‘ఆర్జీవీ చిత్రాన్ని 50శాతం కట్‌ చేయమన్నారు’

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంతో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘గోవిందా గోవిందా’. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు...

Published : 20 May 2020 14:04 IST

ఆర్థికంగా వెనుకబడిన వైజయంతీ మూవీస్‌ ఎలా పైకి వచ్చిందంటే..

హైదరాబాద్‌: నాగార్జున, శ్రీదేవి జంటగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోవిందా గోవిందా’ చిత్రం అప్పట్లో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలో నిర్మాత అశ్వనీదత్‌ ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ‘వింటేజ్‌ వైజయంతీ’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోకు జగపతిబాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

‘వైజయంతీ మూవీస్‌ ప్రతి సినిమా వెనుక ఒక కథ ఉంది. కష్టం ఉంది. ఛాలెంజ్‌ కూడా ఉంది. అలా చేసిన చిత్రమే ‘గోవిందా గోవిందా’. దత్తుగారి ఇష్టదైవం శ్రీవేంకటేశ్వర స్వామి మీద తెరకెక్కించిన చిత్రం. అలరించే పాటలు, అద్భుతమైన చిత్ర నిర్మాణం.. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తాయి. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌తో మొదటి ఇబ్బంది ఎదురైంది. దాదాపు 50 శాతాన్ని కట్‌ చేయాలని వాళ్లు నిర్ణయించారు. మొత్తానికి నిర్మాత వారితో వాదించి, గొడవపడి చివరికి అనుకున్న విధంగా 1993లో చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ చిత్రానికి దేవుడి దీవెన మాత్రం దొరకలేదు. సినిమా బాగా ఆడలేదు. ఈ సినిమా ఫ్లాప్‌ వల్ల వైజయంతీ మూవీస్‌ ఆర్థికంగా పది అడుగులు వెనక్కి వెళ్లింది. అలాంటి సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి దత్తుగారితో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘శుభలగ్నం’ చిత్రం తెరకెక్కింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది’ అని జగపతిబాబు తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని