Chiranjeevi: పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...

అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు.

Published : 16 Mar 2023 13:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించిన, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. ఇక వారి సినిమాలు వస్తున్నాయంటే.. పండుగ వాతావరణం నెలకొనేది. జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన కథానాయకుడిని చూడాలని ఉవ్విళ్లూరుతుండేవారు. ‘ఫలానా చోట ఫలానా హీరో వచ్చాడంటరా!’ అని ఎవరైనా చెబితే ఉన్న పనులన్నీ పక్కనపెట్టి పరుగు పరుగున అక్కడకు వెళ్లిపోయేవారు. ఇప్పుడు కూడా షాపింగ్‌మాల్స్‌ ప్రారంభోత్సవం అంటే ఇలాగే వస్తున్నారునుకోండి. అయితే అప్పట్లో తమ అభిమాన కథానాయకుడు వస్తున్నాడన్న సంగతి విని వెళ్తే ఏమైందో తెలుసా..!

అప్పట్లో కొంతమంది అభిమానులు పద్మాలయా స్టూడియోలో షూటింగ్‌ చూడ్డానికొచ్చారు. చూసి, బయల్దేరుతూ ఉండగా, టెలిఫోన్‌ సంభాషణ విన్నారు. ‘‘నువ్వు అక్కడే ఎయిర్‌పోర్ట్‌లో ఉండు.. టికెట్స్‌ ఒకే అయ్యాయి. కదా! సరే... శరత్‌బాబుగారు ఇక్కడి నుంచే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేస్తారు. చిరంజీవిగారిని తీసుకుని నువ్వు అక్కడికి వచ్చేయ్‌. జాగ్రత్త...’’ అదీ సంభాషణం. స్టూడియో నుంచి బయలుదేరుతున్న సందర్శకులు టక్కున ఆగారు. చిరంజీవి! ఎయిర్‌పోర్ట్‌! ‘‘మనం వెంటనే వెళ్లి ఎయిర్‌పోర్ట్‌ దగ్గర నిలబడితే చిరంజీవి గారిని చూడొచ్చు. ఆటోగ్రాఫ్‌ తీసుకోవచ్చు. గొప్ప అవకాశం... పదండి’’ అని పరుగులెత్తారు. విమానాశ్రయానికి శరత్‌బాబు వచ్చేశారు. విమానం వెళ్లే టైమ్‌ దగ్గర పడుతోంది. మరి, చిరంజీవి? ఆత్రుత పట్టలేక శరత్‌బాబునే అడిగారు. ‘‘సార్‌, మీ పేరు, చిరంజీవి పేరూ ఫోన్‌లో విన్నాం. చూడాలని పరుగెత్తుకొచ్చాం... మరి ఆయన ఎక్కడ సార్‌?’’ శరత్‌బాబు ఫక్కున నవ్వి ‘‘సారీ బాబూ... మీరు విన్నది కరెక్టే. చిరంజీవి గారంటే- ఈయనే. నా మేకప్‌మేన్‌. ఈయన పేరు విని మీరు ఆ చిరంజీవి అనుకున్నారు. పాపం...’’ అనడం అభిమానులు నీరుకారిపోవటం ఒక్కసారే జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని