వినోదాల తెర వెనక విషాద ఘటనలు

సగటు ప్రేక్షకుడి కోణంలో చూస్తే.. సినిమా అంటే రెండున్నర గంటల పాటు అలరించే మూడక్షరాల పదం. కానీ.. సినిమాను నమ్ముకున్న వాళ్లకు మాత్రం సినిమా అంటే తిండి పెట్టే కళ, సినిమానే జీవితం, సినిమానే ప్రాణం.

Updated : 21 Feb 2020 10:15 IST

సినిమా చిత్రీకరణలో ఘోర ప్రమాదాలు

సగటు ప్రేక్షకుడి కోణంలో చూస్తే.. సినిమా అంటే రెండున్నర గంటల పాటు అలరించే మూడక్షరాల పదం. కానీ.. సినిమాను నమ్ముకున్న వాళ్లకు మాత్రం సినిమా అంటే తిండి పెట్టే కళ, సినిమానే జీవితం, సినిమానే ప్రాణం. అందుకే నిద్రాహారాలు మాని మరీ రాత్రింబవళ్లు దాని కోసం చెమటోడుస్తుంటారు. కష్టమొచ్చినా.. నష్టమెచ్చినా.. దానితోనే బతికేస్తుంటారు. ఈ క్రమంలో అనుకోని ప్రమాదాల రూపంలో మృత్యువు సినిమా సెట్లోకి దూసుకొచ్చి వాళ్లను వాళ్ల కుటుంబాల నుంచి దూరం చేసిన సంఘటనలు సినీ చరిత్ర తరచి చూస్తే ఎన్నో ఉన్నాయి. అందులో బయటికి వచ్చినవి కొన్ని మాత్రమే బయటికి రానివి మరెన్నో. తాజాగా ‘భారతీయుడు2’ సెట్స్‌లో జరిగిన ప్రమాదం చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచి వేసింది. ఇలాంటి విచారకర సంఘటనలను తరచి చూస్తే..  

* విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘భారతీయుడు2’ చిత్రీకరణలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ సమయంలో క్రేన్‌కు కట్టిన రోప్‌ తెగిపోవడంతో అది కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై భారతీయ సినీ పరిశ్రమ మొత్తం స్పందించింది. దేశ సినిమాకు ఇది ఒక చీకటి దినంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. 

* 2016లో బెంగళూరు జాతీయ రహదారిపై ‘మాస్తిగుడి’ అని అనే సినిమా చిత్రీకరిస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఇద్దరు నటులు నీటిలో గల్లంతయ్యారు. ఫైట్‌ సన్నివేశంలో భాగంగా హీరో విజయ్‌తో పాటు అనిల్‌, ఉదయ్‌ అనే ఇద్దరు నటులు హెలికాప్టర్‌ నుంచి ఒక చెరువులో దూకాల్సి ఉంటుంది. విజయ్‌ నీటిలో దూకి ఈదుతూ బయటికి రాగా. మిగిలిన ఇద్దరు మాత్రం నీటిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే, హెలికాప్టర్‌ నుంచి దూకే క్రమంలో వాళ్లు రక్షణగా ఎలాంటి లైఫ్‌ జాకెట్లు వేసుకోకపోవడం గమనార్హం.

* 2017లో ‘పద్మావత్‌’ షూటింగ్‌ సందర్భంగా భవనంపై నుంచి పడి పెయింటర్‌ ప్రాణాలు కోల్పోయాడు.

* 1993లో అజిత్‌ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా తీస్తున్న క్రమంలో ఆ చిత్ర దర్శకుడు, గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్‌ సముద్ర అలల తాకిడికి ప్రాణాలు కోల్పోయారు. సినిమా ప్రారంభించిన తొమ్మిదో రోజే ఆయన మరణించారు. ఆ తర్వాత సినిమా బాధ్యతలను ఆయన తండ్రి గొల్లపూడి మారుతీరావు భుజాలపై వేసుకొని తన స్వీయ దర్శకత్వంలో సినిమా పూర్తి చేశారు. ఆయన జ్ఞాపకార్థం జాతీయ స్థాయిలో గొల్లపూడి శ్రీనివాస్‌ పురస్కారాలు అందజేస్తున్నారు.

* 2017లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కాలా’ చిత్రీకరణ సందర్భంగా విద్యుదాఘాతంతో సినిమా సెట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో టెక్నీషియన్‌ మైఖేల్‌ ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు రూ.5కోట్ల విలువైన సామగ్రి కాలి బూడిదైంది.

 2009లో సంవత్సరంలో ‘మగధీర’ షూటింగ్‌ సమయంలోనూ పీటర్‌ హెయిన్స్‌ తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌తో పాటు గాల్లోకి ఎగిరే సన్నివేశంలో తాడు ఊడిపోవడంతో దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డారు. ఆ ప్రమాదంలో ఆయన 19 ఎముకలు విరిగాయి. ఆయన చావుబతుకుల మధ్య చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకున్నారు.

* 2018లో తమిళ హీరో విజయ్‌ ‘బిగిల్‌’ చిత్రీకరణలోనూ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలో జరిగిన ఈ ఘటనలో సెల్వరాజ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 

* 2019లో ‘సైరా’ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లోని టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఫాంహౌస్‌లో ప్రత్యేకంగా ఒక సెట్‌ ఏర్పాటు చేశారు. ఓ రోజు ఉదయం ఆ సెట్‌కు నిప్పంటుకొంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ, రూ.కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

* 2019లో తమిళ ‘96’ రీమేక్‌ ‘జానూ’ సినిమా చిత్రీకరణ సందర్భంగా హీరో శర్వానంద్‌ గాయపడ్డారు. థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. దీంతో శర్వానంద్‌ కాలు, భుజాలకు తీవ్రంగా గాయాలయ్యాయి. శస్త్ర చికిత్స అనంతరం ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు.

* 1980లో మలయాళం సినిమా కొలిలక్కమ్‌ సినిమా చిత్రీకరణలో హెలికాప్టర్‌ ప్రమాదంలో జయన్‌ అనే స్టార్‌ నటుడు ప్రాణాలు కోల్పోయారు.

బాలీవుడ్‌లో..

* 1982లో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ‘కూలీ’ షూటింగ్‌ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు మరణపుటంచులు తాకి వచ్చారు. ఫైట్‌లో భాగంగా బిగ్‌బీ ఒక టేబుల్‌పై దూకే సీన్‌ అది. అలా దూకే క్రమంలో టేబుల్‌ అంచున ఉండే పదునైన భాగం అమితాబ్‌కు బలంగా తాకి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రమాదంలో బిగ్‌బీ దాదాపు అరగంట పాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. ఆ ఘటనను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇప్పుడున్నది నిజంగా తనకు పునర్జన్మే అని అమితాబ్‌ అంటుంటారు.

* 2016లో డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌కు అసిస్టెంట్‌గా ఉన్న సొహైల్‌ షా ప్రాణాలు కోల్పోయాడు. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపుర్‌ సిరీస్‌ చిత్రీకరణ సమయంలో జీపు నడుపుతూ ఒక బ్రిడ్జిపై నుంచి పడి మరణించాడు. 

* 2016లో ఫోర్స్‌2 చిత్రీకరణలో భాగంగా హీరో జాన్ అబ్రహం మోకాలికి తీవ్రంగా గాయమైంది. రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది.

* ఇటీవల ‘జెర్సీ’కి బాలీవుడ్‌ రీమేక్‌లో హీరోగా నటిస్తున్న షాహిద్ కపూర్ షూటింగ్‌ సందర్భంగా గాయపడ్డారు. చిత్రీకరణలో భాగంగా క్రికెట్‌ ఆడే క్రమంలో షాహీద్‌ ముఖానికి బంతి బలంగా తాకింది. తీవ్ర రక్తస్రావంతో మొహంపై గాయమైంది. దీంతో షాహిద్‌ చాలా కాలం సినిమా షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

హాలీవుడ్‌లో..

* 2014లో ‘మిడ్‌నైట్‌ రైడర్‌’ అనే సినిమా చిత్రీకరణలో భాగంగా అసిస్టెంట్‌ కెమెరామన్‌ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రైల్వే ట్రాక్‌పై షూటింగ్‌ చేస్తున్న క్రమంలో సారా జోన్స్‌ను రైలు ఢీకొట్టింది. అయితే, సినిమా షూటింగ్‌ కోసం రైల్వే అధికారుల నుంచి చిత్ర బృందం ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం గమనార్హం. ఆ సినిమా నిర్మాత రాండల్‌ మిల్లర్‌ సంవత్సరం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

* 1994లో ఓ సినిమా షూటింగ్‌లో తుపాకీ పేలి నటుడు బ్రాండన్‌ లీ ప్రాణాలు కోల్పోయాడు. విలన్‌ పాత్రలో నటిస్తున్న లీని హీరో కాల్చే క్రమంలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల మరణించాడు. నిజానికి లీని కాల్చే సమయంలో తుపాకీ ఖాళీగా ఉండాల్సి ఉంది. కానీ, ఆ తుపాకీలో బుల్లెట్లు నింపి ఉండటంతో లీ శరీరంలో బుల్లెట్‌ దిగి అతను తుది శ్వాస విడిచాడు.

* 1985లో ‘రాఖీ 4’ షూటింగ్‌లో భాగంగా హీరో, విలన్ల మధ్య బాక్సింగ్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా హీరో సైల్వెస్టర్‌ స్టాలోన్‌ కడుపులో డాల్ఫ్‌ లంగ్రెన్‌(విలన్‌) బలమైన పంచ్‌ ఇవ్వడంతో హీరో అక్కడికక్కడే కుప్ప కూలాడు. దాదాపు 9 రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చింది.

* 1986లో ‘ఆర్మార్‌ ఆఫ్‌ గాడ్‌‌’ సినిమా చిత్రీకరణలో భాగంగా స్టార్ హీరో జాకీ చాన్‌ దాదాపు చావు నుంచి బయటపడ్డారు. 25 అడుగుల ఎత్తు నుంచి ఓ చెట్టుపై దూకే క్రమంలో చెట్టుపై కాకుండా బండరాయిపై పడ్డారు. దీంతో ఆయన తలలోని ఒక ఎముక విరిగి మెదడులోకి గుచ్చుకుంది. చికిత్స అనంతరం జాకీచాన్‌ కొలుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని