకుండా గరిష్ఠంగా ఇద్దరు పరభాషా నటులను తీసుకోవాలని అందులో ఉంది. ఇప్పుడు ఆ నియమాన్ని తుంగలో తొక్కి జరుగుతున్న కార్యక్రమాల కారణంగా చాలా మంది తెలుగు కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ‘మా’కు సంబంధించినంత వరకూ రెండు విభాగాలు చేయమని కోరుతున్నా’’ అని సీవీఎల్‌ నర్సింహారావు చెప్పుకొచ్చారు.

అయితే ఈ ఎన్నికలపై పలువురు మాజీ కార్యవర్గ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఆరేళ్లుగా మా ఎన్నికల విధానం సరిగా జరగడం లేదని నటుడు కాదంబరి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పెద్దలు జోక్యం చేసుకొని ప్రస్తుతం ప్రకటించిన ప్యానల్స్ ను రద్దు చేసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరారు.

‘‘ఒక వ్యవస్థలో నాయకుడిగా వచ్చినప్పుడు మీ ఆలోచనలు దాన్ని బాగా నడపడానికి పెట్టండి. కానీ, వెలుతురులో నుంచి సూర్య కిరణాల్లా వస్తున్న మనుషుల్ని, వాళ్ల ఆసక్తులను చంపటానికి ప్రయత్నించవద్దని పెద్దలను ప్రాధేయపడుతున్నా. కమిటీలోని పెద్దలందరూ కూర్చొని దాన్ని ముందుకు నడపండి. ఏకగ్రీవం చేయించండి’’ అని సినీ నటుడు కాదంబరి కిరణ్‌ కోరుతున్నారు.

ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించి ఎన్నికల కార్యచరణ సిద్ధం చేసుకుంటుండగా... మంచు విష్ణు యువ కథానాయకులతో కలిసి రంగంలోకి దిగేందుకు ప్యానల్ ను సిద్ధం చేస్తున్నారు. మహిళకు అవకాశం కల్పించాలనే డిమాండ్ తో జీవితరాజశేఖర్ ఒంటరిగానే అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హేమ కూడా జీవిత బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ప్రసక్తే లేదని పోటీలో ఉన్న అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మూడు నెలల ముందే సినీపరిశ్రమలో మా ఎన్నికలపై వివాదాలు ముదురుతున్నా సినీపెద్దలు ఎందుకు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని