Trivikram: మనిషి జీవనశైలిని మార్చగలిగేది చదువు ఒక్కటే: త్రివిక్రమ్‌

‘‘గురువు గురించి సినిమా తీసిన దర్శకుడు వెంకీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అని త్రివిక్రమ్‌ అన్నారు. ‘సార్‌’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

Updated : 15 Feb 2023 23:47 IST

హైదరాబాద్‌: ధనుష్‌ (Dhanush) హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’ (Sir). సంయుక్త కథానాయిక. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘గురువు గురించి సినిమా తీసిన దర్శకుడు వెంకీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కరోనా సమయంలో ఈ సినిమా కథ నాకు ‘జూమ్‌’ ద్వారా చెప్పాడు. ధనుష్‌కు ఎలాగైనా ఈ స్టోరీ వినిపిస్తానన్నాడు. ఎక్కువగా కలలు కంటున్నాడేమోనని భావించా. అతణ్ని నిరుత్సాహపరచడం ఎందుకని ఓకే అని చెప్పా. ధనుష్‌ నటించి, సినినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. నా భార్య నిర్మాత కాబట్టి స్క్రిప్టు చదివింది. నిన్న సినిమా చూసింది. చదివిన స్క్రిప్టు కంటే చూసిన సినిమా బాగుందని నాకు చెప్పింది. ఆ విషయాన్ని వెంకీకి చెబితే పెద్ద కాంప్లిమెంట్‌ అన్నాడు. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ఆత్మ ఉంటుంది. విద్య, వైద్యంలాంటి మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలనేదే ఈ సినిమా కాన్సెప్ట్‌. మనిషి జీవనశైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. పేదవాడి కొడుకుని ధనవంతుణ్ని చేయగలదు. గుమస్తా కొడుకుని కలెక్టర్‌ చేయగలిగింది చదువు. సాధారణ కుటుంబంలో పుట్టిన సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్లలాంటి వారిని ప్రపంచవ్యాప్తంగా గుర్తుపడుతున్నారంటే అది చదువు వల్లే. డబ్బు లేదనే కారణంగా కొందరికి చదువును దూరం చేయడం ఎంత వరకు కరెక్ట్‌?.. ఈ ప్రశ్ననే వెంకీ ఈ సినిమా ద్వారా అడిగే ప్రయత్నం చేశాడు. అందుకే నాకు ఈ చిత్రం బాగా నచ్చింది’’ అని అన్నాడు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు