ఒక సమాధానం ఆమె జీవితాన్నే మార్చేసింది

చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి కుటుంబంపై ఆధారపడిన ఆమె.. తనకున్న తెలివితేటలతో, తల్లిదండ్రుల సహకారంతో ఇంటి గడప దాటి బుల్లితెరపై మెరిసింది. అంతే ఆమె కృషికి అదృష్టం తోడై.. ఒక్కసారిగా కోటీశ్వరాలుగా మారింది. శారీరకంగా లోపం ఉన్నప్పటికీ...

Updated : 22 Jan 2020 17:24 IST

రూ.కోటి సొంతం చేసుకున్న దివ్యాంగురాలు

చెన్నై: చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి కుటుంబంపై ఆధారపడిన ఆమె.. తనకున్న తెలివితేటలతో, తల్లిదండ్రుల సహకారంతో ఇంటి గడప దాటి బుల్లితెరపై మెరిసింది. అంతే ఆమె కృషికి అదృష్టం తోడై.. ఒక్కసారిగా కోటీశ్వరురాలుగా మారింది. శారీరకంగా లోపం ఉన్నప్పటికీ తెలివి తేటల్లో ఇతరులకు ఏమాత్రం తీసిపోనని ఆమె నిరూపించింది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’.. అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద రియాల్టీ గేమ్‌ షో. ఈ కార్యక్రమాన్ని తమిళంలో ‘కోటీశ్వరి’ అనే పేరుతో ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి అగ్రకథానాయిక రాధిక శరత్‌ కుమార్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ ఎపిసోడ్‌లో మధురైకు చెందిన కౌశల్య కార్తీక అనే దివ్యాంగురాలు పాల్గొన్నారు. 

ఆమె రూ.కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి మొదటిసారి కోటి గెలుచుకున్న కంటిస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఆమెను కోటీశ్వరాలిని చేసిన ఆ ప్రశ్న ఏమిటంటే.. ‘1948లో ప్రచురించిన ఏ నవలలో పులకేశి-2 రాజు.. తమ్ముడు నాగ నంది గురించి ప్రస్తావించారు?’ దీనికి కార్తీక ‘శివగామియిన్‌ సబాతామ్‌’ అనే సరైన సమాధానాన్ని చెప్పి రూ.కోటిని తన సొంతం చేసుకున్నారు. రియాల్టీ షో అనంతరం ఆమె విలేకర్లతో తన భావాలను వ్యక్తం చేస్తూ..  ‘చిన్నతనం నుంచి నా రోజువారీ జీవితంలో ప్రతి పని కోసం తల్లిదండ్రులపై ఆధారపడే దాన్ని. జీవితంలో ఎలాగైనా రాణించాలని నిర్ణయించుకున్నాను. నా కలలను సాకారం చేసుకునేందుకు అవకాశం కల్పించిన రియాల్టీ షో వారికి ధన్యవాదాలు. ప్రముఖ నటి రాధిక వ్యాఖ్యాతగా వ్యవహిరించిన ఈ షోలో పాల్గొని హాట్‌ సీట్‌లో కూర్చొవడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను  విజేతను అయ్యానని ఈ ప్రపంచానికి గర్వంగా చెబుతున్నాను. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి నావంతు సాయం చేస్తాను. నేను  విద్యనభ్యసించిన నాగర్‌కోయిల్‌లోని మూగ, చెవుడు పాఠశాలకు నావంతు సాయం అందిస్తాను. ఇటలీ లేక స్విట్జర్లాండ్‌ వెళ్లాలనే నా కలను నెరవేర్చుకుంటాను’ అని తన భావాన్న వ్యక్తం చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని