ఆయనతో గొడవపడి ఆకాశం రంగు మార్చా!

కథానాయికలను అందంగా చూపినా, తన భక్తి సినిమాలతో ప్రేక్షకులు చేతులెత్తి నమస్కరించేలా చేసినా దర్శకేంద్రుడు

Published : 05 Jan 2020 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కథానాయికలను అందంగా చూపినా, తన భక్తి సినిమాలతో ప్రేక్షకులు చేతులెత్తి నమస్కరించేలా చేసినా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకే చెల్లింది. వెండితెరపై ఎన్నో అద్భుత దృశ్య కావ్యాలను తీర్చిదిద్దారాయన. చంద్రమోహన్, శ్రీదేవిలతో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పదహారేళ్ల వయసు’. ఇది ఓ తమిళ సినిమాకు రీమేక్‌. అందులో క్లైమాక్స్‌.. కథానాయిక హీరో కోసం వేచి చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేక్షకుడికి అతను ఆమె కోసం వస్తాడా, రాడా? అనే ఉత్కంఠ ఉంటుంది. దానికి సమాధానం ఇవ్వకుండా అయోమయానికి గురిచేశారు తమిళ దర్శకుడు భారతీరాజా. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆ సందేహం మిగల్చకుండా హ్యాపీ ఎండింగ్‌ ఇవ్వాలని భావించారట రాఘవేంద్రరావు.

ఇందుకు క్లైమాక్స్‌ను కొంచెం మార్చారు. శ్రీదేవి జైలుకెళ్లిన చంద్రమోహన్‌ రాక కోసం రైల్వే స్టేషన్‌లో ఎదురు చూసి ఎంతకీ రాకపోవడంతో బాధతో తిరిగి వెళ్లిపోతుంటుంది. అదే సమయంలో ఎదరుపడతాడు చంద్రమోహన్‌. అందరూ అనుకున్నట్టుగానే శ్రీదేవి మెడలో తాళి కడతాడు. ఇలాంటి అద్భుత సన్నివేశాన్ని సాధారణంగా చూపిస్తే బాగుండదని భావించిన రాఘవేంద్రరావు కెమెరామెన్‌ ప్రకాష్‌కు చంద్రమోహన్‌ తాళి కడుతున్నప్పుడు ఆకాశం రంగులు మారినట్టు చూపించిమని చెప్పారట. ‘ఆకాశం రంగులు మారదు, దాన్ని ఎలా చూపిస్తాం? అని ప్రకాష్‌ చెప్పినా వినకుండా బలవంతంగా ఆయనతో అలా చేయించాను. అందుకే హీరో హీరోయిన్‌ మెడలో తాళి కడుతున్నప్పుడు ఆకాశం రంగు మారడం, దానికి నేపథ్య సంగీతం తోడవడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టార’ని ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని