నాకోసం అమ్మ నిర్మాతగా మారింది!

నాగశౌర్య... చూడ్డానికి పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, కానీ ఏ క్యారెక్టర్‌లోనైనా పక్కాగా ఇమిడిపోతాడు. హీరోగా చేస్తాడు, అదే సమయంలో మంచి సినిమా అంటే హీరోయిన్‌ పక్కన సాధారణ పాత్ర చేయడానికీ వెనకాడడు. నటుడు అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి

Updated : 02 Feb 2020 09:46 IST

నాగశౌర్య... చూడ్డానికి పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, కానీ ఏ క్యారెక్టర్‌లోనైనా పక్కాగా ఇమిడిపోతాడు. హీరోగా చేస్తాడు, అదే సమయంలో మంచి సినిమా అంటే హీరోయిన్‌ పక్కన సాధారణ పాత్ర చేయడానికీ వెనకాడడు. నటుడు అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు రచయితగానూ మారాడు. ‘నేనేది చేసినా సినిమా కోసమే’ అంటోన్న ఈ యువ కథానాయకుడు తాజాగా ‘అశ్వథ్థామ’ అవతారమెత్తాడు. ఆ సంగతులన్నీ మనతో పంచుకుంటున్నాడిలా...

నేను పుట్టింది ఏలూరులో. పెరిగింది విజయవాడ, హైదరాబాద్‌లలో. చిన్నపుడు అమ్మ నన్ను కొట్టిమరీ చదివించేది. ఇంటర్మీడియెట్‌కి వచ్చాక నాకు సినిమాలు ఇష్టమనీ, ఎప్పటికైనా నటుడిగా స్థిరపడతాననీ చెప్పాను. ఏం ఆలోచించిందో ఏమో, ‘నీ ఇష్టం. కానీ ముందు డిగ్రీ పూర్తిచెయ్యి’ అంది.
ఆ తర్వాత నుంచి చదవమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. చదువు విషయంలో అమ్మానాన్నలకి దిగులు లేకుండా చేశాడు అన్నయ్య. వాడు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. నేను డిగ్రీ చదువుతూనే అరుణ భిక్షు గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. 2007 నుంచి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఫొటోలు పంపడం, ఆడిషన్స్‌ ఇవ్వడం, వారి నుంచి ఎలాంటి పిలుపూ రాకపోవడం... దాదాపు ఆరేళ్లు ఇదే తంతు. రెండు సినిమాల్లో తక్కువ నిడివి పాత్రలు వస్తే వదల్లేక చేశాను. ‘వారాహి’ బ్యానర్‌లో నటించేందుకు కొత్తవాళ్లు కావాలన్న ప్రకటనని చూసి ఫొటోలు పంపాను. వారికి నచ్చి ఆడిషన్స్‌కి పిలిచారు. అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడు. డెమో వీడియోలు చూపించమంటే చూపించాను. ఆడిషన్స్‌ చేయించి మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేశారు. 20 రోజులైనా పిలుపు రాలేదు. దాని సంగతీ ఇక అంతే అనుకున్నాను. కానీ ఓరోజు వారాహి ఆఫీసుకి రమ్మని ఫోన్‌... వెళ్లి చూస్తే అక్కడ అవసరాల శ్రీనివాస్‌తోపాటు కీరవాణి, రాజమౌళి, నిర్మాత సాయి కొర్రపాటి, ఇంకా చాలామంది ఉన్నారు. ‘నువ్వే మా సినిమాలో హీరో’ అన్నారు శ్రీనివాస్‌. కీరవాణిగారి చేతులమీదుగా చెక్‌ అందించారు.
ఆ సినిమానే ‘ఊహలు గుసగుసలాడే’. చెక్‌ పట్టుకుని ఇంటికి వెళ్లి అమ్మానాన్నలకు చూపించాను. ‘నిజమేనా’ అంటూ హత్తుకున్నారు. ఆ చెక్‌ని ఇప్పటికీ డ్రా చేయలేదు.

అదే టర్నింగ్‌ పాయింట్‌...
2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ నాకు బ్రేక్‌ ఇచ్చింది. దాదాపు ఆరేళ్లపాటు సినిమా కష్టాలు పడ్డాను. ఆ కష్టాలు పడకపోతే ఈరోజు మీ ముందు ఉండేవాణ్ని కాదేమో. ఎందుకంటే సినిమా ఛాన్స్‌ దొరకడం ఎంత కష్టమో తెలిసినపుడే సినిమాల ఎంపికలోనూ నటనపరంగానూ జాగ్రత్త పడతాం. ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్టు చదివినపుడే అది హిట్‌ అవుతుంది అనిపించింది. అనుకున్నట్టే ఆ సినిమా హిట్‌ అయి నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఇండస్ట్రీలో కొనసాగగలను అన్న ధైర్యం నాకు వచ్చింది ఆ సినిమాతోనే. అదే సంవత్సరం వారాహి బ్యానర్‌లోనే చేసిన ‘దిక్కులు చూడకు రామయ్యా’ కూడా మంచి హిట్‌ అయింది. అప్పట్నుంచీ మరింత సీరియస్‌గా పనిచేయడం మొదలుపెట్టాను. కామెడీ, యాక్షన్‌ కంటే కూడా మంచి ఎమోషన్స్‌ ఉన్న కథల్నే ఎంచుకుంటాను. కేవలం కామెడీ చూపిస్తామంటే ప్రేక్షకులు జబర్దస్త్‌ చూసుకుంటారు. సినిమా హాల్‌ వరకూ రావాల్సిన పనిలేదు. కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి... ఇలా అన్నీ భావోద్వేగాలు ఉన్న కథల్ని చేస్తూ వచ్చాను. అన్నీ హిట్‌ కాలేదు. కానీ ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా సంబరపడలేదూ, కుంగిపోలేదు. అదంతా ప్రయాణంలో భాగమే అనుకుంటాను.

అందుకే సొంత బ్యానర్‌...
చుట్టూ జరిగే సంఘటల్ని పరిశీలించేటపుడు సినిమా కథగా రాయొచ్చనిపించేవి కొన్ని ఉంటాయి. సినిమాల్లో ఉండటం వల్లనేమో నాకు అలాంటి సంఘటనలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. దాంతో కథలు రాయడమూ మొదలుపెట్టాను. అలా రాసిందే ‘ఛలో’. ఆ కథని ఏడాదిపాటు రాశాను. స్క్రిప్టు దశలో ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుమల కూడా తోడయ్యాడు. స్క్రిప్టు పూర్తయ్యాక ఓ నిర్మాతని సంప్రదిస్తే ‘కథ బాగుంది. కానీ, బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది. నీ మార్కెట్‌కి అంత బడ్జెట్‌తో తీయలేను. దానికితోడు దర్శకుడికి ఇదే మొదటి సినిమా. రిస్కు చేయలేను’ అన్నాడు. ‘మరొక్కసారి ఆలోచించండి’ అని అడిగినా ససేమిరా కుదరదన్నాడు. చిన్నప్పట్నుంచీ నేను ఏ విషయాన్నీ అమ్మ దగ్గర దాచను. జరిగిందంతా అమ్మకి చెప్పాను. చాలా భావోద్వేగాలకు గురిచేసిన సందర్భం అది. ‘నువ్వు బాధ పడితే నేను చూడలేను నాన్నా. నేనే ఈ సినిమాకి నిర్మాతగా ఉంటా’ అని చెప్పింది. ‘ఏంటమ్మా ఎమోషన్లో ఏదో మాట్లాడుతున్నావు. సినిమా నిర్మాణం గురించి నాకే తెలీదు. నువ్వు ఎలా చేయగలవు’ అని అడిగాను. ‘చేస్తా నాన్నా’ అంది. నాన్న భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. ఆర్థికంగా మాది ఉన్నత కుటుంబమే. కానీ సినిమా నిర్మాణం గురించి ఏమీ తెలీదు. అమ్మకి నామీద ఉన్న ప్రేమ, దర్శకుడు వెంకీ మీద నాకున్న నమ్మకం కారణంగా సొంత బ్యానర్‌ ‘ఐరా క్రియేషన్స్‌’ ప్రారంభించాం. ఇంటి నుంచి ఎప్పుడూ బయటకు రాని అమ్మ నాకోసం రోజూ ఆఫీసుకి వచ్చేది. షూటింగ్‌ సమయంలోనే ఒక్కొక్క విషయమూ తెలుసుకుంటూ పనిచేసింది. నాన్న, బాబాయి కూడా షూటింగ్‌ ప్రారంభం నుంచి రిలీజ్‌ వరకూ సినిమా పనిమీదే ఉన్నారు. అన్నయ్య కూడా సినిమా రిలీజ్‌కి ముందే అమెరికా నుంచి వచ్చి  ప్రచార బాధ్యతల్ని తీసుకున్నాడు. ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది. మేం పెట్టినదానికి పది రెట్లు లాభాలు వచ్చాయి. ఏ నిర్మాణ సంస్థకైనా మొదటి సినిమా హిట్‌ రావాలి. లేకపోతే రెండో సినిమా తీయడానికి ధైర్యం చాలదు. అదృష్టంకొద్దీ మాకూ ‘ఛలో’ రూపంలో అది దొరికింది. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్లో, ఇంజినీర్లో అవుతారు. కానీ నటుడిగా నా కల తీర్చడానికి కుటుంబ సభ్యులంతా నాకు చేయూతనివ్వడం ఎంత అదృష్టం! ‘నాకోసం అంత కష్టపడే వాళ్ల రుణం ఎలా తీర్చుకోగలను’ అనిపిస్తుంది ఒక్కోసారి. నేను చేయగలిగిందల్లా వారికి చెడ్డపేరు తేకుండా ఉండటమే అనుకుంటాను.

మర్నాడే ప్రారంభిస్తా...
కొన్ని సినిమా కథలు విన్నపుడూ కాగితం మీదా బాగానే ఉంటాయి. కానీ సెట్స్‌మీదకు వెళ్లేసరికి చాలా మార్పులు వచ్చేస్తాయి. చాలామంది నటులు ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా అది తమ పరిధిలో లేని పని అనుకుని వదిలేస్తారు. అలాంటపుడు అవసరమైతే రీషూట్‌ చేయాలి. ఈ విషయంలో బయట నిర్మాతల్ని అన్నిసార్లూ ఒప్పించలేం. అదే సొంత నిర్మాణ సంస్థ అయితే ధైర్యం చేయగలం. అలాగని సినిమా ఫలితం పూర్తిగా మనచేతుల్లోనే ఉంటుందని అనను. ‘ఛలో’ తీస్తున్నపుడే మంచి హిట్‌ అవుతుందనుకున్నాం. ‘నర్తనశాల’ బాగా రావడం లేదని ముందే తెలిసిపోయింది. సినిమా ప్రకటించాం కాబట్టి పూర్తిచేశాం. మా బ్యానర్‌లో రెండు సినిమాల అనుభవంతో ‘అశ్వథ్థామ’ తీశాం. దీనికి కథ నేనే రాశాను. ముంబయి, దిల్లీల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కథకు మూలం. దర్శకుడు రమణ తేజ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ స్క్రిప్టు విషయంలో సాయపడ్డారు. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలీదు. సినిమా చేస్తున్నంతసేపూ దానిమీదే దృష్టి ఉంటుంది. మధ్యలో ఏదైనా సంఘటన, వార్త కథకి స్ఫూర్తినిస్తే దాని లైన్‌ రాసిపెట్టుకుంటాను. చేస్తున్న సినిమా రిలీజైన మరుసటి రోజునుంచే కొత్త స్క్రిప్ట్‌ రాయడంమీద దృష్టి పెడతాను. సినిమా హిట్‌ అయితే ఎంతో ఉత్సాహంగా, ఫట్‌ అయితే మరెంతో శ్రద్ధగా కథ రాస్తాను. నటించడం, కథలు రాయడం, సొంత నిర్మాణ సంస్థని నడపడం... ఇవన్నీ భారం అనుకోను. బాధ్యత అనుకుంటాను. నచ్చిన రంగంలో పనిచేయాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే. నిర్మాతగా రూపాయికి రూపాయి రాకపోయినా ఫర్వాలేదు, పోకూడదు అనుకుంటాను.

సినిమా స్నేహితులు
సినీ పరిశ్రమలో నాకు చాలా మంచి స్నేహితులున్నారు. వారిలో ముందుండేది అవసరాల శ్రీనివాస్‌, నందినీరెడ్డి. సినిమా కథలు రాయడం మొదలుపెట్టాక ప్రాథమికంగా అనుకున్న లైన్‌ని వీరిద్దరికీ చెబుతాను. వాళ్ల సలహాలూ, సూచనల మేరకు స్క్రిప్టుమీద పనిచేస్తాను. వాళ్ల రైటింగ్‌ శైలి నాకు నచ్చుతుంది. నారా రోహిత్‌ నాకు మంచి స్నేహితుడు. సినిమా కోసం 24 గంటలూ కష్టపడి ఒత్తిడికి గురవుతానని నా గురించి ఆందోళన చెందుతాడు. ‘ఇష్టంతో పడుతున్న కష్టం’ అని సర్దిచెబుతాను. హీరోయిలో మాళవిక, నిహారిక, రష్మిక, రాశీఖన్నా మంచి స్నేహితులు. సినిమాలకు సంబంధంలేని ఎన్నో విషయాల్ని మేం మాట్లాడుకుంటుంటాం.


కార్లంటే ఇష్టం...

నాన్న శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి. అమ్మ ఉష, అన్నయ్య గౌతమ్‌. ఇదే మా కుటుంబం.
* భోజనప్రియుణ్ని. బిర్యానీ, మటన్‌, కీమా నుంచి టమోటా పప్పు, ఆలూ ఫ్రై వరకూ అన్నీ తింటాను. వ్యాయామం కండల కోసం కాదుగానీ ఫిట్‌నెస్‌ కోసం చేస్తాను. కానీ అశ్వథ్థామ కోసం మాత్రం కండలు పెంచాను. లవర్‌బాయ్‌ లుక్‌కి కాస్త బ్రేక్‌ ఇచ్చినట్లూ ఉంటుందనిపించింది. అలాగని ఎప్పటికీ ఇలానే ఉండిపోను.
* ట్రావెలింగ్‌ అంటే చిరాకు. పనిలేకపోతే ఇంట్లోనే ఉంటాను. అదే నాకు హాలిడే ట్రిప్‌. ఇంట్లో నచ్చిన సినిమాలు చూస్తాను, పెట్స్‌తో ఆడుకుంటాను. నచ్చింది వండించుకుని తింటాను. రిలాక్స్‌ అవడమంటే శరీరానికీ కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ట్రావెలింగ్‌ పేరుతో బ్యాగులు సర్దుకుని ఫ్లైట్‌ల కోసం గంటలకొద్దీ వెయిట్‌ చేయడం నాకు నచ్చదు.
* పుస్తకాలు చదవను. కానీ సినిమా కథకోసం అవసరమైన పుస్తకాల్ని తిరగేస్తా.

* ‘ఐరా’ సరస్వతీదేవి పేరు. నాకు ఏనుగులంటే ఇష్టం. ఐరావతం పేరునుంచీ రెండు అక్షరాలూ కలిసొచ్చేలా మా సంస్థకి ఆ పేరుపెట్టాం.
* నాకు కార్లంటే పిచ్చి. అమ్మానాన్న నాకు కార్లనే గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. పోర్షె, బెంజ్‌, ఆడి... ఇలా 13 కార్లు ఉన్నాయి నా దగ్గర. బాధ కలిగినా, సంతోషం అనిపించినా లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తుంటా. షూటింగ్‌ కోసం వైజాగ్‌ కూడా కారులోనే వెళ్లిపోతుంటాను.
* ప్రస్తుతం పీపుల్స్‌ మీడియా, నార్త్‌స్టార్‌, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లలో మూడు సినిమాలు చేస్తున్నాను.


‘బూ’ రోజంతా నాతోనే!

నా పెట్‌ ‘బూ’ గురించి చెప్పాలి. దానికిపుడు తొమ్మిది నెలలు. 40 రోజుల వయసునుంచి నాతోనే ఉంటోంది. అశ్వథ్థామ డైరెక్టర్‌ రమణతేజ దీన్ని ఇటలీ నుంచి తెప్పించి నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది ‘కేన్‌ కోర్సో’ జాతికి చెందిన కుక్క. ఇవి 2-3 ఉంటే పులిని కూడా చంపేయగలవు. అంత శక్తి ఉంటుంది వీటికి. కానీ నేను దీన్ని చాలా సాత్వికంగా మార్చేశాను. నాతోపాటు షూటింగ్‌లకు తీసుకువెళ్తుంటాను. గొలుసు కూడా కట్టను. దాంతో మనుషుల మధ్య ఉండటానికి అలవాటు పడిపోయింది. నా పక్కనే పడుకుంటుంది, ఇప్పటివరకూ 23 డాగ్స్‌ పెంచాను. వాటిని ఫ్రెండ్స్‌, కజిన్స్‌ పెంచుకుంటామంటే ఇచ్చేశాను. నేను కూడా వాటితో టైమ్‌ గడపలేకపోయేవాణ్ని. అందుకే ‘బూ’కి నాతోపాటే ఉండటం అలవాటు చేశాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని