Ori Devuda Trailer: ‘ఓరి దేవుడా’తో... ఆ కోరిక నెరవేరింది!

‘‘మా సంస్థలో ప్రతి సినిమానీ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో చేసుకుంటూ వచ్చాం. అయితే 16 - 25 వయసు మధ్యనున్న యువతరం కోసం ప్రత్యేకంగా సినిమా చేయలేదే అనుకునేవాణ్ని.

Updated : 08 Oct 2022 06:58 IST

‘‘మా సంస్థలో ప్రతి సినిమానీ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో చేసుకుంటూ వచ్చాం. అయితే 16 - 25 వయసు మధ్యనున్న యువతరం కోసం ప్రత్యేకంగా సినిమా చేయలేదే అనుకునేవాణ్ని. ‘ఓరి దేవుడా’తో ఆ కోరిక నెరవేరింది’’ అన్నారు నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి. ఆయన సంస్థ పీవీపీ సినిమా పతాకంపై, విష్వక్‌సేన్‌ (Vishwaksen) కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఓరి దేవుడా’ (Ori Devuda). తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్‌, ఆశా భట్‌ నాయికలు. అశ్వత్‌ మారిముత్తు దర్శకుడు. పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మాతలు. ఈ నెల 21న ఈ చిత్రం రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తెలుగులో సినిమా చేయాలనేది నా కల. ఈ అవకాశం ఇచ్చి ఆ కోరికని నెరవేర్చిన నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి. హీరో విష్వక్‌ నాకు స్నేహితుడు. ఆయనతోపాటు, ఇతర నటులు, సాంకేతిక బృందం చక్కటి ప్రతిభ కనబరిచారు. ఇందులో అనిరుధ్‌ ఓ పాట పాడారు. ఈ సినిమా తప్పకుండా  వినోదం పంచుతుంది’’ అన్నారు. నిర్మాత  ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ‘‘ఊపిరి, ఎవరు, క్షణం, ఘాజీ, మహర్షి, బలుపు... ఇలా మా సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు  యువతరానికి కనెక్ట్‌ అయ్యేలా ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చిరునవ్వును ఇంటికి తీసుకెళతారు.స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రేమించినవాళ్లతోనూ కలిసి మళ్లీ మళ్లీ చూస్తారు. ఈ కథలోని అందం అదే. రెండున్నరేళ్ల ప్రయాణం ఈ సినిమా. దేవుడిగా నటించిన వెంకటేష్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. విష్వక్‌తో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అన్నారు. విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ‘‘నా జీవితం ‘ఓరి దేవుడా’కి ముందు, తర్వాత అన్నట్టుగా మారిపోనుంది. అంత మంచి సినిమా ఇది. ఈ అవకాశం నాకు రావడం అదృష్టం. దర్శకుడు అశ్వథ్‌ మేజిక్‌ పునరావృతం అయ్యింది. నా తొలి సినిమా సమయంలో  ట్రైలర్‌ని విడుదల చేసి దేవుడిలా అండగా నిలిచారు కథానాయకుడు వెంకటేష్‌. ఇందులో ఆయన దేవుడి పాత్రనే చేశార’’న్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్‌ కాకుమాను, నృత్య దర్శకుడు జేడీ, ఎడిటర్‌ విజయ్‌, కళా దర్శకుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు