RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అవార్డుల పంట.. హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కి నెట్టి..

రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటింది.

Updated : 25 Feb 2023 10:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మరోసారి సత్తా చాటింది. గ్లోబల్‌ లెవల్‌లో ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా మరో ప్రతిష్ఠాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్‌(Hollywood)లో విశేషంగా భావించే ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ (Hollywood Critics Association) అవార్డుల్లో ఈ చిత్రం ఏకంగా ఐదింటిని సొంతం చేసుకుంది. ‘బెస్ట్‌ స్టంట్స్‌’, ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, ‘బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌’ (నాటు నాటు) (Naatu Naatu), ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్’ ఇలా పలు విభాగాల్లో ‘బ్లాక్‌ పాంథర్‌’, ‘ది వుమెన్‌ కింగ్‌’, ‘ది బ్యాట్‌ మ్యాన్‌’ వంటి విదేశీ చిత్రాలను వెనక్కి నెట్టి మన సినిమా విజయాన్ని అందుకుంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా పేరు సొంతం చేసుకుని ‘హెచ్‌సీఏ స్పాట్‌లైట్‌’ అవార్డును సైతం ఇది దక్కించుకుని భారతీయ సినిమా ఖ్యాతిని మరింత పెంచింది.

రాజమౌళి విన్నపం..!

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)కు బెస్ట్‌ స్టంట్స్‌ అవార్డును అందించిన హెచ్‌సీఏ (HCA) సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎంతగానో శ్రమించి ఇందులో స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్‌, క్లైమాక్స్‌లో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు కంపోజ్‌ చేసిన జూజీతోపాటు మా సినిమా కోసం భారత్‌కు వచ్చి.. మా విజన్‌ అర్థం చేసుకుని.. మాకు అనుగుణంగా మారి.. కష్టపడి పనిచేసిన ఇతర స్టంట్‌ మాస్టర్స్‌ అందరికీ కృతజ్ఞతలు. సినీ ప్రియులను అలరించడం కోసం స్టంట్స్‌ మాస్టర్స్‌ ఎంతో శ్రమిస్తుంటారు. కాబట్టి ఈ సభా ముఖంగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందించే బృందాలకు నాది ఒక చిన్న విన్నపం. ఇకపై మీ అవార్డుల జాబితాలో స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ విభాగాన్ని కూడా చేర్చాలని నేను కోరుతున్నాను. సినిమాలోని రెండు, మూడు షాట్స్‌లో మాత్రమే డూప్స్‌ని ఉపయోగించాం. మిగతావన్నీ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌నే స్వయంగా చేశారు. వాళ్లిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. 320 రోజులపాటు ఈచిత్రాన్ని షూట్‌ చేయగా.. అందులో ఎక్కువ భాగం స్టంట్స్‌ కోసమే పనిచేశాం. ఇది కేవలం నాకు, నా చిత్రానికే కాదు మా భారతీయ చిత్రపరిశ్రమకు దక్కిన గౌరవం. మేరా భారత్‌ మహాన్‌. జై హింద్‌’’ అని రాజమౌళి (Rajamouli) తెలిపారు.

పాటతో థ్యాంక్యూ..! 

‘‘నాటు నాటు’(Naatu Naatu)కు అవార్డును అందించిన హెచ్‌సీఏ వారికి ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప గౌరవాన్ని నాకు సొంతమయ్యేలా చేసిన రాజమౌళికి థ్యాంక్యూ’’ అంటూ కీరవాణి (Keeravani) పాట పాడారు. 

ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు..!

‘‘దాదాపు 600 మంది బృందంతో కొన్ని సార్లు 2000 కంటే ఎక్కువమంది ఆర్టిస్టులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మా టాలెంట్‌ని గుర్తించిన హెచ్‌సీఏ వారికి మరోసారి కృతజ్ఞతలు. ఈ సినిమా కథా రచయిత, నా తండ్రి విజయేంద్ర ప్రసాద్‌, సంగీత దర్శకుడు, నా సోదరుడు కీరవాణి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, నా సతీమణి రమా, సినిమాటోగ్రాఫర్‌ సింథిల్‌ కుమార్‌, ఎడిటర్‌.. ఇలా ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు’’ అని రాజమౌళి (Rajamouli) అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని