Oppenheimer: విమర్శలను ఎదుర్కొని విజేతగా నిలిచి.. ‘ఓపెన్‌హైమర్‌’ ఆసక్తికర విషయాలివే..

క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఓపెన్‌హైమర్‌’ ఏడు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.

Updated : 11 Mar 2024 11:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఓపెన్‌హైమర్‌’ చిత్రం పేరే వినిపిస్తోంది. విడుదలైన దగ్గర నుంచి వార్తల్లో నిలిచిన ఈ సినిమా.. సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా 7 కేటగిరీల్లో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది (Oscar Awards 2024). హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఓపెన్‌హైమర్‌’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..

మూడేళ్ల కష్టం..

దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌  ‘ఓపెన్‌హైమర్‌’ కోసం మూడేళ్లు కష్టపడ్డారు. 2020లో వచ్చిన ‘టెనెట్‌’ తర్వాత ఆయన పూర్తి శ్రద్ధ ఈ చిత్రంపైనే పెట్టారు. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచి విజువల్‌ వండర్‌ను సృష్టించారు. ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ వరించింది.

శృంగార సన్నివేశంపై భయం..

సాధారణంగా నోలన్‌ సినిమాల్లో మనసును కదిలించే దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ‘ఓపెన్‌హైమర్‌’లో (Oppenheimer)  మొదటిసారి శృంగార సన్నివేశాన్ని చేర్చారు. ఈ సీన్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పనులు చేయాలంటే సవాలుగా ఉంటుంది. ఈ సీన్‌ పెట్టాలంటే భయపడ్డాను. తగు జాగ్రత్తలు తీసుకున్నాను’ అన్నారు.

మొదటి బయోపిక్‌..

క్రిస్టఫర్‌ నోలన్‌  తెరకెక్కించిన మొదటి బయోపిక్‌ ‘ఓపెన్‌హైమర్‌’ కావడం విశేషం. దీన్ని 'ది ట్రయంఫ్ అండ్‌ ట్రాజెడీ ఆఫ్ జె రాబర్ట్ ఓపెన్‌హైమర్' అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు.

సత్తాచాటిన ఓపెన్‌ హైమర్‌.. అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక

ఎక్కువ నిడివి చిత్రమిదే..

ఈ ఆస్కార్‌ విన్నింగ్‌ దర్శకుడు ‘ఓపెన్‌హైమర్‌’ నిడివి విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రం ఇంటర్‌ స్టెల్లార్‌ 2 గంటల 49 నిమిషాల నిడివి ఉండగా.. ఈ చిత్రం మూడు గంటల రన్‌టైమ్‌తో ఆయన చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. అంత పెద్ద చిత్రమైనప్పటికీ దీనికి విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది.

సీజీఐ లేకుండానే..

ఈ సినిమాలో సీజీఐ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ)ను ఉపయోగించకపోవడం గమనార్హం. ఇందులోని న్యూక్లియర్‌ పేలుడు దృశ్యాలతో కూడిన క్లైమాక్స్‌లో సీజీఐ సాయం లేకుండా రీక్రియేట్‌ చేశారు. దీనిపై  మాట్లాడుతూ.. క్వాంటమ్‌ డైనమిక్స్‌, ఫిజిక్స్‌ను వీలైనంత వాస్తవికంగా చిత్రీకరించాలనుకొని ఇలా చేసినట్లు వెల్లడించారు.

విమర్శలూ ఉన్నాయి..

గతేడాది జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై విమర్శలూ వచ్చాయి. ఈ సినిమాలోని ఓ శృంగార సన్నివేశంలో మతగ్రంథాలను చూపించడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్‌ కాదంటూ పోస్ట్‌లు పెట్టారు. ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని