Adipurush: ‘ఆదిపురుష్‌’ టికెట్లు.. వేల సంఖ్యలో కొన్నారు.. ఉచితంగా ఇస్తున్నారు..

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం.. ‘ఆదిపురుష్‌’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమా టికెట్లను ఎవరెవరు ఉచితంగా అందిస్తున్నారంటే?

Updated : 15 Jun 2023 16:29 IST

మ సినిమాని అత్యధిక మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆయా చిత్ర బృందాలు అప్పుడప్పుడూ టికెట్ల విక్రయంపై ఆఫర్లు ప్రకటించే సంగతి తెలిసిందే. సాధారణంగా కొందరు నిర్మాతలు ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా ఇస్తుంటారు. ఇంకొందరు భిన్నంగా.. తమ సినిమా కాన్సెప్ట్‌ బట్టి (కుటుంబ కథా చిత్రమైతే మహిళలకు, చిన్నారుల సినిమా అయితే వారికి మాత్రమే) టికెట్లపై ఆఫర్‌ ఇస్తుంటారు. మరి, సినిమాకు సంబంధించిన వారే కాకుండా ఇతర ప్రముఖులూ ఓ చిత్రాన్ని వీలైనంత ఎక్కువ మందికి చూపించాలనుకోవడం ఎప్పుడైనా విన్నారా? ‘ఆదిపురుష్‌’ (Adipurush) విషయంలో అదే జరుగుతోంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో ‘ఆదిపురుష్‌’ టీమ్‌ ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తుండగా.. మరికొందరు వేల సంఖ్యలో టికెట్లను కొని, పేదలకు అందిస్తున్నారు. ఎవరెవరు ఎన్ని టికెట్లు కొన్నారంటే?

రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా (Adipurush Release on June 16th) కాబట్టి.. రాముడి గురించి ఈతరానికి తెలియాలనే ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ (Abhishek Agarwal) ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 వేలకుపైగా టికెట్లను కొన్న ఆయన తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సింగర్‌ అనన్య బిర్లా (Ananya Birla) తమ వంతుగా ఒక్కొక్కరు 10 వేల టికెట్లు బుక్‌ చేసి, పేద చిన్నారులకు అందిస్తున్నారు.

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) సైతం ఇందులో భాగమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లో ఉంటున్న 2500 చిన్నారులకు ఈ సినిమాని ఉచితంగా చూపించనున్నట్టు తెలిపారు.

ప్రముఖ ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా (Shreyas Media) అధినేత శ్రీనివాస్‌ (Shreyas Srinivas).. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇవ్వనున్నుట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. వీటి సంఖ్య లక్షకుపైగా ఉండొచ్చని సమాచారం. అంటే.. మొత్తం 1,32,500లకిపైగా ‘ఆదిపురుష్‌’ టికెట్లు ఫ్రీ అని చెప్పొచ్చు. ఇండియన్‌ సినిమాలో ఇదొక కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది.

దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas).. రాఘవుడిగా నటించారు. జానకిగా కృతి సనన్‌ (Kriti Sanon) కనిపించనున్నారు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు శుక్రవారం రానుంది. 3డీలోనూ ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌కాగా అత్యధికంగా అమ్ముడయ్యాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని